Fashion

ఆఫ్ షోల్డర్లతో అన్ని సమయాల్లో మెరిసిపోవచ్చు

Womens Off Shoulder Fashion Is New Trend-Needs no special event

ఆఫ్‌ షోల్డర్‌… టీనేజర్లు ఎక్కువగా ఇష్టపడే డిజైను.అందుకే ఇప్పుడిది… టీషర్టులు మొదలు… శారీ బ్లవుజుల వరకూ విస్తరించింది. పెళ్లిళ్లలోనూ కనిపిస్తోంది. వేసుకోవాలనుకునేవారు చిన్నచిన్న కిటుకులు పాటిస్తే… ఈ ఆఫ్‌షోల్డర్‌తో సందర్భోచితంగా మెరిసిపోవచ్చు. అవేంటో వివరిస్తున్నారు డిజైనర్‌ దీప్తీ గణేష్‌. రోజూ, ప్రత్యేక సందర్భం అని లేకుండా ఎప్పుడయినా ఈ ఆఫ్‌ షోల్డర్‌ వేసుకోవచ్చు. ఈ వేసవికి అయితే ఇది అనుకూలం కూడా. ఎన్నో డిజైన్లు ఉన్నా అమ్మాయిలు మాత్రం ఆఫ్‌ షోల్డర్‌ టీషర్టులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులోనూ పొట్టి లేదా పొడవు చేతుల్ని ఎంచుకోవచ్చు. ఆసక్తి ఉంటే క్రాప్‌టాప్‌ని లాంగ్‌స్కర్టుకు జతగా వేసుకోవచ్చు. అది ఎంబ్రాయిడరీ లేదా ఫ్రిల్స్‌, రఫుల్స్‌ డిజైనులో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఇలాంటివాటికి ఆఫ్‌ షోల్డర్‌ ఉన్న లాంగ్‌ గౌన్లదే హావా.

* భుజాలు తీర్చిదిద్దినట్లు సన్నగా, నాజుకుగా ఉన్న అమ్మాయిలకు ఆఫ్‌ షోల్డర్‌ దుస్తులు అద్దినట్లు సరిపోతాయి. ఆసక్తి ఉంటే ముప్ఫై అయిదేళ్ల వయసు లోపు మహిళలూ వీటిని ప్రయత్నించొచ్చు. సందర్భాన్ని బట్టి వస్త్రం, డిజైను ఉండేలా చూసుకోవాలి.
* చేతులు లావుగా ఉన్నవారు కూడా వీటిని నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్‌ షోల్డర్‌లో స్లీవ్స్‌ అటాచ్‌మెంట్‌, ఫ్లాప్స్‌ ఉంటాయి. దాంతో లావు కనిపించదు. ఇక, సన్నగా ఉన్నవారికి తక్కువ స్లీవ్స్‌ ఉన్నవి, చేతులు కాస్త లావుగా ఉన్నవారు వెడల్పాటి ఫ్లాప్స్‌ రకాన్ని ఎంచుకుంటే చాలు. అయితే భుజాలు వెడల్పుగా, పెద్దగా ఉన్నవారికి ఇది నప్పదు.
* పొడవైన మెడ ఉన్నవారికి ఈ డిజైను అదిరిపోతుంది. ముఖ్యంగా ఉద్యోగినులు హై ఆఫ్‌ షోల్డర్‌ లేదా వన్‌సైడ్‌ ఆఫ్‌ షోల్డర్‌ వేసుకోవచ్చు. పొడవు చేతులతో ఉన్న రకాన్ని ఎంచుకోవచ్చు. ఆఫీసులో జరిగే చిన్నపాటి సమావేశాలకు బాగుంటాయివి. అయితే ఉద్యోగినులకు, పెళ్లి వంటి వేడుకలకు వెడల్పాటి భుజాలు బాగోవు. కాస్త సన్నగానే ఉండేలా చూసుకోవాలి.
* చిన్న చిన్న వేడుకలకు కాటన్‌తో చేసిన ఆఫ్‌ షోల్డర్‌ ఫ్రాక్‌ను వేసుకుంటే ఆ అందమే వేరు. అదీ కొంచెం సన్నగానే ఉండాలి. ఎంబ్రాయిడరీ పనితనం లాంటి అదనపు హంగులను జోడించాలి. ముప్ఫై ఆపై వయసు మహిళలకు ఆఫ్‌ షోల్డర్‌ లాంగ్‌ గౌన్లు బాగుంటాయి. సందర్భాన్ని బట్టి ప్రయత్నించొచ్చు.
* ఆభరణాలు…టీనేజీ అమ్మాయిలకు ఆఫ్‌ షోల్డర్‌కు జతగా పొడవాటి ఇయర్‌ రింగ్స్‌ అందాన్నిస్తాయి. అదే పండగ, పార్టీల్లో అయితే కలంకారీ, ఇకత్‌ ఆఫ్‌షోల్డర్‌లకు జతగా సిల్వర్‌ జ్యుయలరీ అదిరిపోతుంది. పెళ్లికూతురు వేసుకునే ఆఫ్‌ షోల్డర్‌ గౌనుపై ఎక్కువగా ఎంబ్రాయిడరీ పనితనం ఉంటుంది. దీనికి రాళ్లు పొదిగిన చోకర్‌ బాగా నప్పుతుంది. వేసవి కాలంలో కాటన్‌, ఇకత్‌ లాంటి వస్త్రాలతో చేసిన వాటిని ఎంచుకోవచ్చు.