Business

అనుమానం లేకుండా కొనండి

Huawei says customers can buy their phone undoubtedly-tnilive latest business breaking news in telugu

తమ సంస్థకు చెందిన స్మార్ట్‌ఫోన్లను నిరభ్యతరంగా వినియోగించవచ్చని చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ హువావే తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసిన ఆండ్రాయిడ్‌ సిస్టమ్‌తో ఎంతో కాలం నుంచి పని చేస్తున్నామని, అది అలా కొనసాగుతూనే ఉంటుందని సంస్థ తెలిపింది. హువావే, హానర్‌ స్మార్ట్‌ఫోన్లకు, ట్యాబ్‌లకు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తూనే ఉంటామని చెప్పింది. ఇప్పటికే వినియోగదారుల చేతుల్లో ఉన్న ఫోన్లకు, కొత్త ఫోన్లకు సేవలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. వారంతా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇవన్నీ చేస్తూనే వినియోగదారుల అభిరుచులకు తగినట్లుగా, వారు మెచ్చే విధంగా ఒక సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు సంస్థ నిరంతరం కృషి చేస్తోందని తెలిపింది. హువావేపై నిషేధం విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. హువావేతో జాతీయ భద్రతకు ముప్పు ఉందని అందుకే నిషేధం విధిస్తున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సహా ఇతర సేవలను ఇవ్వబోమని గూగుల్‌ ప్రకటించింది. దీంతో హువావే స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆండ్రాయిడ్‌ ఫ్లాట్‌ఫాం లేకుండా హువావే మొబైల్‌ ఫోన్లు తయారు చేస్తే, వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని హాంగ్‌కాంగ్‌కు చెందిన సౌత్‌ మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపింది. ట్రంప్‌ తీసుకున్న ఈ చర్యల వల్ల విపణిలో హువావేకి గట్టి పోటీ ఇస్తున్న సంస్థలకు లాభం చేకూర్చినట్లయింది. ఈ తరుణంలో తమ ఫోన్లు కొనడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేదని హువావే తాజాగా చేసిన ప్రకటన వినియోగదారుల్లో ఏ మేరకు భరోసాను నింపుతుందో చూడాల్సిందే.