Fashion

వేసవిలో గోళ్ల రంగుకు కూడా ఒక లెక్క ఉంది

Summer nail polish fashion in telugu-tnilive telugu fashion news

ఎండాకాలంలో డ్రెస్ ఫ్యాబ్రిక్‌లను మార్చడమే కాదు.. గోళ్లకు వేసే రంగుకు కూడా మార్చాలంటున్నారు ఫ్యాషనిస్టులు.. ఫ్యాషన్ గేమ్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవాల్సిందే! పైగా ఈ ఎండను బీట్ చేయాలంటే కూల్ కలర్స్ ఉత్తమం.. ఈ యేటి బెస్ట్ కలర్ షేడ్స్ ఏంటి?ఈ సమ్మర్‌ని ఎంజాయ్ చేస్తూనే.. ఈ కూల్ కలర్స్ పై ఓ లుక్కేయండి.. ఏ డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ డ్రెస్‌కి మ్యాచ్ అయ్యేలా నెయిల్ పాలిష్ వేసుకోవాలనుకుంటారు. కొన్నిసార్లు కాంట్రాస్ట్ కలర్స్ ట్రై చేస్తారు. ఈ గోళ్ల రంగుల్లో కూడా చాలా రకాలున్నాయండోయ్. కొన్ని గోడలకు రంగేసినట్లుగా ఉంటే, మరికొన్ని ధగధగ మెరిసిపోతుంటాయి. కొన్ని రంగులను ఒక కోటింగ్ వేస్తే సరిపోతుంది. కొన్నింటితో రెండు, మూడు కోటింగ్‌లు వేస్తే బాగుంటాయి. వీటితో మెహిందీల్లా ఆర్ట్‌లు కూడా వేసుకోవచ్చు. ఈ రంగుల మీద వజ్రాలు, ముత్యాలను పొదిగి కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు ఫ్యాషన్ పండితులు.

ఒక్కో రంగు ఒక్కొక్కరికి..
ఒకరికి బాగున్నది.. మరొకరికి బాగుండాలని లేదు. అందరికీ అన్ని రంగులు నప్పకపోవచ్చు. కాబట్టి స్కిన్‌టోన్‌ని బట్టి కూడా కొన్నిసార్లు రంగులు ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ అన్ని రకాల స్కిన్ టోన్స్‌కి ఈ కాలంలో కొన్ని రంగులు పర్‌ఫెక్ట్ అనిపించొచ్చు. పింక్, పీచ్‌లాంటి రంగులు ఈ కాలంలో ఎలాంటి స్కిన్‌టోన్ ఉన్నవాళ్లు అయినా వాడొచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే డార్క్ స్కిన్‌వాళ్లు. కాలేజ్ వెళ్లే అమ్మాయిలు అయినా, ఆఫీసులకు వెళ్లే వారైనా ఈ రంగులతో మ్యాజిక్ చేయొచ్చు. వీటితో ఇంకా నెయిల్ ఆర్ట్‌లు వేస్తే గోళ్లు మరింత అందంగా మెరిసిపోవడం ఖాయం.

రంగులలో కలవో..
ఏ అకేషన్‌కి తగ్గట్టు.. అలా రెడీ అయినప్పుడే ఆ అందం. అందుకే సాయంత్రపు సమయాన క్రీమ్, గోల్డ్‌లాంటి రంగులు పార్టీ సమయాల్లో, పెండ్లిళ్లలో కూడా స్పెషల్‌గా కనిపించేలా చేస్తాయి. ఆఫీస్ పార్టీలకైతే కేవలం గోల్డ్ కలర్‌ని ట్రై చేయొచ్చు. ఇండియన్, వెస్ట్రన్ ఎలాంటి డ్రెస్‌ల మీదకైనా ఈ నెయిల్ పాలిష్ సూపర్‌గా మ్యాచ్ అవుతుంది. ఇక ఎరుపులో చాలా రకాలుంటాయి. అందులో పాపీ రెడ్ కలర్ పర్‌ఫెక్ట్ చాయిస్. చేతులకే కాదు.. ఈ రంగు కాళ్లకూ వేసి మురిసిపోవచ్చు. స్పెషల్ అకేషన్లలో ఈ కలర్ మిమ్మల్ని మరింత మెరిపిస్తున్నది. ఈ రంగుకు తగ్గట్టుగానే మీ పూర్తి మేకప్ కూడా మ్యాచ్ అయితే అదిరిపోయే లుక్ మీ సొంతమైనట్లే!
nail-polish1
జిల్.. జిల్.. జిగేల్..
సింపుల్‌గా ఉండడం అందరి వల్లా కాదు. పైగా అలా ఉంటే రొటీన్‌గా కూడా ఉంటుంది. రొటీన్‌కి భిన్నంగా ఉండాలనుకునేవాళ్లు కొన్ని రంగులు ట్రై చేయొచ్చు. ముఖ్యంగా కాలేజ్ అమ్మాయిలకు ఈ రంగులు బాగా నప్పుతాయి. మట్టి రంగు.. నెయిల్ పాలిష్‌ల్లో చెప్పాలంటే మెటాలిక్ సాండ్స్ కలర్ మీ గోళ్లను జిగేల్‌మనిపిస్తాయి. ఈ ఎండల్లోని సాయంత్రాలను ఎంజాయ్ చేయాలంటే ఈ మెరుపులు కంపల్సరీ. ఈ గోళ్ల రంగు మెరుపు వల్ల ఇతర జువెలరీ లేకుండా కూడా మీరు సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలువొచ్చు. ఇప్పుడొస్తున్న క్రోమ్ నెయిల్స్ కూడా కాలేజ్ అమ్మాయిలకు ప్రత్యేకంగా ఉంటాయి. కేవలం సమ్మర్ స్పెషలే కాకుండా ఏ కాలంలోనైనా ఈ రంగులను ట్రై చేయొచ్చు.

లేలేత సోయగాలు..
రంగుల్లో లేత రంగులు వేరయా అన్నారు ఫ్యాషనిస్టులు. మామూలుగానే లేత రంగులు చలువ చేస్తాయంటారు. అందునా ఈ ఎండాకాలంలో ఈ రంగులు మిమ్మల్ని కూల్ చేసే అవకాశాలు ఎక్కువే. అందుకే లేలేత రంగుల ఎంపికలో కాస్త జాగ్రత్తలు కూడా అవసరమే. కోరల్ పంచ్ కలర్ ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం.. సర్వకాలలో సర్వావస్థలయందు సూపరో సూపర్ అనే కితాబు ఉంది. ఈ రంగు వేసి పై నుంచి ఏదైనా స్పెషల్ యాడింగ్స్ చేస్తే మీరు కేకో కేక అన్నమాటే. సాఫ్ట్ పింక్, లైట్ లావెండర్, సిల్వర్ కలర్స్ స్పెషల్‌గా ఉంచుతాయి. ఏ రంగు వాళ్లయినా, ఎలాంటి అకేషన్లలో అయినా ఈ రంగులను నిరభ్యంతరంగా వాడవచ్చు.

ముదురు మ్యాజిక్..
ఈ కాలంలో కేవలం లేత రంగులతోనే కాదు.. ముదురు రంగులతోనూ మ్యాజిక్ చేయొచ్చంటున్నారు మేకప్ నిపుణులు. రెట్రో రంగులు.. అందులోనూ ఆరెంజ్ కలర్ ఇట్టే మీ వైపు చూపు మరల్చేలా చేస్తుంది. కాలేజ్‌కి వెళ్లే అమ్మాయిలు ఈ రంగుతో నెయిల్ ఆర్ట్ ట్రై చేయండి. సూపర్ కూల్ లుక్‌ని ఈ హాట్ డేస్‌లో సొంతం చేసుకోండి. కోబాల్ట్ బ్లూ కలర్ కూడా ఈ కాలంలో చాలా బాగుంటుంది. ఈ సంవత్సరానికి ప్రత్యేకమైన రంగుగా గుర్తింపు కూడా తెచ్చుకుంది. అన్ని రకాల స్కిన్‌టోన్స్‌కి ఈ రంగు బాగుంటుంది. కాకపోతే పెడిక్యూర్, మెనిక్యూర్‌లాంటివి వేసిన తర్వాత ఈ రంగును ప్రయత్నించాలి.

హీటెక్కించే రంగు..
చలువ కలిగించే పాలిష్‌ల గురించి మాట్లాడుతూ ఏదేంటంటారా? ఈ రంగు వల్ల కాదు.. దీని ధర వల్ల కచ్చితంగా హీట్ పుట్టడం ఖాయం. దీని ధర ఎంతో తెలుసా? అక్షరాలా కోటి 63 లక్షలు. 267 క్యారెట్ల నలుపు రంగు వజ్రంతో దీన్ని తయారు చేయడం ఇందులోని విశేషం. అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌కి చెందిన అజాతురే అనే సంస్థ ఈ నెయిల్ పాలిష్‌ని తయారు చేసింది. ఈ రంగును ఈ సంస్థ మొదట ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. పెట్టిన ఒక్క రోజులోనే దాని అమ్మకాలు కూడా జరిగిపోవడం విశేషం. ఇంత ఖరీదైన నెయిల్ పాలిష్‌ని వాడడానికి ఎంతమంది సంపన్నులు ఎగబడ్డారో ఆ అమ్మకాలను బట్టే చెప్పేయొచ్చు.

రంగు పడుద్ది..
ఏ రంగు వేసుకోవడమే కాదు.. ఎలా గోళ్ల రంగు వేసుకోవాలో కూడా తెలుసుండాలి. గోళ్లకి రంగు వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

– గోళ్ల రంగు వేసేటప్పుడు బబుల్స్ రాకుండా ఉండాలంటే.. బాటిల్‌ను ఎక్కువగా ఊపకూడదు.
– స్నానం చేసిన వెంటనే గోళ్లకు నెయిల్ పాలిష్ వేయకూడదు. గోళ్లు తడిగా ఉండడం వల్ల పాలిష్ ఆరడానికి ఎక్కువ సమయం పడుతుంది.
– ఒక గిన్నెలో ఐస్‌క్యూబ్స్ వేసి కరిగించాలి. పాలిష్ వేసిన వెంటనే చేతులను ఆ నీళ్లలో పెడితే సరిపోతుంది. చిటికెలో రంగు ఆరిపోతుంది.
– నెయిల్ స్టిక్కర్స్‌ని గోరు అంచుల దాకా అంటించాలి. దాని మీద వేసే టాప్ కోట్ కూడా గోరు అంచు వరకు వేయాల్సి ఉంటుంది.
– బ్రష్ నిండుగా రంగు తీసి ఒక్కసారిగా గోళ్ల రంగు వేయకూడదు. కొంచెం కొంచెంగా తీసుకొని నెయిల్ పాలిష్ వేయాల్సి ఉంటుంది.
– గోళ్ల రంగును రెండు కోటింగ్‌లు వేస్తే బాగుంటుంది. మొదటి కోటింగ్ పూర్తిగా ఆరిన తర్వాత రెండో కోటింగ్ వేయాలి. చివరగా పారదర్శక రంగు వేస్తే గోళ్లు చక్కగా మెరుస్తాయి.