DailyDose

ఐటీకంపెనీల లాభాలపై హెచ్‌1బీ ఎఫెక్ట్‌-ప్రధాన వార్తలు-05/28

May 28 2019 - Daily Top News - H1b affect on IT industries gains

1. తెదేపా రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్‌ జయంతి
తెలుగు జాతి ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు దంపతులతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, గల్లా జయదేవ్‌, కోడెల శివప్రసాదరావు, యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదు..ఒక శక్తి, వ్యవస్థ అని, సమాజానికి సేవ చేయాలి, మార్పు తేవాలనే ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు అన్నారు.
2. ప్రమాణస్వీకార ఏర్పాట్లపై జగన్‌ సమీక్ష
ఈనెల 30న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్న ప్రమాణస్వీకార ఏర్పాట్లపై వైఎస్‌ జగన్‌ దృష్టి సారించారు. రాష్ట్రప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమల రావు, ట్రాఫిక్‌ డీసీపీ, పోలీసు అధికారులు సహా కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ రామారావు తదితరులు పాల్గొన్నారు.
3. తెరాసకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే: ఉత్తమ్‌
పార్లమెంట్‌ సభ్యులుగా ఎన్నికైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ నేతలు గాంధీభవన్‌లో ఘనంగా సత్కరించారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో లేనట్టుగా ..పదహారుకి 16 సీట్లు గెలుస్తున్నట్టుగా తెరాస నేతలు అహంకార పూరిత ధోరణితో వ్యవహరించారని విమర్శించారు. వారి ధోరణికి తెలంగాణ ప్రజలు బుద్ధిచెప్పారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ మూడు స్థానాలు గెలుచుకోవడంతో పాటు, మరో రెండు స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల తరఫున ముగ్గురు ఎంపీలం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
4. మావోల దుశ్చర్య:15మంది జవాన్లకు గాయాలు
ఝార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. సరయ్‌కెల్లాలోని కుచాయ్‌ ప్రాంతంలో భద్రతాసిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 15 మంది జవాన్లు గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుచాయ్ అటవీ ప్రాంతంలో ఝార్ఖండ్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు చెందిన జవాన్లు యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు వీరిపై బాంబు దాడి చేశారు.
5. సీడబ్ల్యూసీ సమావేశం లేదు: కాంగ్రెస్‌
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి రాహు్ గాంధీ రాజీనామా చేయడంపై పట్టువీడట్లేదని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై త్వరలో కాంగ్రెస్ వర్కింట్‌ కమిటీ మరోసారి భేటీ కానుందని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల్ని కాంగ్రెస్‌ కొట్టిపారేసింది. ‘‘సీడబ్ల్యూసీ సమావేశానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రణాళికలు లేవు. అవన్నీ నిరాధారమైన వార్తలు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌తో పాటు మరో సీనియర్ నాయకుడు తెలిపారు.
6. కల్తీ మద్యం తాగి 11మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో కల్తీ మద్యం తాగి 11 మంది మృత్యువాత పడ్డారు. ఈఘటనలో మరికొంతమంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా ఒకే దుకాణం నుంచి మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బారాబంకి, రామ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాణిగంజ్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
7. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీ, కమల్‌
ఈ నెల 30న దిల్లీలో రెండోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనుండగా రాష్ట్రం నుంచి ముఖ్యమైన నేతలకు ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఈ వేడుకకు హాజరవుతారని అన్నాడీఎంకే ఒక ప్రకటనలో తెలిపింది. ఎంఎన్‌ఎం అధినేత కమల్‌హాసన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌లకు కూడా ఆహ్వానాలు అందాయి. ఏడాదిన్నర క్రితం రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించిన కమల్‌హాసన్‌ ఎంఎన్‌ఎం పార్టీని ప్రారంభించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులను తొలిసారిగా బరిలో దింపారు. మంచి సంఖ్యలో ఓట్లు సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
8. ఐటీకంపెనీల లాభాలపై హెచ్‌1బీ ఎఫెక్ట్‌
దేశీయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కంపెనీల లాభాలపై అమెరికాలో హెచ్‌1బీ వీసాల విధానంలో సవరణ ప్రభావం పడనుంది. ఈ కంపెనీల లాభాలు 2019-20 నాటికి 0.8శాతం తగ్గవచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. డాలర్‌ విలువలో మార్పు కారణంగా ఈ కంపెనీల ఆదాయం మాత్రం 7-8శాతం వరకు పెరగవచ్చని ప్రముఖ రేటింగ్‌ సంస్థ క్రిసెల్‌ పేర్కొంది. డిజిటల్‌ సర్వీసుల మార్కెట్‌ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో సాఫ్ట్‌వేర్‌ రంగం 180 బిలియన్‌ డా
లర్ల మార్కును చేరవచ్చని పేర్కొంది.
9. జపాన్‌లో కత్తి దాడి.. ఇద్దరు మృతి
జపాన్‌లోని కవాసకి నగరంలో ఓ దుండగుడు వీరంగం సృష్టించాడు. కత్తితో అనేక మందిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. బాధితుల్లో చాలా మంది చిన్నారులే ఉన్నట్లు సమాచారం. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దుండగుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
10. నష్టాలతో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 31, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 69.62గా ఉంది.