Agriculture

వేరుశనగ కోత-నిల్వ జాగ్రత్తలు

Here are the safety tips of harvesting and storing ground nuts - Telugu agriculture news

రైతులు పండించే ముఖ్యమైన నూనెగింజ పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. దీన్ని రాష్ట్రంలోని అనేకప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఈ పంట కోతలు పూర్తయిన తర్వాత సరైన జాగ్రత్తలను పాటిస్తూ నిల్వచేస్తేనే ఈ విత్తనాలను వచ్చే వానకాలం పంటలో వాడుకోవచ్చు. లేదంటే విత్తనం పుచ్చుపట్టి పనికి రాకుండాపోతుంది. వీటి నుంచి విముక్తి పొందేందుకు గాను రైతులు వేరుశనగ కోత తర్వాత నిల్వ చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి నిపుణులు వివరించారు. 70-80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగుకు మారి కాయ డొల్ల లోపలి భాగం నలుపుగా మారినప్పుడు కోయాలి. కోత సమయంలో నేలలో తగిన తేమ ఉండేలా చూసుకోవాలి.

*** కోత తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-కోసిన పంటను తగిన తేమ (9శాతం) వచ్చేవరకు, మొక్క నుంచి కాయలను వేరు చేయడానికి ఎండబెట్టాలి. ఇది రెండువిధాలుగా చేయవచ్చు. కాయలు పైభాగానికి వచ్చేలా వేరుశనగ చెట్లను చిన్న, చిన్న కుప్పలుగా వేయాలి.
-మొక్కలను కర్రలకు కట్టి కాయలను పక్కలకు వచ్చేలా చేసి ఎండబెట్టవచ్చు. కాయల్లో ఎక్కువ తేమ శాతం ఉంటే ఎండలో ఆరబెట్టి తేమను 9 శాతానికి తీసుకరావాలి. అలాగే వేడిగాలిని వదిలే పరికరాన్ని ఉపయోగించడం వల్ల కాయలను ఎక్కువ ఎండలో ఎండబెట్టకుండానే తేమను తగిన శాతానికి తీసుకరావచ్చు.
-ఒక్కసారి ఉపయోగించిన సంచులను మళ్లీ వాడటం మంచిది కాదు. లోపల పాలిథీన్ పేపర్‌తో ఉన్న గోనె సంచులు బాగా ఎండిన వేరుశనగ కాయలు నిల్వ ఉంచడానికి మంచివి. కాయలను కదిలిస్తే గల్లుమని శబ్దం వచ్చినప్పుడు కాయలు బాగా ఎండినట్లు అర్థం.
-కాయలు పూర్తిగా ఎండక ముందే వర్షం వస్తే వర్షం ఆగిన తర్వా త కాయలు సరిగా ఎండకపోతే శిలీంధ్రాలు సోకే అవకాశం ఉన్నది. కాబట్టి కాయలను కచ్చితంగా ఎండబెట్టాలి.
-ప్రస్తుతం వేరుశనగ చెట్లు పీకేటప్పుడు ఎండ తీవ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇంత ఎండలో కాయలను నేరుగా ఆరబెట్టకూడదు. నీడలో ఆరబెట్టాలి. లేదా ఎండ తీవ్రత ఉదయం 11 గంటలకు ముందు, సాయంకాలం 4 గంటల తర్వాత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయాల్లోనే ఎండలో ఆరబెట్టాలి.
-ఎండబెట్టేటప్పుడు ఇతర రకాల కాయలు కలువకుండా చూడా లి. విత్తనం కోసం బాగా ముదిరిన కాయలను మాత్రమే నిల్వ చేసుకోవాలి.

*** నిల్వ ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-కాయలను నిల్వ చేయడానికి శుభ్రమైన లోపల పాలిథీన్ లైనిం గ్ ఉన్న గోనె సంచులను వాడాలి.
-గోనె సంచులను 0.5 శాతం మలాథియాన్ ద్రావణంలో ముంచి బాగా ఆరబెట్టాలి. ఈ సంచుల్లో కాయలతో పాటు వేపాకులు గానీ, వేపగింజల పొడిని గానీ కలిపి నిల్వ ఉంచితే పురుగుల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది.
-కాయలును నింపిన సంచులను గాలి వెలుతురు బాగా ఉన్న గదులలో ఉంచాలి. బస్తాలను నేరుగా నేలపై వేయకుండా ఒక్క అడుగు ఎత్తు చెక్క బల్లలను పరిచి వాటి మీద ఒకదానిపై ఒకటి 10 బస్తాల చొప్పున ఒక వరుసలో అమర్చాలి. వరుస, వరుసకు మధ్య కొంచెం స్థలం వదలాలి.
-కాయలు ఎక్కువ కాలం మొలకెత్తే శక్తిని కోల్పోకుండా ఉండాలంటే నిల్వచేసే ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. గాలిలో తేమ 65-70శాతం మధ్య ఉండాలి. దీనికంటే ఎక్కువగా ఉంటే శిలీంధ్రాలు అభివృద్ధి చెందుతాయి.
-కాయలను నెలకు ఒకసారి పరిశీలించి పురుగుల ఉధృతిని బట్టి క్రిమిసంహారక మందులలో ముఖ్యంగా మలాథియాన్ 5 మి.లీ లేదా డైక్లోరోవాస్ 1 మి. లీ లేదా క్లోరోపైరిఫాస్ 2.5 మి. లీ ఒక లీటరు నీటికి కలిపి కాయలపైన పిచికారీ చేయాలి. సంచులపైన, నిల్వ ఉంచే గదుల్లోని గోడలపైన కూడా పిచికారీ చేయాలి.
-వేరుశనగ కాయలను గోదాముల్లో ఉంచినప్పుడు పెంకు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. కిలో కాయలను 5 మి.లీ. వేపనూనె చొప్పున కలిపి ఉంచితే దాదాపు 4-5 నెలల వరకు ఎటువంటి పురుగు ఆశించదు.
-కాయలను సంచుల్లో వేసి బండ్లపై తరలించేటప్పుడు వాటిమీద టార్పాలిన్ కప్పి ఉంచాలి. దీనివల్ల ఒకేవేళ అనుకోకుండా వర్షం పడినా దాని నుంచి కాయలను కాపాడుకోవచ్చు. లేదంటే వర్షానికి కాయలు తడిసి, బూజు వచ్చి కాయలలో అప్లాటాక్సిన్ ఉత్పత్తి అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి నిల్వ చేయడంలో తగు జాగ్రత్తలు పాటించాలి
– వేరుశనగ కాయలను నిల్వ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి. కోసిన పంటలో తేమ శాతం తగ్గేందుకు ఎండలో ఆరబెట్టాలి. కాయలను బస్తాల్లో నింపిన తర్వాత నేరుగా నేలపై కాకుండా అడుగు ఎత్తు వరకు చెక్కలు వేసి వాటిపై ఒకదాని మీద ఒక బస్తా వేస్తూ నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసే గదిలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి తగు మోతాదులో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయాలి. అలా చేస్తేనే కాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.