Editorials

చంద్రబాబు ఘోర పరాజయానికి కారణాలు ఇవే

How everything turned out against chandrababu for his loss in 2019 elections

అయిదేళ్లు.. అయిదేళ్ల క్రితం.. అనుభవం.. అనుభవం అంటూ జనాలను తనవైపు తిప్పుకుని, తనకు వున్న మీడియా సహకారంతో తల్లి కాంగ్రెస్‌-పిల్ల కాంగ్రెస్‌ అంటూ వైకాపాను కార్నర్‌లోకి తోసి, ఆపార్టీపై రౌడీయిజం ముద్రవేసి, కడప గూండాలు వచ్చేస్తారంటూ విశాఖవాసుల్ని భయభ్రాంతుల్ని చేసి, ఇలా రకరకాల వ్యూహాలు పన్ని విజయం సాధించారు చంద్రబాబు నాయుడు. సమైక్య ఉద్యమ సమయంలో విభజన వైపు చంద్రబాబు మొగ్గారు. సమైక్యం వైపు జగన్‌ మొగ్గారు. ఎన్నికల టైమ్‌లో విభజనకు సహకరిచిన భాజపాతో కలిసి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. జగన్‌ ఒంటరి పోరు చేసారు.

కానీ తెలివిగా, తనకున్న మీడియా అండదండలతో జగనే విభజనకు కారణం అన్నంతగా తిమ్మిని బమ్మిని చేసే ప్రచారం సాగించారు చంద్రబాబు. అదే సమయంలో రాబోతున్న మోడీ వేవ్‌ను గమనించి ఒకటికి పదిసార్లు ఢిల్లీకి వెళ్లి భాజపాతో పొత్తు సాధించారు. అదే సమయంలో జనసేనను తనవైపు తిప్పుకున్నారు. ఇలా మూడు పార్టీలు కలిసి, పలు మీడియా సంస్థల అండదండలతో పోటీచేస్తే, చాలా నారో మార్జిన్‌తో జగన్‌ ఓడిపోయారు.

దాంతో జగన్‌ వేవ్‌ అనుకున్నది కాస్తా పరాజయంగా మిగిలిపోయింది. దీంతో చంద్రబాబు ఇదంతా తన వ్యూహరచన ఫలితం, అప్రతిహతంగా తాను పాలన సాగించాలనుకుంటే ఇక జగన్‌ పార్టీ వుండకూడదు అనుకున్నారు. తన పాలన, తనహవా, తన ఇష్టం అన్న తరహా వైఖరి చంద్రబాబులో పెరిగిపోయింది. అదేవైఖరి చంద్రబాబు అనుచరుల్లో పెరిగిపోయింది. పదేపదే జగన్‌ను ఆయన పార్టీని చులకనగా చూడడం, చులకన చేయడం అన్నది చాలా కామన్‌ వ్యవహారం అయిపోయింది. ఎవ్వరేం అనుకుంటే నాకేం అన్న రీతిలో తమ చిత్తానికి చేసుకుంటూ వెళ్లారు. ఈ దిశగా చంద్రబాబు అనేక తప్పులు చేసారు.

అడ్డగోలు అవినీతి
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ జనాలను వారి ఇష్టానికి వదిలేసారు. దాంతో అవితీత అడ్డగోలుగా పెరిగిపోయింది. రాష్ట్రం మొత్తం ఇసుక దందాలు పెరిగిపోయాయ్ని. సర్పంచ్‌ల దగ్గర నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల వరకు లక్షల నుంచి కోట్లకు కోట్లు ఇసుక సంపాదనకు అలవాటు పడిపోయారు. కేంద్రం మరుగుదొడ్లు, ఇళ్ల సబ్సిడీలు ఇస్తే స్థానిక నాయకులు కమిషన్లు తీసుకుని కేటాయించారు. ఇవన్నీ జనం గమనిస్తూ వచ్చారు. తమకు రావాల్సిన దాంట్లో వీళ్ల కమిషన్లు తినేస్తున్నారు అన్నది మనసులో వుంచుకున్నారు. సమయం వచ్చినపుడు వారి పని వారు చేసారు.

మరోపక్క ఎక్కడ భూములు వున్నాయో, లొసుగులు వున్నాయో గమనించి రెవెన్యూ సహకారంతో కైవసం చేసుకున్నారు. విశాఖలో జరిగిన భూదందాలు ఇంతా అంతా కావు. దీంతో రెవెన్యూ జనాలు కూడా వారి స్థాయిలో వారు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల విషయంలో జనాలను ఎంత పీడించాలో అంతా పీడించారు. ఎకరాకు పాస్‌బుక్‌ కావాలంటే ఆరువేలు అనేది ఫిక్స్‌ అయిపోయింది. ఎన్ని ఎకరాలు అంటే అన్ని ఆరువేలు అన్నది కామన్‌ అయిపోయింది. ఎప్పుడు అయితే ఎమ్మెల్యేలు, నాయకులు అవినీతి సంపాదనలో వున్నారో, ఉద్యోగుల విషయంలో గట్టిగా వుండే పరిస్థితి లేకపోయింది. దీంతో జనం దృష్టిలో తేదేపా ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది అన్న ముద్రపడిపోయింది.

ఉద్యోగుల అసంతృప్తి
పరుచూరి అశోక్‌బాబు లాంటి ముసుగువీరుల అండతో ఉద్యోగులను తనవైపు తిప్పుకుని, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చాలా సైలెంట్‌గా వారిని పక్కన పెట్టారు. డిఎలు సకాలంలో ఇవ్వలేదు. ఇప్పటికీ డిఎ బకాయిలు వున్నాయి. కొత్త పే రివిజన్‌ కమిటీ వేయలేదు. ఇంటీరియమ్‌ రిలీఫ్‌ అన్నది ఇవ్వలేదు. ఆఖరికి ఎన్నికల టైమ్‌లో కూడా ఉద్యోగులను మభ్యపెడుతూ ఎన్నికల తరువాత కౌంటింగ్‌ అయిపోయిన తరువాత డేట్‌ వేసి, ఇంటీరియమ్‌ రిలీఫ్‌ ప్రకటించారు. ఇదంతా ఉద్యోగులు గమనించలేకపోలేదు.

అదే సమయంలో పలుసార్లు పలుచోట్ల ఉద్యోగస్థుల మీద దాడులు చేసారు తెలుగుదేశం జనాలు. చింతమనేని ప్రభాకర్‌ లాంటివాళ్ల్లు వనజాక్షి లాంటి ఉద్యోగుల మీద దాడులు చేసినా, బాబు తన జనాలనే వెనకేసుకువచ్చారు. ఇలాంటి సంఘటనలు ఇంకా రెండు మూడు జరగడంతో జనాలకు అధికారపార్టీ మీద కోపం పెరిగింది. పరుచూరి అశోక్‌బాబు తనముసుగు తీసి, రాజకీయ నాయకుడి అవతారం ఎత్తి, ఎమ్మెల్సీ కావడంతో, ఉద్యోగులకు 2014లో తాము ఎలా పక్కదారి పట్టామో అర్థం అయింది. ఆ విధంగా ఉద్యోగస్థుల అండ తేదేపాకు లేకుండాపోయింది.

సామాజిక వర్గాలు దూరం
ఈసారి అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు సామాజిక వర్గానికి పగ్గాలు లేకుండా అయిపోయింది. కమ్మ సామాజిక వర్గం విపరీతంగా, విచ్చలవిడిగా ప్రవర్తిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. పోసాని కృష్ణమురళి లాంటి కమ్మ సామాజిక వర్గ జనాలు ముందే హెచ్చరించారు. మిగిలిన సామాజిక వర్గాల దృష్టిలో కమ్మ సామాజిక వర్గ జనాలు అంటే కనిపించని ద్వేషం పెరిగిపోతోందని. కానీ దాన్ని తెలుగుదేశం పార్టీ సీరియస్‌గా తీసుకోలేదు.

ఇదే సమయంలో కాపులను దగ్గర తీసే ప్రయత్నం చేసారు. పవన్‌కళ్యాణ్‌ దగ్గర వుంటాడో, దూరం అవుతాడో? అన్న అనుమానంతో కాపులు ప్రయారిటీ ఇస్తూ, ఆఖరికి రిజర్వేషన్లకు కూడా సిఫార్సు చేసారు. అది అంతకన్నా ముందుకు వెళ్లదని ఆయన అనుకున్నారు. కానీ మోడీ ఇచ్చిన రిజర్వేషన్లలో దాన్ని కలిపే ప్రయత్నం చేసారు. ఇవన్నీ కలిసి కాపులను దగ్గరకు తీయకపోయినా, తెలుగుదేశం పార్టీకి అండగా వున్న బిసిలను దూరం చేసాయి.

రిజర్వేషన్లపై తన వైఖరిని జగన్‌ స్పష్టంగా చెబితే, దాన్ని వాడుకుని, అతగాడిని కాపులకు దూరం చేద్దామనుకున్నారు తప్ప, అతగాడిని బిసిలకు దగ్గర కాకుండా ఆపలేకపోయారు. ఇక ఐవైఆర్‌ కృష్ణారావు, ఉండవల్లి లాంటి వాళ్లు బ్రాహ్మణసామాజిక వర్గానికి జగన్‌ను దగ్గరచేసే ప్రయత్నం చేసారు. అదే సమయంలో బ్రాహ్మణులకు మూడు నాలుగు టికెట్‌లు కేటాయించడం ద్వారా జగన్‌ వారి మనసులు గెల్చుకున్నారు. ఒక్క టికెట్‌ కూడా చంద్రబాబు కేటాయించలేకపోయారు. ఎన్నికల ముందు వచ్చిన చీఫ్‌ సెక్రటరీ సుబ్రహ్మణ్యాన్ని పదే పదే టార్గెట్‌ చేసి, అవమానించడం కూడా బ్రాహ్మణులకు నచ్చలేదు. ఆ విధంగా ఆ వర్గాన్ని దూరం చేసుకున్నారు.

క్షత్రియుల విషయంలో ఏం జరిగిందో కానీ, గత ఎన్నికల్లో బాబుకు అండగా నిలిచిన ఆ వర్గం రాష్ట్రవ్యాప్తంగా బాబుకు ఈసారి దూరం అయింది. బాహాటంగానే వైకాపాకు అనుకూలంగా పనిచేసారు. రాష్ట్రంలో ఒక్క క్షత్రియ మంత్రి కూడా లేకపోవడం అన్నది దీనికి కారణం అనేటాక్‌ కూడా వుంది.

కాపుల విషయంలో బాబు చాలా తప్పుచేసారు. కార్పొరేషన్‌, రిజర్వేషన్‌ సంగతులు అలావుంచితే, తుని సంఘటన, ఆపై ముద్రగడను దారుణంగా అవమానించిన వైనం, ఆ తరువాత అనేకమంది కాపు యువతలపై కేసులు బనాయించి వేధించిన సంగతి ఆ సామాజిక వర్గంపై గట్టి ముద్రవేసాయి.

ఎవరి ప్రభావమో, ఏమో తెలియదు కానీ, ముస్లిం వర్గం కూడా ఈసారి వైకాపాకు అండగా నిలిచింది. ముస్లిం పాపులేషన్‌ ఎక్కువగా వుండే సీమ, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాల్లో వాళ్లంతా బాహాటంగానే వైకాపా వైపు వున్నారు. తెలంగాణ ముస్లింనేతలు బాహాటంగానే అక్కడ నుంచి వైకాపాకు మద్దతు పలికారు.

తెలంగాణలో అధికారంలో వున్న చంద్రశేఖరరావును గద్దెదించాలని మహాకూటమి కట్టి బాబు గట్టిగా కృషిచేసారు. ఇది వెలమలలో వ్యతిరేకత పెంచింది. తమ సామాజిక వర్గం చేతిలో వున్న ప్రభుత్వాన్ని లేకుండా చేయాలని బాబు ప్రయత్నించడం వారిలో వ్యతిరేకతను పెంచింది. ఇలా కాపులు, బిసిలు, బ్రాహ్మణులు, వెలమలు, క్షత్రియులు, ముస్లింలు, ఎవరికి వారు బాబుకు దూరం జరగడం పెద్ద శాపమై కూర్చుంది.

అదే సమయంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో వెలమలకు పెద్ద పీట వేసి, కాళింగ, కాపు, గవరలను పక్కన పెట్టారు. కానీ తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి కాళింగ, గవరలకు కార్పొరేషన్లు అంటూ బుజ్జగింపు ప్రారంభించారు. కానీ ఎన్నికల ముందు చేసిన ఈ పీట్‌ ఫలితం ఇవ్వలేదు.

షో వర్క్‌ మాత్రమే..
పట్టణాల బ్యూటిఫికేషన్‌ మీద పెట్టిన శ్రద్ధను బాబు సమస్యల పరిష్కారంపై చూపలేదు. ఎంతసేపూ లైట్లు, మొక్కలు వంటి కార్యక్రమాలు చేపట్టి, అందంగా కనిపించేలా చేసే ప్రయత్నం తప్ప, లోలోపల వున్న సమస్యలను పట్టించుకోలేదు. అదే సమయంలో రోడ్లు వేసాం అంటూ డప్పు వేసారు. కానీ ఏ రోడ్లు వేసారు. కేంద్రం ఇచ్చిన సిసి రోడ్లను తమ రోడ్లుగా చూపించే ప్రయత్నం చేసారు. కానీ స్టేట్‌ హైవేలు, ఆర్‌అండ్‌బి రోడ్లు దారుణంగా అఘోరించాయి. కేంద్రం ఇచ్చిన ఇళ్ల పథకాలు, మరుగుదొడ్లు తమ పథకాలుగా చెప్పుకునే ప్రయత్నం చేసారు. కానీ గ్రామాల్లో ఐప్యాడ్‌లు పట్టుకుని, ఫోటోలు తీసి అప్‌లోడ్‌ చేయడం వంటి కార్యక్రమాలు అధికారులు చేయడంతో అవి ఎవరి పథకాలు అన్నది జనాలకు తెలిసిపోయింది. పైగా ఈ పథకాల్లో స్థానిక నేతలు కమిషన్లు కొట్టేయడం అన్నది జనాలకు కంటగింపుగా మారింది.

మోడీకి బై బై
2014లో చేయి అందించిన మోడీని కాదని, హోదా మీద యూటర్న్‌ తీసుకుని, ప్యాకేజ్‌ తీసుకుని, దానికి కారణమైన వెంకయ్యకు సన్మానాలు చేసి, అసెంబ్లీ తీర్మానాలు చేసి, ఆపై మళ్లీ తూచ్‌ అనడం అంతా జనం గమనించారు. సదా మోడీని తిట్టడంతోనే పొద్దు పుచ్చడం, అయిదేళ్ల వైఫల్యం అంతా మోడీ మీదే తోసేసే ప్రయత్నం చేయడం జనానికి అర్థమైపోయింది. తరచు విమానాల్లో తిరగడం, వారసత్యాలను తిడుతూనే లోకేష్‌కు పట్టంకట్టడం, దొడ్డిదారిన తీసుకువచ్చి మంత్రిని చేయడం వంటివి జనం గమనించారు.

ఫైబర్‌గ్రిడ్‌ అనేది తీసుకువచ్చి, టోటల్‌ సమాచార వ్యవస్థను తన గుప్పిట్లో వుంచుకోవాలనుకున్నారు. కానీ అది స్థానికంగా వున్న కేబుల్‌ ఆపరేటర్లకు నచ్చలేదు. తమ వ్యాపారాలు దెబ్బతీసి, వేరే వాళ్ల పొట్ట నింపే ప్రయత్నం చూసి, వారు తమ తమ పరిథిలో ప్రభుత్వం వ్యతిరేక ప్రచారం సాగించారు. పెంచిన కేబుల్‌ చార్జీలు అంతా బాబు పుణ్యమే అంటూ పైసల వసూళ్లకు ఇంటింటికి వెళ్లినపుడు చెప్పుకువచ్చారు. ఎవరు ఇంటింటికి వెళ్లినా, వెళ్లకున్నా, కేబుల్‌ ఆపరేటర్లకు తప్పదు. వారి ప్రచారం చాపకింద నీరులా ప్రభావం చూపించింది.

కాంగ్రెస్‌తో దోస్తీ
గట్టిగా అయిదేళ్లు కాలేదు. తల్లి కాంగ్రెస్‌-పిల్ల కాంగ్రెస్‌ అని ప్రచారం చేసి, వైకాపా మీద బురదవేసే ప్రయత్నం చేసి. అలాంటి కాంగ్రెస్‌తో బాబు జతకట్టారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్‌ వ్యతిరేక పునాదుల మీద. అలాంటిది ఆ పార్టీతో జతకట్టడం, రాహుల్‌తో స్టేజ్‌ షేర్‌ చేసుకోవడం వంటివి జనాలకు బాబు నిజరూపాన్ని స్పష్టం చేసాయి. పైగా నిన్నటిదాకా తాను జతకట్టిన భాజపాను ఈసారి వైకాపాతో ముడి వేసే ప్రయత్నం చేసారు. ఇవన్నీ జనాలకు ఇట్టే అర్థం అయిపోయాయి. బాబు దోస్తానా చేస్తే మంచి, లేదూ అంటే చెడ్డ అనేరీతిగా ప్రవర్తిస్తారు. అదే సమయంలో బాబు కోసం ఆయన అనుకూల మీడియా కూడా ఎలా అంటే అలా టర్న్‌లు తీసుకుంది. ఇదంతా జనం గమనించారు.

రాజధాని ఎఫెక్ట్‌
రాజధానిగా అమరావతిని ఎంచుకోవడం వరకు ఓకె. ఆ టైమ్‌లో అసెంబ్లీలో జిల్లా జిల్లాకు భయంకరంగా హామీలు ఇచ్చారు. ప్రతి జిల్లాకు ఏయిర్‌పోర్ట్‌, పోర్టు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇలా చాలా హామీలు ఇచ్చారు. ఇవి నెరవేర్చలేదు సరికదా, రాజధాని ప్రాంతంపై విపరీతంగా ప్రచారం చేసారు. అక్కడ ప్రజలు భయంకరంగా లబ్ధిపొందేస్తున్నారన్న కథనాలు వచ్చేలా చేసారు. దాంతో అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు అసంతప్తితో రగిలిపోయారు. విశాఖకు రావాల్సిన రాజధాని తరలిపోయిందన్న భావన పెరిగింది.

అంతా బెజవాడ, గుంటూరులకే తమకేంలేదన్న భావన సీమ వాసుల్లో పెరిగింది. ఏ సంస్థ వచ్చినా గుంటూరుకో, బెజవాడకో తోసేయడం అన్నది మిగలిన ప్రాంతాలకు కంటగింపు అయింది. పట్టిసీమ ఎత్తిపోతలు అంటూ తెలివిగా గోదావరి జలాలను కృష్ణజిల్లాకు తరలించారు. ఇది గోదావరి వాసులకు కంటగింపు అయింది. అదే సమయంలో మిగులు నీరు సీమకు ఇస్తా అని చెప్పి, ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇవన్నీ వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పట్ల అసంతృప్తిని పెంచాయి.

సింపతీ వేవ్‌
ఒక్క అవకాశం ఇవ్వండి అన్న జగన్‌ వేడికోలు జనానికి పట్టింది. అనుభవం అని బాబుకు ఇచ్చాం, ఈసారి జగన్‌కు ఎందుకు ఇవ్వకూడదు అన్న పాయింట్‌ జనాల్లోకి వెళ్లింది. పైగా జగన్‌ హామీలు ఇచ్చిన తరువాత బాబు వాటిని అమలుచేసి, తను ఓన్‌ చేసుకునే ప్రయత్నం చేయడం అన్నది జనం గమనించారు. అంటే జగన్‌ వస్తే ఇలాంటివి ఇంకా చేస్తాడు అన్న నమ్మకం కలిగింది.

పైగా అయిదేళ్లు ఎండ, వానలేకుండా జనంలోనే జగన్‌ వున్నారు. తెలుగుదేశం జనాలు సదా జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అది ఎంతవరకు వెళ్లింది అంటే విశాఖ విమానాశ్రయంలో జగన్‌ మీద దాడి జరిగితే అది ఫాల్స్‌ అని ఫేక్‌ అని రుజువు చేయాల్సింది పోయి, ఆయనే చేసుకున్నాడు అని, కోడి కత్తి పార్టీ అని ఎద్దేవా చేసారు. అది కూడా జగన్‌ పట్ల జనంలో సింపతీ పెంచింది.తనేమో వందేళ్ల వరకు తానే సీఎంగా వుంటాను అంటారు. జగన్‌కు ఒక్క చాన్స్‌ కూడా ఇవ్వకూడదంటారు. తన కొడుకు తన బావమరిది, ఆయన అల్లుడు అంతా అధికారం వెలగబెట్టాలనుకుంటారు. ఇదంతా జనం గమనించారు.

పసుపు కుంకుమ
పసుపు కుంకుమ అంటూ రైతులకు సహాయం అంటూ ఎన్నికల ముందు బాబు హడావుడి చేసారు. ఇదంతా పాజిటివ్‌ అవుతుందని ఆయనేకాదు, అందరూ అనుకున్నారు. కానీ అది రివర్స్‌ అయింది. జగన్‌ అంటే బాబు భయపడుతున్నారు. ఓటమి భయం ఆయనను వెన్నాడుతోంది. ఇదంతా అందుకోసమే చేస్తున్నారు అనే విషయం జనంలోకి వెళ్లింది. అదే సమయంలో మీ డబ్బులే మీకు ఇస్తున్నారు అంటూ వైకాపా జనాలు చేసిన ప్రచారం కూడా కొంత కీడు చేసింది.

ఇలా ఒకటికాదు, రెండుకాదు, అయిదేళ్లలో బాబు స్వయంకృతాపరాథాలు, తప్పులు, నిర్లక్ష్యాలు, ఇలా ఒకటీరెండూ కాదు, అయిదేళ్లలో బాబు చేసుకున్న వ్యవహారాలు, ఎలక్షన్ ప్రచారం కూడా ఎద్దేవ, ద్వేష పూరిత మాటలు ఇవన్నీ కలిసి బాబును విజయానికి దూరం చేసాయి.

జనతమిర్రర్ ఎడిటర్ కాలమ్