ScienceAndTech

భారత యుద్ధ విమానాల దుర్భర దుస్థితి ఇది

Oil Tank Of Tejas Fighter Jet Falls Off In TamilNadu

తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) తేజస్‌ నుంచి బాహ్య ఇంధన ట్యాంకు ఊడి పడిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా సూలూరు ‌ప్రాంతంలో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఆ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ ట్యాంకు కనపడింది. తేజస్‌ విమానాలు 2001 నుంచి గగనతలంలో ఎగురుతున్నాయి. అయితే, ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. మంగళవారం తేజస్‌ నుంచి కిందపడిన ట్యాంకు భారతీయ వైమానిక దళానికి చెందింది. ఈ విమానం సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి గాల్లోకి ఎగిరింది. ‘‘కోయంబత్తూరుకి సమీపంలోని సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి తేజస్‌ యుద్ధ విమానం వెళ్తుండగా ఈ రోజు ఉదయం 8.40 గంటలకు ఒక ఇంధన ట్యాంకు దాని ఊడి పడిపోయింది. ఈ ఘటన అనంతరం ఆ యుద్ధ విమానం సురక్షితంగానే దిగింది. దీని వల్ల ఎవరికీ ఏ నష్టం జరగలేదు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపడుతాం’’ అని ఐఏఎఫ్‌ ఓ ప్రకటన చేసింది. ట్యాంకు కిందపడడంతో సూలూరులోని చిన్నియంపాలయం ప్రజలు దానిని గుర్తించి కోయంబత్తూరు పోలీసులకు తెలిపారు. దీంతో ఐఏఎఫ్‌ నుంచి సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ ట్యాంకును స్వాధీనం చేసుకొన్నారు. ఈ ట్యాంకును చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ఈ ఇంధన ట్యాంకులో 1200 లీటర్ల ఇంధనాన్ని నింపొచ్చు.