NRI-NRT

కృష్ణా జిల్లా వలనే నేను తానా అధ్యక్షుడిని అయ్యాను

Vemana Satish Says Krishna District Is The Reason He Became TANA President

తాను తానాలో జేరిన తొలినాళ్లల్లో వాషింగ్టన్ డీసీ ప్రాంతీయ ప్రతినిధిగా బరిలో దిగేందుకు నామినేషన్ సమర్పించే సమయంలో తన సతీమణి నీలిమ చనుమోలు పేరును కూడా జత చేశానని, అప్పటివరకు వీడెవడో రాయలసీమ హడావుడి అభ్యర్థి అనుకున్న వారంత కృష్ణా జిల్లాకు సొంతమైన ఇంటిపేరును చూసి తన నామినేషన్‌ను పరిశీలనకు తీసుకున్నారని, ఆనాడు అది రాయకుండా ఉండి ఉంటే నేను ఇవాళ తానా అధ్యక్షుడిని అయ్యేవాడినే కాదని తానా అధ్యక్షుడు వేమన సతీష్ 22వ తానా మహాసభల్లో మూడో రోజు మధ్యాహ్నం కృష్ణా జిల్లా ప్రవాసుల సమ్మేళనంలో పాల్గొని ప్రసంగిస్తూ అన్నారు. బెజవాడ బ్లడ్ బాయిలింగ్ పాయింట్ వేరు అని, ఆ నీళ్లు, ఆ ఊళ్లు అదొక రకమైన్ ఊపులో ఉంటాయని ఆయన ప్రశంసలు కురిపించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ గుడివాడ మధ్యలో నుండి 50కి.మీ మేర ఒక వృత్తాన్ని గీస్తే ప్రపంచ పటాన తెలుగు వారికి తెలుగు జాతికి తెలుగు ఖ్యాతికి కారకులైన వారి పేర్లు కనిపిస్తాయని పేర్కొనడం సభికులు హర్షధ్వానాలు చేశారు. తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం మాట్లాడుతూ కృష్ణా జిల్లా వాళ్లని చూసి మిగతా 12 జిల్లాల వారు నిత్యం అసూయ పడుతుంటారని అన్నారు. కెనడాలో మంత్రిగా పనిచేస్తున్న పాండా ప్రసాద్ మాట్లాడుతూ తాను కెనడాలో సిక్కుల ఖలిస్థానీ ఉద్యామాన్ని నియంత్రించేందుకు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీ రోజుల్లో లగడపాటి రాజగోపాల్‌తో కలిసి చేసిన రాజకీయాలే పాఠాలు అయ్యాయని పేర్కొన్నారు. తానా తదుపరి అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తాను కృష్ణా జిల్లా మనవడిని అని గర్వంగా భావిస్తున్నానని అన్నారు. సినీ నిర్మాత నవీన్ ఎర్నేని, రవి మందలపు, యార్లగడ్డ రత్నకుమార్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, లావు అంజయ్యచౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మధు నెక్కంటి వ్యాఖ్యాత్రిగా వ్యవహరించారు. ప్రముఖ గాయని స్మిత అతిథిగా హాజరయ్యరు.