Devotional

దేవాలయాల్లో ప్రసాదాలు ఎందుకు అంత మధురం?

How Are Prasadams Made Across Temples In India?

1.దేవుళ్ళ ప్రసాదాల వెనుక మాధుర్యం ఇదే. – ఆద్యాత్మిక వార్తలు – 07/23
అది ఆ దేవుడి మహాత్మ్యమో అక్కడ వండే విధానమో తెలియదుగానీ కొన్ని ప్రసాదాలు అమృతంతో సమానం. ఆ రుచి కేవలం ఆ క్షేత్రానికి మాత్రమే ప్రత్యేకం. అందుకే ఆ ఆలయం పేరుతో ప్రసాదం అనగానే భక్తులే కాదు, నాస్తికులు సైతం వద్దనకుండా తింటారు. అలా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అద్భుత రుచికరమైన ప్రసాదాల్లో కొన్ని…
**తిరుమల లడ్డూ!
ప్రసాదం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది తిరుమల లడ్డూనే. ఆ పేరు వినగానే ఆ శ్రీనివాసుడి సుందరరూపంతోబాటు అమృతతుల్యమైన లడ్డూ రుచి నోరూరిస్తుంటుంది. సుమారు మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ లడ్డూని తింటే ఆ వెంకటాచలపతిని దర్శించినట్లే భావిస్తారు భక్తులు. అందుకే వెళ్లిన వాళ్లంతా పోటీపడి లడ్డూలు తెచ్చి పంచుతారు. పూర్వం రాళ్లూరప్పలూ దాటుకుంటూ కొండమీదకి నడిచి వెళ్లిన భక్తులు శ్రీవారి ప్రసాదం తినగానే శ్రమంతా మరిచిపోయేవారట. ప్రస్తుతం అక్కడ రోజూ దాదాపు రెండు లక్షల లడ్డూలు తయారుచేస్తున్నారు. లడ్డూ తయారీకి అవసరమైనవన్నీ కొచ్చిలోని మార్కెట్‌లో కొని ఆలయంలోని ప్రత్యేక వంటశాల(పోతు)లో వండుతారు. మొదట్లో అరకిలో పరిమాణంలో లడ్డూ తయారుచేసేవారట. ధర అణా. ప్రస్తుత లడ్డూ పరిమాణం వంద గ్రాముల్ని మించదు.
**సత్యదేవుడి ప్రసాదం!
ప్రసాదానికి మారుపేరే అన్నవరం సత్యనారాయణస్వామి గోధుమరవ్వ ప్రసాదం. ఆ మహాత్మ్యం ఆ సత్యదేవుడిలో ఉందో ప్రసాదంలో ఉందో తెలియదుకానీ ఎవరు వ్రతానికి పిల్చినా వెళ్లి కథ విని ప్రసాదం అందుకునిగానీ ఇంటికి వెళ్లరు భక్తులు. అందులోనూ అన్నవరం ప్రసాదం అంటే అడిగి మరీ తింటారు. గోధుమరవ్వ, నెయ్యి, బెల్లంతో తయారుచేసి విస్తరాకుల్లో అందించే దీని రుచి ఎక్కడా దొరకదు మరి.
**అయ్యప్ప అరవణ
అయ్యప్పస్వామి దగ్గరకు వెళ్లిన గురుస్వాముల్ని మాకో రెండు ప్రసాదం డబ్బాల్ని తీసుకొస్తారా అనడిగే భక్తులు కోకొల్లలు. లేహ్యంలా ఉండే అయ్యప్ప అరవణ రుచి అలాంటిది. అందుకే ఏమాత్రం మొహమాటం లేకుండా మళ్లీ చెయ్యి చాపుతుంటారు. బియ్యం, నెయ్యి, బెల్లంతో చేసే ఈ ప్రసాదం వెనక చాలా పెద్ద కథే ఉంది. బాలుడుగా ఉన్న అయ్యప్పను పందళం రాజా చీరప్పంచిరలో ఉన్న కలరి(యుద్ధశాల)లో చేర్పించాడట. దాని నిర్వాహకుడైన ఫణిక్కర్‌ కుమార్తె మణికంఠుడిని ప్రేమించిందట. అయితే అయ్యప్ప ఆ అమ్మాయిని పట్టించుకునేవాడు కాదట. దాంతో ఎలాగయినా అతని దృష్టిలో పడాలని అతనికోసం రోజూ భోజనం తీసుకొచ్చేదట. ఈలోగా ఆమె రజస్వల కావడంతో ఆ అమ్మాయికి ఇంట్లోవాళ్లు బియ్యం, బెల్లం కలిపి రుమాతికంజి అనే పాయసాన్ని చేసి పెట్టారట. అది ఆమె మణికంఠుడికి తీసుకురాగా, అది నచ్చి రోజూ అదే తెమ్మనేవాడట. అలా ఆ పాయసమే అయ్యప్ప ప్రసాదంగా మారింది. స్వామిగా మారిన అయ్యప్ప, ఆ అమ్మాయి ప్రేమనుఒప్పుకోలేదుగానీ శబరిమల సమీపంలోని సారంకుతిలో మాలికాపురాతమ్మ దేవతగా స్థానమిచ్చాడని చెబుతారు. ఆ ప్రసాదానికున్న డిమాండ్‌ దృష్టిలో పెట్టుకునే పోస్టులో పంపే ఏర్పాటూ చేశారు నిర్వాహకులు.
**పంచామృతం!
పళని… పేరు వినగానే దండాయుధపాణి రూపం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఆపై అమృతంతో సమానమైన పంచామృతమే గుర్తుకొస్తుంది. అరటిపండ్లు, తేనె, ఖర్జూరాలు, నెయ్యి, యాలకులు, నాట్టుసక్కరై(ఒక రకమైన బెల్లం), పటికబెల్లంతో చేసే ఈ పంచామృతానికి సాటి లేదు అంటారు దండాయుధపాణి భక్తులు. ఇందులోని ఈ ప్రత్యేక రుచికి విరుపాచ్చి అరటిపండ్లే కారణమంటారు ఆలయ నిర్వాహకులు. పంచామృతం కోసమే ఈ పండ్లను పళని కొండలమీదే పండిస్తారు. చాలా కొద్దిగా మాత్రమే నీటిని పెట్టి పండించే ఈ కాయలు చాలా చిన్నగా ఉంటాయి. కొండదిగువన ఉన్న ఫ్యాక్టరీలో రోజంతా పంచామృతం తయారవుతూనే ఉంటుంది. ఒకప్పుడు చేత్తోనే దీన్ని కలిపేవారు. అయితే రోజురోజుకీ దీనికి డిమాండ్‌ పెరగడంతో ఇటీవల ఆటోమేటిక్‌ మెషీన్లలో తయారుచేసి అమ్ముతున్నారు. నిజానికి దీన్నో పోషకభరితమైన ఫ్రూట్‌జామ్‌గా చెప్పవచ్చు. ఫ్రిజ్‌లో పెట్టకుండానే మూడు నెలలపాటు నిల్వ ఉండటం దీనికున్న మరో ప్రత్యేకత.
**పార్థసారథి పులిహోర
చెన్నై ట్రిప్లికేన్‌, పార్థసారథి ఆలయం పేరు చెప్పగానే అక్కడి పులిహోర, పొంగలి గుర్తుకొస్తాయి భక్తులకు. ప్రతిరోజూ ఇక్కడి కృష్ణభగవానుడికి ప్రసాదంగా వీటినే చేస్తారట. అదే ఉచితంగా భక్తులకూ పంచుతారు. బెల్లం, యాలకులు, బియ్యం. పెసరపప్పు, నెయ్యి, జీడిపప్పుతో చేసే ఈ పొంగలి రుచి మరెక్కడా ఉండదట. బెల్లాన్ని విడిగా తీగపాకం రానిచ్చి చేసే ఈ పొంగలిని అందరిలా పాత్రలో కాకుండా రాచిప్పలో చేస్తారు. ఇక చింతపండు పులిహోరలో ఎండుమిర్చికి బదులు పూర్తిగా మిరియాలు మాత్రమే వాడటంతో దీనికో ప్రత్యేకమైన రుచి వస్తుందట. ‘అసలే భీష్మ, ద్రోణుల బాణాలు తగిలి గాయాలతో ఉన్న పార్థసారథికి అవి ఇంకా మండుతాయన్న కారణంతో మిర్చి వేసి ప్రసాదం పెట్టం’ అన్నది నిర్వాహకుల వివరణ. ఈ రెండూ ఇంకా కావాలనుకున్నవాళ్లు రెండు రోజుల ముందే బుక్‌ చేసుకుని వెళ్లాల్సిందే. అప్పటికప్పుడు అంటే అస్సలు దొరికే ప్రశ్నే లేదట.
**గురుద్వారా లంగర్‌
స్వర్ణదేవాలయాన్ని సందర్శించినవారంతా అక్కడున్న లంగర్‌ హాల్లోకి తప్పక వెళతారు. గురు కా లంగర్‌గా పిలిచే ఈ హాల్లో ప్రతిరోజూ లక్షమందికి ప్రసాదం పెడతారు. గురుపురాబ్‌, దీపావళి సమాయాల్లో ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. ఒక్క చపాతీలకోసమే పదివేల కిలోల గోధుమపిండి వాడతారట. ఇంట్లో ఎన్ని రకాలున్నా సందర్శకులు లంగర్‌ రుచి చూడకుండా వెనుతిరగరు. దీంతోబాటు కడా ప్రసాద్‌(గోధుమ హల్వా), ఖీర్‌, టీ కూడా ఇస్తారు. గోధుమహల్వా అయితే భక్తులకు పంచేందుకు సుమారు 2500 కిలోలకు పైనే తయారుచేస్తారట. అది ఒకసారి తిన్నాక మారు అడగని భక్తులు ఉండరు మరి.
**కిట్టయ్య చక్కిలం
ఉడిపి శ్రీకృష్ణుణ్ని తలచుకోగానే రకరకాల లడ్డూలూ మురుకులూ నోరూరిస్తాయి. జన్మాష్టమికయితే ప్రసాదాలను చాలా పెద్ద మొత్తంలో చేస్తారు. మినప్పిండి, బియ్యప్పిండితో చేసే చక్కిలాల రుచే రుచి అంటారు భక్తులు. ఇక రవ్వ, బూందీ, నువ్వులు, మరమరాలతో ఐదు రకాల లడ్డూలు తయారుచేసి వాటిని ఆ రోజున చుట్టుపక్కలున్న వందలాది పాఠశాలల్లో పంచుతారట.
**కాళీఘాట్‌ పలావ్‌
పలావ్‌ తింటే కోల్‌కతాలోని ఆలయంలోనే తినాలి అంటారు కాళికామాత భక్తులు. అక్కడ మంగళ, శని, ఆదివారాల్లో వంద కిలోల బియ్యంతో పలావ్‌ చేస్తారు. మిగిలిన రోజుల్లో సుమారు 70 కిలోల వరకూ వండుతారట. దీంతోపాటు ఐదు రకాల వేపుళ్ల కూరలు, పప్పు, మటన్‌, చేప, చట్నీ, పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాక భక్తులకు వడ్డిస్తారు. ఈ ప్రసాదం రుచికోసమే ఆలయాన్ని సందర్శించేవాళ్లూ ఉంటారట. ఇంకా రోజూ కిచిడీని వండి పేదలకు పంచుతారు. అదీ అంతే రుచిగా ఉంటుందట.
**ఇక, పూరీ క్షేత్రంలోని అన్నభోగాన్ని మించిన మహాప్రసాదం మరేదీ లేదు. రుచిలో దానికదే సాటి అంటారు భక్తులు. అలాగే మదురై అళగర్‌ కోవెల దోశ, స్కందగిరి వినాయకుని పొంగలి… ఇలా వేటి రుచి వాటిదే. అందుకే ఆయా ఆలయాల్ని సందర్శించినవాళ్లు ఆ ప్రసాదాల్ని తినకుండా వెనుతిరగరు. ఎందుకంటే అవి దైవప్రసాదాలు..!
2. శ్రీకాళహస్తిలో సహస్రఘటాభిషేకం
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం వరుణయాగ సహిత సహస్రఘటాభిషేక మహోత్సవాన్ని ఆగమోక్తంగా జరిపారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ ఆవరణలోని మృత్యుంజయ మహాలింగానికి పైకప్పు మీద నుంచి కుండలతో నీళ్లు పోస్తూ శివలింగాన్ని అభిషేకించారు. ఈ విశేషోత్సవం చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
3. తితిదే బ్రేక్ దర్శనాలపై ముగిసిన వాదనలు
తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై వాదనలు ముగిశాయి. తగిన ఉత్తర్వులు జారీచేసేందుకుగాను విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. తితిదేలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలువరించాలని అభ్యర్థిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటసుబ్బారావు ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఈ వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరిపింది. గత విచారణలో కోర్టులో జరిగిన దానికి భిన్నంగా సామాజిక మాధ్యమాల్లో, కొన్ని పత్రికల్లో సమాచారం ప్రచారం/ప్రచురణ కావడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.
4. ఇంద్రకీలాద్రిపై సెప్టెంబరు 29నుంచి శరన్నవరాత్రులు
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబరు 29న ప్రారంభమై అక్టోబరు 8వరకు కొనసాగుతాయని దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ, స్థానాచార్య విష్ణుబొట్ల శివప్రసాద్శర్మ తెలిపారు.
5. శుభమస్తు
తేది : 23, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : షష్టి
(నిన్న మద్యాహ్నం 2 గం॥ 3 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 13 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తరాభద్ర
(నిన్న ఉదయం 10 గం॥ 25 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 12 ని॥ వరకు)
యోగము : అతిగండము
కరణం : వణిజ
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 7 గం॥ 50 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 37 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 28 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 20 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 7 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 37 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 14 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 52 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 52 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : మీనము
6. చరిత్రలో ఈ రోజు/జూలై 23* బాలగంగాధర తిలక్
1856: భారతజాతీయోద్యమ పిత బాలగంగాధర్ తిలక్ జననం (మ.1920).
1906 : భారత స్వాతంత్ర్య ఉద్యమకారుడు చంద్రశేఖర్ ఆజాద్ జననం (మ.1931).
1953 : ఇంగ్లాండుకు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారులలో ఒకడైన గ్రాహం గూచ్ జననం.
1975 : ప్రముఖ తమిళ నటుడు సూర్య జననం.
1983: కల్పాక్కం (చెన్నై దగ్గర) అణు విద్యుత్ కేంద్రం లో మొదటి సారిగా ఉత్పత్తి మొదలయ్యింది.
7. తిరుల సమారం**ఓం నమో వేంకటేశాయ*
ఈరోజు మంగళవారం *23-07-2019* ఉదయం *5* గంటల సమయానికి.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ……
శ్రీవారి దర్శనానికి *అన్ని* కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి వున్న భక్తులు…..
శ్రీవారి సర్వ దర్శనానికి *24* గంటల సమయం పడుతోంది…..
ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *6* గంటల సమయం పడుతుంది….
నిన్న జూన్ *22* న *83,864* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *4.18* కోట్లు.
8. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ నూతన గవర్నర్‌
ఏపీ నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ముందుగా వరాహస్వామిని దర్శించుకున్న ఆయన.. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి ఆలయం వద్ద తితిదే అధికారులు బిశ్వభూషణ్‌కు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్‌ను తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సత్కరించి స్వామి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. దర్శనం తర్వాత బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. వేంకటేశ్వరుడి ఆలయ సందర్శన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఎప్పటినుంచో తిరుమలకు రావాలని అనుకుంటున్నా సాధ్యపడలేదన్నారు. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో దర్శించుకునే మహద్భాగ్యం కలిగిందని చెప్పారు. తితిదే పని విధానం ఎంతో ప్రత్యేకంగా ఉందన్నారు. ఇక్కడి పాలనా వ్యవహారాలు, పరిశుభ్రత గురించి ఎప్పటి నుంచో వింటున్నానని చెప్పారు.