Health

మీ కాలేయాన్ని కాల్చుకు తింటున్నాయి

These are the foods that lead to fatty liver disease-మీ కాలేయాన్ని కాల్చుకు తింటున్నాయి

‘తినేది మీరు.. తాగేది మీరు’.. ‘అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు’ ఇవి సామెతలు మాత్రమే కాదు.. అక్షర సత్యాలు. సరైన ఆహార నియమాలు పాటించకపోతే తర్వాత చాలా బాధ పడాల్సి ఉంటుంది. ఫ్యాటీ లివర్‌ వంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కాలేయంలో కొవ్వు శాతం పెరిగిపోవడాన్ని ఫ్యాటీ లివర్‌ అంటారు. ఫలితంగా కాలేయం పనితీరు మందగిస్తుంది. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే దీనిని నియంత్రించవచ్చు.

మద్యం
ఫ్యాటీ లివర్‌, కాలేయ సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం మద్యం సేవించడం. ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది తీవ్రమైన దుష్పపరిణామాలకు దారితీస్తుంది. మితంగా మద్యం సేవించడం మంచిదేనని కొందరు చెప్పినా, దానికి దూరంగా ఉండటమే ఉత్తమం.

తీపి పదార్థాలు
చక్కెరతో తయారు చేసిన పిండి పదార్థాలను ఎక్కువగా తింటే ఊబకాయం వస్తుంది. అలాగే రక్తంలో చక్కెర శాతం ఎక్కువైతే శరీరం, కాలేయంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. భయంకరమైన డయాబెటిస్‌ బారిన పడతారు. మీ తీపి కోరికలను పండ్ల రూపంలో ఆస్వాదించండి. చక్కెరతో తయారు చేసే పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండండి.

వేయించిన పదార్థాలు
మసాలాలతో వేయించిన ఆహారంలో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. వీటికి ప్రత్యామ్నాయంగా కాల్చిన, ఉడకబెట్టిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

ఉప్పు
ఉప్పును ఎక్కువగా వినియోగిస్తే రక్తపోటు పెరగడంతో పాటు, కాలేయం పనితీరు దెబ్బతింటుంది. రోజుకు 1500 మిల్లీ గ్రాములకు మించి ఉప్పు తీసుకోవడంతో వృద్ధులకు రక్తపోటు, కాలేయం, గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మొదట్లో ఉప్పును తక్కువగా వాడటం ఇబ్బందికరంగా ఉన్నా.. తరువాత అలవాటైపోతుంది.

పాలిష్‌ బియ్యం
నాణ్యంగా కనపడటానికి చాలామంది వ్యాపారులు ముడి బియ్యాన్ని అనేక సార్లు పాలిష్‌ చేస్తారు. దీంతో బియ్యంపైన ఉండే ఫైబర్‌ పోతుంది. ఇటువంటి బియ్యంతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదు. ఇది జీర్ణమైనప్పుడు రక్తంలో చక్కెర లవణాలు అమాంతం పెరిగిపోతాయి.

సోడా, పళ్ల రసాలు
సోడా, పళ్ల రసాలలో శుద్ధి చేసిన చక్కెర, ప్రక్టోజ్‌ ఉండవు. ఇవి కాలేయ సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్లను తీసుకోవడం మంచిది. అలాగే వంద శాతం పండ్లు, స్వచ్ఛమైన నీటితో తయారు చేసిన రసాలను తీసుకోవచ్చు. నిమ్మరసం ఆరోగ్యానికి మంచిది.

ఫాస్ట్‌ పుడ్‌

వీటిని త్వరగా తయారు చేసుకోవచ్చు. మరింత రుచిగా కూడా ఉంటాయి. అయినప్పటికీ వీటి కారణంగా శరీరంలో కేలరీలు, కొవ్వు శాతం పెరిగిపోతుంది. గుండె, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.