Editorials

చైనాపై సరదాగా మరో 5శాతం సుంకాలు విధించిన అధ్యక్షుల వారు

చైనాపై సరదాగా మరో 5శాతం సుంకాలు విధించిన అధ్యక్షుల వారు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాకు టారిఫ్‌ల డోసు పెంచారు. అమెరికా వస్తువులపై టారిఫ్‌లు విధిస్తున్నట్లు చైనా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ట్రంప్‌ తన ట్విటర్‌ కరవాలాన్ని చైనాపై దూశారు. చైనాకు చెందిన దాదాపు 550 బిలియన్‌ డాలర్లు విలువైన ఉత్పత్తులపై 5శాతం టారిఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం చైనా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ టారిఫ్‌లు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం 250 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులు 25శాతం టారిఫ్‌ల పరిధిలో ఉన్నాయి. వీటిని ట్రంప్‌ 30శాతానికి పెంచారు. అక్టోబర్‌ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఇక మరో 300 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా వస్తువులపై టారిఫ్‌లను 10శాతం నుంచి 15శాతానికి పెంచారు. ఇవి సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్‌ తన ట్విటర్‌ ఖాతాలో ప్రకటించారు.

*** అంతకు ముందేం జరిగింది..
శుక్రవారం అగ్రరాజ్యానికి చెందిన 75 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని తాజాగా చైనా ప్రకటించడం ఇందుకు కారణం. వ్యవసాయం, ఇంధనం, చిన్న తరహా విమానాలు, కార్లు.. ఇలా మొత్తం 5,078 వివిధ రకాల అమెరికా దిగుమతి ఉత్పత్తులపై ఐదు నుంచి పదిశాతం అదనపు సుంకాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా ఆర్థిక మంత్రిత్వశాఖ మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. సెప్టెంబర్‌ 1 నుంచి కొన్ని ఉత్పత్తులపై.. డిసెంబర్‌ 15 నుంచి మరికొన్ని ఉత్పత్తులపై పెరిగిన సుంకాల శాతం అమల్లోకి వస్తాయని వివరించింది.

*** అమెరికన్ల జేబులకు భారీగా చిల్లు..
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఏమోగానీ అమెరికన్ల జేబులకు భారీగా చిల్లు పడుతోంది. భవిష్యత్తులో అమెరికా వాసులు ఏటా సగటున దాదాపు 1000 డాలర్లు(దాదాపు రూ.71,000) అదనంగా ఖర్చుపెట్టాల్సి వస్తోందని జేపీ మోర్గాన్‌ ఛేస్‌ వెల్లడించింది. కొత్తటారిఫ్‌లు రాకముందే అమెరికా వాసులు ఏటా 600 డాలర్లను అదనంగా వెచ్చిస్తున్నారు. అమెరికా ఎన్నికలు 2020లో జరగనుండంతో కచ్చితంగా ఎన్నికల్లో ప్రభావం చూపే అంశంగా ఇది మారుతుందని పేర్కొంది. ఇప్పటికే అమెరికా వాసులు పన్ను రాయితీల నుంచి పొందుతున్న లబ్ధిమొత్తాన్ని ఈ వాణిజ్య యుద్ధం హరించివేసిందని తెలిపింది.

*** ఆర్థికమాంద్యం వస్తున్నా ఒళ్లు తెలియడంలేదు..
ఒక పక్క ప్రపంచ ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్నా అమెరికా-చైనాలు ఒళ్లుతెలియని రీతిలో వాణిజ్యయుద్ధంలో మునిగిపోయాయి. ఈ రెండు ఆర్థిక వ్యవస్థలు భారీగా మందగించే ప్రమాదం పొంచి ఉంది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక బాండ్లను కొనుగోళ్లు చేస్తున్నారు. ‘శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలే ఆర్థికమాంద్యానికి ఎరలుగా మారాయి. మఖ్యంగా వారి రక్షణాత్మక వ్యాపార విధానాలే దీనికి కారణం’ అని ఇన్వెస్కో గ్లోబల్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్టు క్రిస్టినా హూపర్‌ వెల్లడించారు. అమెరికా 1929 తర్వాత అతితక్కువ నిరుద్యోగ రేటును అనుభవిస్తున్నా గానీ మాంద్యం ముప్పు మాత్రం తప్పదని పేర్కొన్నారు. చాలా మంది అమెరికా వ్యాపారవేత్తలు చైనా తప్పుడు వ్యాపార విధానాలు అవలంబిస్తోందని అంగీకరిస్తున్నారు. కానీ, దానికి టారిఫ్‌లను ఒక ఆయుధంగా చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

*** డ్రాగన్‌పై విమర్శల తూటాలు..
టారిఫ్‌ల పెంపును ప్రకటించే క్రమంలో అధ్యక్షుడు ట్రంప్‌ చైనాపై విరుచుకుపడ్డారు. చైనా తప్పుడు వ్యాపార విధానాలను మార్చుకొనే వరకు డ్రాగన్‌పై ఒత్తిడి కొనసాగతుందని ప్రకటించారు. ‘‘గత ప్రభుత్వాలు చైనా అనైతిక విధానాలను అనుమతించి సమతౌల్యతను దెబ్బతీశాయి. ఇది అమెరికన్లకు చివరికి భారంగా మారింది. ఒక అధ్యక్షుడిగా నేను వీటిని ఇక అనుమతించను.’’ అని ట్రంప్‌ అన్నారు.
అమెరికాపై చైనా టారిఫ్‌లు విధించడాన్ని అమెరికా వ్యాపార ప్రతినిధి ఖండించారు. ఇది ‘అన్యాయం’ అని అన్నారు. ట్రంప్‌ ప్రకటించిన టారిఫ్‌లను వీలైనంత తొందర్లోనే ఫెడరల్‌ రిజిస్టర్‌లో ప్రకటిస్తామని వెల్లడించారు.

*** భారీగా కుంగిన మార్కెట్‌ సూచీలు..
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తార స్థాయికి చేరడంతో మార్కెట్‌ సూచీలు భారీగా కుంగాయి. అమెరికాకు చెందిన 75 బిలియన్‌ డాలర్ల వస్తువులపై టారిఫ్‌లు విధించినట్లు తెలియడంతో వాల్‌స్ట్రీట్‌లోని సూచీలు 2శాతం వరకు పతనం అయ్యాయి. ‘‘అమెరికా కంపెనీలు వీలైనంత త్వరగా చైనాకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలి. లేకపోతే అమెరికాకు తిరిగి వచ్చి ఇక్కడే ఉత్పత్తిని ప్రారంభించాలి.’’ అని ట్రంప్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధం పతాక స్థాయికి చేరవచ్చనే సంకేతాలు ట్రంప్‌ మాటల్లో కనిపించడంతో మార్కెట్లు బేజారెత్తిపోయాయి. ట్రంప్‌ తమ దేశ సంస్థలను మానసికంగా సిద్ధం చేస్తున్నట్లు భావించాయి.
అమెరికా అధ్యక్షుడి ప్రకటనలు వ్యాపార సంస్థలను కుంగదీసేవిగా ఉన్నాయని నేషనల్‌ రీటైల్‌ ఫెడరేషన్‌ ప్రతినిధి డేవిడ్‌ఫ్రెంచ్‌ అన్నారు. ‘‘ఇటువంటి వాతావరణంలో సంస్థలు వ్యాపారం చేయలేవు. ఇటువంటి చర్యలు ఏమాత్రం పనిచేయవు. అమెరికా వ్యాపారాలు, ప్రజలపై పన్నులు వేసుకుంటూ వెళితే చివరికి ఇవి ఎక్కడికి చేరతాయి?’’ అని ఆయన పేర్కొన్నారు.

*** ట్రంప్‌ జోకులు..
ఓ పక్క మార్కెట్లు పతనం అవుతుంటే ట్రంప్‌ మాత్రం వాటిపై జోకులేస్తున్నారు. ‘‘డెమొక్రటిక్‌ పార్టీ ప్రతినిధి సెత్‌ మౌల్టన్‌ 2020 అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడంతో డోజోన్స్‌ 573 పాయింట్లు కుంగిపోయింది.’ అని పేర్కొన్నారు.