Sports

ఒలంపిక్స్‌లో పిడిగుద్దులకు సిద్ధం

Indian Boxer Vijender Gets Green Signal For Olympics

సుమారు రెండేళ్ల క్రితం భారత బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ ప్రొషెనల్‌ రింగ్‌లోకి అడుగుపెట్టడంతో దేశం తరఫున అధికారిక ఈవెంట్లలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రొఫెషనల్‌ బాక్సర్లగా మారిన వాళ్లు ఇకపై దేశం తరఫున ఆడేందుకు సైతం అనుమతిస్తూ భారత బాక్సింగ్‌ ఫెడరేషన్‌(బీఎఫ్‌ఐ) నిర్ణయం తీసుకోవడంతో విజేందర్‌ ముందు సువర్ణావకాశం వచ్చి పడింది. ఒలింపిక్స్‌ సహా అన్ని అధికారిక క్రీడల్లో భారత ప్రొఫెషనల్‌ బాక్సర్ల పాల్గొనే అవకాశాన్ని కల్పించడంతో విజేందర్‌కు మెగా ఈవెంట్‌లో తన సత్తాను మరోసారి చాటేందుకు అవకాశం ఏర్పడింది. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన విజేందర్‌.. వచ్చే ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు చాన్స్‌ దొరికింది. దాంతో పాటు మరో భారత ప్రొఫెషనల్‌ బాక్సర్‌ నీరజ్‌ గోయత్‌కు కూడా ఒలింపిక్స్‌ బాక్సింగ్‌ రింగ్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. దీనిపై విజేందర్‌ మాట్లాడుతూ.. ‘కచ్చితంగా మెగా ఈవెంట్‌లో పాల్గొనడానికి ఆసక్తిగా ఉన్నాను. నాకు ప్రొఫెషనల్‌ అయినా, అమెచ్యూర్‌ అయినా ఒక్కటే. ఎక్కడైనా రెండొందల శాతం ప్రదర్శను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మరొకసారి భారత జెండాను నా షర్ట్‌పై చూడాలనుకుంటున్నా. దేశం కోసం పోరాడటం ఎప్పుడూ గౌరవమే’ అని పేర్కొన్నాడు. కాగా, ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే అంతకుముందు జరిగే క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో తలపడాల్సి ఉంటుంది.