Sports

షెఫాలీ – ద లేడీ సెహ్వాగ్

Shefali Varma To Replace Mithali Raj In T20- Shafali Verma

పొట్టి క్రికెట్‌ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన సీనియర్‌ బ్యాట్స్‌వుమన్‌ మిథాలీరాజ్‌ స్థానంలో ఓ చిచ్చరపిడుగు అరంగేట్రం చేయనుంది. సెహ్వాగ్‌ తరహాలో మెరుపులు మెరిపించే 15 ఏళ్ల షెఫాలీ వర్మకు టీమిండియాలో చోటు దక్కింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మహిళల టీ20 ఛాలెంజ్‌లో మిథాలీ సారథ్యంలోనే ఆడిన షెఫాలీ తన ఆటతో అందరినీ ఆకట్టుకుంది. దేశవాళీ టోర్నీల్లోనూ దుమ్మురేపింది. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టీ20ల సిరీస్‌లో మూడు మ్యాచులకు ఎంపిక చేశారు. టీ20లకు శాశ్వతంగా దూరమైన మిథాలీ వన్డే జట్టుకు సారథ్యం వహించనుంది. టీ20లకు హర్మన్‌ ప్రీత్‌ నాయకత్వం వహించనుంది. స్మృతి మంధానను వైస్‌కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఐదు అడుగుల కన్నా కొద్దిగా ఎత్తుండే షెఫాలీ ఈ ఏడాది జరిగిన మహిళల టీ20 ఛాలెంజ్‌లో విధ్వంసకర ప్రదర్శనలు చేసింది. అండర్‌-19, అండర్‌-23 విభాగాల్లో ఈ యువ కిశోరి 150+ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ ప్రముఖ క్రికెటర్‌ డేనియెల్‌ వ్యాట్‌ సైతం ఆమె ప్రతిభకు ముగ్ధురాలై ఓ ‘సూపర్‌ స్టార్‌’ తయారవుతోందని ప్రశంసించింది. మహిళల క్రికెట్‌లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన రెండో అమ్మాయిగా షెఫాలీ నిలిచింది. అంతకన్నా ముందు గ్రెయిగ్‌ బెనర్జీ 14 ఏళ్ల 165 రోజులకే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది. 1978లో తొలి వన్డేను ఇంగ్లాండ్‌పై ఆడింది. 1984లో తొలి టెస్టు ఆడింది. మొత్తంగా భారత్‌ తరఫున 12 టెస్టులు, 26 వన్డేలు ఆడింది. 17 ఏళ్ల జెమీమా రోడ్సిగ్స్‌ సైతం మహిళల క్రికెట్‌లో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడుతున్న సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న పూజా వస్త్రకార్‌ తిరిగి జట్టులో పునరాగమనం చేసింది. దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్‌ 24 నుంచి టీ20 సిరీస్‌, అక్టోబర్‌ 9 నుంచి వన్డే సిరీస్‌ ఆరంభం అవుతాయి.