Editorials

స్విస్ బ్యాంకు వివరాలు వచ్చేశాయి

Swiss Bank Details Are Released To Indian Govt

విదేశాల నుంచి నల్లధనం తెప్పిస్తామన్న ప్రధాని మోదీ హామీలో తొలి అడుగు పడింది. స్విస్‌ బ్యాంకుల్లో ధనాన్ని దాచుకున్న భారతీయుల ఖాతాల తొలి విడత వివరాలు స్వదేశానికి చేరాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకునే (ఏఐఓఐ) విధానం కింద ఈ వివరాలను అందించినట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెడరల్‌ ట్యాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌టీఏ)కు చెందిన అధికారి ఒకరు పీటీఐ వార్తాసంస్థకు వెల్లడించారు. ఈ విధానం కింద భారత్‌ ఇలాంటి వివరాలను పొందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నల్లధనం వెలికితీతకు ఇది ఉపయోగపడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజాగా అందిన వివరాల్లో 2018లో లావాదేవీలు జరిపిన, మూసివేసిన ఖాతాల వివరాలు ఉన్నాయి. తదుపరి విడత వివరాలను మళ్లీ 2020 సెప్టెంబర్‌లో అందజేయనున్నట్లు ఆ దేశ ఎఫ్‌టీఏ అధికార వర్గాలు తెలిపాయి. ఈ వివరాల్లో ఖాతాదారుని పేరు, చిరునామా, ఖాతాలోని నగదుకు సంబంధించిన తదితర వివరాలు ఉన్నాయి. అయితే, వివరాలన్నీ రహస్యంగా ఉంచాలని నిబంధన ఉండడంతో ఆ వివరాలను తెలపలేమని ఎఫ్‌టీఏ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరానికి సంబంధించిన ఖాతాల వివరాలను తొమ్మిది నెలల తర్వాత అందజేస్తామని చెప్పారు. దీని ప్రకారం.. 2020 సెప్టెంబర్‌లో 2019కి సంబంధించిన వివరాలు అందనున్నాయి. ప్రస్తుతం అందిన వివరాలతో లెక్కల్లో చూపని ఆదాయం కలిగిన వారిపై విచారణ జరిపే అవకాశం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. డిపాజిట్లు సహా లావాదేవీ వివరాలు ఉండడంతో వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. తొలి విడతగా లభించిన వివరాల్లో ఎక్కువగా వ్యాపారులు, ఎన్నారైలే ఉన్నారని తెలుస్తోంది. నల్లధనం వెలికితీతకు చర్యలు ఉంటాయన్న భయంతో పలువురు తమ ఖాతాలు మూసివేశారని, దీంతో వారి వివరాలు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.