Devotional

టిటిడీ బోర్డు సభ్యులకు ఇన్ని సేవా టిక్కెట్లు అవసరమా?

Does the TTD Board Members Need Those Many Seva Tickets?

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల సంఖ్య పెరగటంతో వారి సిఫార్సుల మేరకు కోటా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకొక్క సభ్యుడికి ఎన్ని సేవా టిక్కెట్లు ఇవ్వాలి అనే విషయంపై చర్చ జరిగిందని, త్వరలో తుది నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఒకొక్క సభ్యునికి సోమవారం నుండి గురువారం వరకు ఇరవై విఐపి బ్రేక్‌ దర్శన టిక్కెట్లు ఇవ్వబోతున్నారట. శుక్రవారం రోజు నిజపాద దర్శనం కోసం మాత్రమే సిఫార్సు చేయాల్సి ఉంటుంది. శని, ఆది వారాలలో రద్దీ ఎక్కువగా ఉన్నా.. లేకున్నా ..ఒకొక్క సభ్యునికి 12 బ్రేక్‌ దర్శన టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారట. ఒక వేళ ఆ దర్శనాన్ని రద్దు చేస్తే పాలక మండలి సభ్యుడు స్వయంగా వస్తే టిక్కెట్లు ఇస్తారట. ప్రతి రోజు శుపదం ద్వారా శ్రీవారిని దర్శించేందుకు 20 టిక్కెట్లు కేటాయిస్తున్నారట. వారానికి ఒకసారి నాలుగు సుప్రబాతం టిక్కెట్లు ఇచ్చే అవకాశాలున్నాయి. తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మ పూజ వారానికి రెండు టిక్కెట్లు, కల్యాణోత్సవం నాలుగు టిక్కెట్లు మాత్రమే సభ్యులకు ఇవ్వబోతున్నారట. సహస్రకలశాభిషేకం లేదా తిరుప్పవాడ దర్శనాలకు రెండు వారాలకు రెండు టిక్కెట్లు ఇస్తారట. పూర్ణాభిషేకం లేదా వస్త్రం (అభిషేకం) నాలుగు నెలలకు ఒక టిక్కెట్టు మాత్రమే ఇస్తారట. వీటన్నింటికీ సభ్యులు అంగీకరించినా అంగీకరించకపోయినా పై విధంగా టిక్కెట్లు ఇవ్వాలని టిటిడి ఛైర్మన్‌, అదనపు ఈవో ధర్మారెడ్డిలు చర్చించి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఒక వేళ పాలక మండలి సభ్యులు వారి కుటుంబసభ్యులతో కలిసి దర్శనం చేసుకోవాలంటే ఆరుగురికి మాత్రమే అవకాశం ఇస్తారట. పాలక మండలి సిఫార్సులు చేసిన వారెవరికీ ప్రొటోకాల్‌ వర్తించవు. పై విధంగా టిక్కెట్లు కేటాయిస్తారా, లేదా సందర్భాలను బట్టి అవసరాలను బట్టి అదనపు టిక్కెట్లు కూడా కేటాయిస్తారా..? అనే విషయంపై అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని టిటిడి ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి చెప్పినట్లు తెలిసింది. అభిషేకం టిక్కెట్టు కేవలం నాలుగు నెలలకు ఒకసారి సభ్యుడితో పాటు మరొకరికి మాత్రమే అవకాశం ఇస్తామని అంతకు మించి ఎక్కువ కోరవద్దు అని సభ్యులకు సుబ్బారెడ్డి సలహా ఇచ్చినట్లు తెలిసింది. కానీ టిటిడి బోర్డు సభ్యులు ప్రమాణం చేసిన అనంతరం కోరిన కోర్కెలు తీర్చటం సాధ్యపడదని అందుకే ఇలాంటి ఏర్పాట్లు చేయవలసి వచ్చిందని టిటిడి వర్గాలు చెబుతున్నాయి. టిడిడి సభ్యులు వీటితో సంతృప్తి పడతారా…? లేక అదనపు టిక్కెట్లను కేటాయించేందుకు ఒత్తిళ్లు తెస్తారా…? మరి కొంత కాలం గడిస్తే కానీ అసలు విషయం బయట పడదు.