Kids

ఎదుటివారిని నమ్మేందుకు కూడా ఓ హద్దు ఉంది

Do not trust everyone blindly. Trust has a limit.Telugu kids story.-ఎదుటివారిని నమ్మేందుకు కూడా ఓ హద్దు ఉంది

నేటి కాలంలో యువత అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు?. ‘జీవితంలో ఎవర్ని నమ్మాలి? ఎవర్ని నమ్మకూడదు!’ అనేది కూడా ఆ సమస్యల్లో ఒకటి. ఈర్ష్య, అసూయ, ద్వేషం పెరిగిపోయిన ప్రస్తుత సమాజంలో మంచితనం, మానవత్వం దండిగా ఉన్నవారు చుట్టుపక్కల వాళ్ళ నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాటివారిని నమ్మి మోసపోవటం కూడా అందులో ఒకటి. అది ధనరూపేణా కావచ్చు, వస్తు రూపేణా కావచ్చు, గౌరవం, మర్యాద, మానాభిమానాలు మొదలైనవాటిలో కావచ్చు. భారతంలోని శాంతిపర్వంలో ధర్మరాజు సందేహాలకి భీష్మ పితామహుడు జవాబులిస్తూ ‘ఎవరిని నమ్మాలి? ఎంతవరకు నమ్మాలి?’ అన్న అంశాన్ని చక్కని నీతికథలో వివరించారు. పలితుడనే ఎలుకకు వలలో పడిన రోమసుడనే పిల్లి ? కనిపించింది. ఎవరికైనా తన శత్రువు ఇబ్బంది పడుతున్నప్పుడు సంతోషం రావడం సహజం కదా! అలాగే పలితుడు కూడా ఆనందించాడు. ఇంతలో ఒక ముంగిస ? ఆ దాపులకి రావడంతో కంగారుపడ్డాడు, వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గర చేరి, ముంగిసకి పిల్లి అంటే భయం కనుక, రోమసుని చెంత కూర్చుంటానని, ముంగిస ముప్పు తప్పాక వల కొరికి సాయం చేస్తానని అడిగింది. తన ప్రాణం కాపాడుకోవాలంటే వలలోంచి బయటపడాలని పిల్లి ఒప్పుకొంది. ఎలుక తనకు దక్కనందుకు ముంగిస బాధతో వెళ్లిపోయింది. ఎలుక వెంటనే వల కొరక్కుండా వేచి చూడసాగింది. దానితో పిల్లి తాను ఎలుకకు చేసిన సాయాన్ని గుర్తుచేయసాగింది. చివరికి వల పన్నిన వేటగాడు దాపులకు వచ్చే వరకు వేచి చూసి ఎలుక వల కొరికి వేగంగా కలుగులోకి దూరింది. కిరాతకుడికి చిక్కకుండా పిల్లి చెట్టెక్కి కూర్చుంది. నిరాశతో వేటగాడు వెళ్ళగానే పిల్లి ఎలుకతో ‘మిత్రమా! నువ్వు నా ప్రాణాలు కాపాడావు, అంతకు మునుపు నేను నీ ప్రాణభయాన్ని తొలగించాను. ఒకరికొకరం చేసుకున్న ఈ సాయాలు ఆజన్మాంతం గుర్తుంచుకుందాం. మన స్నేహాన్ని ఇలాగే కొనసాగిద్దాం’ అని అంది. దానితో పలితుడు ‘‘మిత్రమా! మనిద్దరిది అలవికాని జాతివైరం. ఒకవేళ నిజంగానే నువ్వు మన స్నేహాన్ని కాంక్షిస్తున్నా అది సరైనది కాదు. నువ్వు మంచివాడివే అయినా నీ బంధువులు, స్నేహితులు నాకు ఏదో ఒకరోజున చెడు చెయ్యవచ్చు. అయినా శుక్రనీతి చెప్పినట్లు

నమ్మదగనివారినసలు నమ్మనే నమ్మరాదు
నమ్మదగ్గవాళ్ళనైనా పూర్తిగా నమ్మరాదు.

కనుక ఎదుటివారిని పూర్తిగా నమ్మకుండా, అవసరం మేరకే నమ్మి జీవితాలు గడిపే వాళ్లకు ఏ కష్టాలూ రావు. ఎవరినెంత నమ్మాలో అంతవరకే నమ్మాలి, అందరినీ నమ్మి ఆపదలు తెచ్చుకోవడం అవివేకుల లక్షణం.’’ అని చెప్పి తన కలుగులోకి వెళ్ళిపోయింది. శుక్రనీతి సారాన్నంతా కాచి వడబోసిన ఈ కథ నమ్మకం విషయంలో నేటి యువతరానికి దిక్సూచిగా ? పనికొస్తుంది. మనుషులన్నాక ఆజీవన పర్యంతం ఎవరో ఒకర్ని నమ్ముతూ ముందుకు సాగాల్సిందే. మనం నమ్మే వాళ్ళలో ఉత్తములు ఉండవచ్చు, వంచకులు వుండవచ్చు. అంత మాత్రాన ఎవరో, ఎప్పుడో, ఏదో సందర్భంలో తమను మోసం చేసారని సమాజమంతటినీ అనుమానపు చూపులతో పరీక్షిస్తూ కూర్చోవడం సరైనది కాదన్నది కొందరి వాదన. స్నేహం, ప్రేమ, ఆత్మీయత అనే పవిత్రభావనల్ని స్వార్ధానికి వాడుకునేవారు పెరిగిపోయిన ప్రస్తుత సమాజంలో ఎవరినైనా కాపాడేది వారి, వారి స్వీయ వివేచన మాత్రమే.