WorldWonders

శ్వేతసౌధంలో బోగస్ ఉద్యోగస్థురాలు

NBC News Brings Out Fake Degree Holder In State Department

అమెరికాలో మీనా చాంగ్ అనే 35 ఏండ్ల మహిళ నకిలీ పత్రాలు, బోగస్ ఆధారాలతో ఏకంగా ఆ దేశ విదేశాంగ శాఖలో సీనియర్ అధికారి పదవిని చేపట్టింది. తాను హార్వర్డ్ బిజినెస్ స్కూల్విద్యార్థిని అని, గతంలో ఓ స్వచ్ఛంద సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశానని పేర్కొంది. ఉద్యోగం కోసం అందజేసిన దరఖాస్తు పత్రంలో తన జీవితకాలంలో సాధించిన పలు విజయాల పేరిట ఆ వివరాలను జతచేసింది. అయితే ఎన్బీసీ న్యూస్ అనే సంస్థ జరిపిన దర్యాప్తులో అవన్నీ బోగస్ అని తేలింది. అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతోద్యోగిగా చాంగ్ ఇటీవల ఓ టీవీ షోకు హాజరైంది. పలు దేశాలలో తాను అందించిన సేవలకు సంబంధించిన ఫొటోలను షో నిర్వాహకులకు అందజేసింది.వాటిలో తన ముఖ చిత్రంతో ప్రచురితమైన టైమ్ మ్యాగజైన్ కూడా ఉంది. అమెరికాలోని రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమోక్రాట్లు నిర్వహించిన జాతీయ సదస్సుల్లో తాను ఉపన్యసించినట్టు పేర్కొంది. అయితే అవన్నీ బోగస్ అని ఎన్బీసీ న్యూస్ తేల్చిచెప్పింది. ఆమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివిన మాట వాస్తవమే కానీ, అది ఎనిమిది వారాల కోర్సు మాత్రమేనని, ఆ విద్యాసంస్థ అందించే ప్రతిష్ఠాత్మక పట్టా ఆమెకు లభించలేదని స్పష్టం చేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఇలా నకిలీ ఉద్యోగులు చేరడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 24 ఏండ్ల టేలర్ వెయీనెత్, ఆ తరువాత అధ్యక్ష భవనంలో మత్తు మందుల నిరోధక అధికారిగా ఉద్యోగం సంపాదించాడు. అయితే అతని విద్యార్హతలన్నీ బోగస్ అని వాషింగ్టన్పోస్ట్ పత్రిక బయటపెట్టింది.