DailyDose

మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది-తాజావార్తలు-12/01

KCR Finally Responds On Priyankas Death-Telugu Breaking News-12/01

* శంషాబాద్‌లో యువ వైద్యురాలి హత్యకేసును అత్యంత వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను సీఎం కోరారు. బాధిత యువతి కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు.

* తెదేపా అధినేత చంద్రబాబునాయుడు రాజధాని పర్యటన సందర్భంగా జరిగిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో విచారణ జరిపిస్తామని ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ స్పష్టం చేశారు. సిట్ బృందం వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుందని చెప్పారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, పూర్వాపరాలపై సిట్ అధ్యయనం చేస్తుందని.. పోలీసుల విధినిర్వహణలో లోపాలుంటే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

* తితిదే వెబ్‌సైట్‌లో అన్యమత నినాదాల వార్తలపై తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి స్పందించారు. తిరుమలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘ కొందరు కావాలనే తితిదేపై విషం కక్కుతున్నారు. రాజకీయ స్వార్థంతోనే తితిదేపై అసత్య ప్రచారం చేస్తున్నారు. అన్యమత ప్రచారంచేసే అవసరం తితిదేకు లేదు. నకిలీ వెబ్‌సైట్లతో దేవస్థానానికి సంబంధంలేదు. మతకల్లోలాలు సృష్టించేందుకు ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోంది’’ అని సుబ్బారెడ్డి అన్నారు.

* ముకేశ్‌ అంబానీకి చెందిన ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో కూడా వినియోగదారులకు షాకిచ్చింది. వాయిస్‌, డేటా ఛార్జీలను 40 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్‌ 6 నుంచి కొత్త అన్‌లిమిటెడ్‌ ప్లాన్లు తీసుకొస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో నూతన ప్లాన్ల కింద 300 శాతం అదనపు ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించింది. వొడాఫోన్‌ ఐడియా డిసెంబర్‌ 3 నుంచి ఛార్జీలను పెంచుతున్నాయి.

* శంషాబాద్‌లో యువ వైద్యురాలి హత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్‌ మరోసారి స్పందించారు. అత్యాచారం చేయాలంటే భయపడేట్లు మన చట్టాలు సవరించాలని ప్రధాని మోదీని కోరుతూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడేవారికి శిక్షలు వేగంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

* లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్‌ నారాయణ (జేపీ) ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వైబీఎం అధ్యక్షుడు మారంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డితో కలిసి జేపీ కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి జేపీ, మారంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి సురక్షితంగా బయటపడగా.. కారును ఢీకొన్న ఆటోలో ఉన్న ఇద్దరు మహిళలకి స్వల్పగాయాలయ్యాయి.

* మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా నియామకమయ్యారు. ఈ మేరకు ఆదివారం నూతనంగా నియామకమైన శాసనసభా స్పీకర్‌ నానా పటోలే ప్రకటన చేశారు. ఆయన ప్రకటించిన అనంతరం శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ నాయకులు ఫడణవీస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పటోలే ఆదివారం నూతన శాసనసభా స్పీకర్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే.

* చర్లపల్లి కేంద్రకారాగారం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కుషాయిగూడ సీఐ ఆధ్వర్యంలో మూడంచెల భద్రత ఏర్పాటుచేసి ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే జైలులోకి అనుమతిస్తున్నారు. శంషాబాద్‌లో యువతిపై హత్యాచారం కేసులోని నలుగురు నిందితులు చర్లపల్లి జైల్లో ఉన్నారు. దీంతో శంషాబాద్‌ కిరాతకులను ఉరితీయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ప్రస్తుతం జైలు వద్ద ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది.

* చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం కోగిలేరు వద్ద ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందగా, చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

* తమిళనాడు జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కతున్న ‘క్వీన్‌’ టీజర్‌ వచ్చేసింది. గౌతమ్‌ మేనన్‌ తెరకెక్కిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌లో రమ్యకృష్ణ జయలలితగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘క్వీన్‌’ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ‘క్వీన్‌’ టీజర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు.

* ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన ఆత్మీయ సమావేశం ముగిసింది. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీలో ఒక్క ఉద్యోగినీ తొలగించకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని.. ఏ ఒక్క రూటులోనూ ప్రైవేట్‌ బస్సులకు అనుమతి ఇవ్వబోమని సీఎం స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి ఏటా బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.వెయ్యికోట్లు కేటాయిస్తామని చెప్పారు.

* శంషాబాద్‌లో యువ వెటర్నరీ వైద్యురాలి హత్యోదంతంపై నిరసనలు కొనసాగుతున్నాయి. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి వెళ్లారు. కానీ, పోలీసులు అయన్ను గేటు లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన బాధాకరమన్నారు. వైద్యురాలి ఆచూకీ కనుక్కోవడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. ఈ అత్యాచార ఘటనకు నిఘా వ్యవస్థ వైఫల్యమే కారణమన్నారు.

* బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్‌ గంగూలీ తన మార్క్‌ను మరోసారి చూపించాడు. పదవీ చేపట్టిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన డే/నైట్‌ టెస్టు సన్నాహకాలు చేపట్టిన అతడు తొలి సర్వసభ్య సమావేశం (ఏజీఎమ్‌)లో లోధా సంస్కరణల మార్పు చేపట్టాడు. అతడి అధ్యక్షతన జరిగిన తొలి ఏజీఎమ్‌లో లోధా సంస్కరణల మార్పుకు సభ్యులు ఆమోదం తెలిపారు. తీసుకున్న నిర్ణయాల ప్రకారం అన్ని అనుకూలంగా జరిగితే గంగూలీ 2024 వరకు అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం ఉంటుంది.

* రాష్ట్రంలోని రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాస్తానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రత్యేకహోదా గురించి మోదీ దగ్గర అడిగే ధైర్యం వైకాపాకు లేదని ఆయన ఎద్దేవా చేశారు. కడప జిల్లా రైల్వేకోడూరులో రైతులతో సమావేశమైన అనంతరం ఏర్పాటుచేసిన సభలో పవన్‌ మాట్లాడారు. భారతి సిమెంట్‌ పరిశ్రమపై ఉన్న శ్రద్ధ కడప ఉక్కు పరిశ్రమపై ఎందుకు లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి సీఎంలాగా మాట్లాడితే ముఖ్యమంత్రి అని సంభోధిస్తా అని స్పష్టం చేశారు. కేవలం కొంతమందికే సీఎంలాగా ప్రవర్తిస్తే.. పేరుపెట్టే పిలుస్తానన్నారు.

* నవంబర్‌ నెలలో వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) ఆదాయం పెరిగింది. ఈ మొత్తం రూ.లక్ష కోట్ల మార్కును దాటింది. అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే 6శాతం ఆదాయం పెరిగి రూ.1.03లక్షల కోట్లకు చేరింది. అక్టోబర్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.95,380 కోట్లు కాగా.. 2018 నవంబర్‌లో రూ.97,637 కోట్లుగా ఉన్నాయి.

* తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. బ్రహ్మత్సవాల చివరి రోజున అమ్మవారి చక్రస్నానం కన్నుల పండువగా సాగింది. అశేష భక్త జనసందోహంతో పద్మ సరోవరం కిక్కిరిసి పోయింది. సిరుల తల్లితోపాటు భక్తజనం పుణ్యస్నానాలు ఆచరించారు. ఇవాళ సాయంత్రం బ్రహ్మోత్సవాల ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

* హ్యూందాయ్‌ వెన్యూ బుకింగ్స్‌లో అదరగొడుతోంది. 2019 ముగింపు నాటికి వెన్యూ లక్ష బుకింగ్స్‌ను పూర్తి చేసుకొంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారును 2019 మే నెలలో మార్కెట్లోకి విడుదల చేశారు. అక్టోబర్‌ చివరి వరకు 51,257 వాహనాలను విక్రయించగా.. 75,000 బుకింగ్స్‌ వచ్చాయి. ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపే వారిలో దాదాపు 50శాతం మంది బ్లూలింక్‌ కనెక్టడ్‌ కార్‌ టెక్నాలజీ ఉన్న వేరియంట్‌పై ఆసక్తి చూపిస్తున్నారు.

* మహారాష్ట్రలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో శరద్‌పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)కి కీలక పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. గరిష్ఠంగా 43 మందిని మంత్రులుగా నియమించే అవకాశం ఉండగా.. అందులో ఆ పార్టీకి 16 స్థానాలు దక్కనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు శివసేనకు 15 మంత్రి పదవులు దక్కనున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌కు 12 మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

* అల్లు అర్జున్‌ కథానాయకుడిగా తెరకెక్కతున్న చిత్రం ‘అల..వైకుంఠపురములో’. ప్రస్తుతం ఈ సినిమాలోని ‘సామజవరగమన’ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. దక్షిణాదిలోనే ఎక్కువ వ్యూస్‌ పొందిన పాటగా రికార్డు సృష్టించింది. సినిమా ప్రచారంలో భాగంగా సెప్టెంబర్‌ 28వ ‘సామజవరగమన’ పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయిలో మిలియన్స్‌లో వ్యూస్, లక్షల్లో లైక్స్ అందుకుంది. ఈ పాటకు ఇప్పటివరకు యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

* నేటి నుంచి చైనాలో కొత్తగా మొబైల్‌ సర్వీస్‌ను వినియోగించాలంటే ముఖాన్ని స్కాన్‌ చేసి రిజస్టర్‌ చేసుకోవాల్సి ఉంది. ఈ నిబంధనను సెప్టెంబర్‌లో చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం మాట్లాడుతూ ‘‘సైబర్‌ ప్రపంచంలో ప్రజలకు ఉన్న హక్కులు, అవకాశాలను ఈ చట్టం రక్షిస్తుంది’’ అని పేర్కొంది.