Devotional

సుబ్రహ్మణ్య షష్ఠి ప్రాముఖ్యత

The importance of subramanya shashti-Telugu devotional news

మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి’ అంటారు. దేవతల సేనకు నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసింది ఈ రోజేనని చెబుతారు. కుమారస్వామి, స్కందుడు, శరవణభవుడు అని సుబ్రహ్మణ్యుడికి పేర్లు.
* కుమారస్వామికి ఆరు ముఖాలు. కనుక షణ్ముఖుడని కూడా పేరు. ఐదు ఇంద్రియాలు, మనస్సులకు ఈ ఆరు ముఖాలూ సంకేతాలు. అలాగే యోగ సాధనలోని షట్చక్రాలకు ఈ ఆరు ముఖాలూ ప్రతీకలు.
* సుబ్రహ్మణ్యుడు జ్ఞాన స్వరూపుడు. సుబ్రహ్మణ్య ఆరాధన యోగబలాన్ని, ఆరోగ్యఫలాన్ని, సంతానప్రాప్తినీ అనుగ్రహిస్తుంది.
* సుబ్రహ్మణ్య షష్ఠినాడు పేదలకు దుప్పట్లు, కంబళ్లు దానం చేసే ‘ప్రావరణ వ్రతం’ నిర్వహించాలని పెద్దలు చెప్తారు. ప్రావరణం అంటే కప్పి ఉంచడం. చలికాలంలో వచ్చే ఈ పర్వదినాన పేదల చలి బాధను నివారించే వ్రతంలోని ఆంతర్యం చాలా గొప్పది. సాటివారి బాధలను గురించి ఆలోచించటమే ‘జ్ఞానం’ అని మన పెద్దలు పరోక్షంగా సూచిస్తున్నారు. ఈ పర్వదినాన సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించి, ఆ రూపంగా ఒక బ్రహ్మచారికి భోజనంపెట్టి, వస్త్రాలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి గౌరవించడం సంప్రదాయం.
* కుండలినీ యోగస్వరూపుడు సుబ్రహ్మణ్యుడని నమ్మి సర్పాకారంలో పూజిస్తారు.