NRI-NRT

ఘనంగా ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

2019 4th Telugu Writers Conference Begins In Vijayawada

ప్రపంచ తెలుగు రచయితల నాలుగో మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ సిద్దార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహిస్తున్న మహాసభలకు దేశ విదేశాల నుంచి భాషాభిమానులు, సాహిత్యాభిమానులు, రచయితలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగు భాష ఉనికి కోసం కృషిచేసిన ప్రసిద్ధ రచయిత్రి శివరాజు సుబ్బలక్ష్మి జ్యోతి ప్రజ్వలనతో మూడు రోజుల మహాసభలను ప్రారంభించారు. మహాసభల ప్రారంభ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తమ సందేశాలను పంపగా నిర్వాహకులు వాటిని చదివి వినిపించారు. ప్రపంచ తెలుగు రచయితల నాలుగో సంపుటిని శాంతా బయోటెక్‌ అధినేత వరప్రసాద్‌ ఆవిష్కరించారు. తెలుగు ప్రపంచం ప్రత్యేక సంచికను సిద్దార్థ అకాడమీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఆంగ్ల మాధ్యమం లేకపోతే ఆంగ్లం రాదని చెప్పిన ప్రభుత్వాలు.. ఇప్పుడు తెలుగు మాధ్యమమే లేకుండా తెలుగుని ఎలా కాపాడగలవని తెలుగు రచయితల మహాసభల కమిటీ గౌరవ అధ్యక్షుడు మండలి బుద్దప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుగు రావాలని… ఏ భాష పేరుతో రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. తెలుగులో సినిమాలు తీస్తూ లాభాలు పొందుతున్న తెలుగు సినీ పరిశ్రమ… తెలుగు మనుగడ ప్రశ్నార్థకంగా మారితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.