Politics

జై ఆంధ్రా…జై జై ఆంధ్రా!

Pawan Kalyan Slogan For AP Farmers Is Jai Andhra

వైకాపా నేతలకు ఉత్తరాంధ్రపై ఒక్కసారిగా ప్రేమ పుట్టుకొచ్చిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఇస్తే ముగ్గురు సీఎంలను నియమించాలని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రాష్ట్రం విడిపోయి ఇబ్బందుల్లో ఉంటే మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం మూడు ముక్కలు కావాలా? అని మండిపడ్డారు. తుళ్లూరులో రైతులు చేస్తున్న మహాధర్నాకు పవన్‌ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. రాజధాని రైతులు ఇకపై అమరావతి అని కాకుండా జై ఆంధ్రా..జైజై ఆంధ్రా నినాదాలు చేయాలని సూచించారు. అమరావతి అంటే ఒక ప్రాంతానికే పరిమితం అవుతుందని.. రాష్ట్రం కోసం భూములు ఇచ్చినందున జై ఆంధ్రా నినాదాలు చేయాలన్నారు. అలా చేస్తూ పోరాడాలని.. ఎవరు అడ్డొస్తారో తానూ చూస్తానని వ్యాఖ్యానించారు. అందరి ఆమోదంతోనే అమరావతి రూపుదిద్దుకుందని.. ఆరోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ ఎందుకు వ్యతిరేకించలేదని పవన్‌ ప్రశ్నించారు. రాజధానికి 33వేల ఎకరాలు ఎందుకని తాను ఆనాడే వ్యతిరేకించానన్నారు. ఒక్కఛాన్స్‌ ఇస్తే మిగిలింది వినాశనమే అంటూ తీవ్రంగా విమర్శించారు. రాజధాని రైతుల త్యాగాలకు వృథా కానివ్వబోమన్నారు. ఉత్తరాంధ్ర భూములు పెద్దల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. ప్రజాప్రతినిధులకు గెలుపోటములు ఉంటాయని.. పోలీసులు ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. రాజధానిలో అభివృద్ధిని ప్రజలకు చూపించడంలో తెదేపా విఫలమైందని పవన్‌ అన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని.. రైతుల పోరాటానికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.