Business

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్

Real Estate Boom In Hyderabad

సిటీలో అభివృద్ధి వికేంద్రీకరణ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పటివరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే కేవలం ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లోనే కనిపించడంతో… ఆ ప్రాంతానికి ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. దీంతో ఐటీ కేంద్రంగా ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేట వరకు ఎకరం భూమి ధర రూ.30 కోట్లకు చేరగా… మెరుగైన రవాణా, మౌలిక వసతులు అందుబాటులో ఉండటంతో.. కంపెనీలన్నీ అటు వైపు మొగ్గుచూపాయి. ఈ క్రమంలోనే ఐటీ కారిడార్ కు దగ్గరగా, ఓఆర్ఆర్ ఆనుకుని ఉండటంతో… సౌత్ సిటీలోనూ రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది.
*రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాల జోరు
సిటీ నలుదిశలా రెసిడెన్షియల్, కమర్షియల్ సెగ్మెంట్లలో నిర్మాణ రంగానికి డిమాండ్ ఉండటంతో… సౌత్ సిటీలో ఉన్న చార్మినార్ కేంద్రంగా రాజేంద్రనగర్, మలక్ పేట్, సంతోష్ నగర్, చాంద్రయాణగుట్ట, ఫలక్ నుమా, రాజేంద్ర నగర్ సర్కిళ్లు ఉన్నాయి. ఇందులో అత్తాపూర్, మైలార్ దేవ్ పల్లి, కిషన్ బాగ్, నవాబ్ కుర్దు, సంతోష్ నగర్, లలిత్ భాగ్, ఉప్పుగూడ వంటి ప్రాంతాల్లో రెసిడెన్సియల్, కమర్షియల్ భవనాల నిర్మాణాలు జోరందుకున్నాయి. సౌత్ సిటీ చుట్టూ ఫార్మా సిటీ, ఆదిభట్ల ఎయిర్ స్పేస్, తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ, శ్రీశైలం హైవే, కోకాపేట న్యూ సిటీ, బుద్వేల్ ఐటీ పార్క్, కాంచన్ బాగ్ డీఆర్డీఎల్, రాజేంద్ర నగర్ ఆగ్రి వర్సిటీ వంటి ప్రాంతాలకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయి. దీంతో కమర్షియల్ యాక్టివిటీ బాగా పెరుగుతోంది. ఇక్కడ భూముల రేట్లు వెస్ట్, ఈస్ట్ సిటీతో సమానంగా ఉండగా… ఐటీ కారిడార్ కు చేరువలో, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉండటం సౌత్ జోన్ కు స్పెషల్ అడ్వాంటేజ్.
*లాజిస్టిక్ హబ్ లకు అనుకూలం…
ఎయిర్ పోర్టుకు చేరువలో ఉండటంతో.. ఎక్కువగా లాజిస్టిక్ హబ్ లకు సౌత్ సిటీ అనుకూలంగా ఉంది. ఇప్పటికే పోచారంలో ఐటీ పార్కు డెవలప్ చేసినట్లుగా, ఈ ప్రాంతానికి పెద్దగా ఐటీ పార్కులు ఏర్పాటు చేయకపోయినా.. కూడా కమర్షియల్ పరంగా మంచి డిమాండే ఉంది. ముఖ్యంగా అపార్టుమెంట్లు ఇప్పుడిప్పుడే విస్తరిస్తుండగా, రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లోనూ అపార్టుమెంట్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. రోడ్లు, స్కూళ్లు, విద్యాసంస్థలు, హాస్పిటళ్లు, కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి వస్తే గనుక ఈ ఏరియాకు మంచి డిమాండ్ ఉంటుంది. శాటిలైట్ టౌన్ షిప్పులు, వాక్ టు వర్క్ కాన్సెప్టులతో డెవలప్ చేయగలిగితే … సౌత్ సిటీ లో రియల్ క్రయవిక్రయాలు పుంజుకుంటాయని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.