Food

ఆగ్రా పేఠా మిఠాయి తయారీ

The famous agra sweet making-telugu food and indian sweets making

ఇది అత్యంత రుచికరమైన స్వీట్. కానీ దీన్ని తయారు చెయ్యడం చాలా తక్కువ మందికి తెలుసు. ఆగ్రాలో ఇది ఫేమస్. దీన్ని ఆగ్రా కా స్వీట్ అంటారు. దేశవ్యాప్తంగా పెతా స్వీట్ అని పిలుస్తారు. ఆగ్రాలో తాజ్ మహల్ ఎంత ఫేమస్సో… ఈ స్వీట్ కూడా అంతే ఫేమస్. చూడటానికి ట్రాన్స్‌పరెంట్ (పారదర్శకం)గా, మెత్తగా, జ్యూసీగా, క్యాండీ లాగా ఉంటుంది. షుగర్ సిరప్‌లో ముంచుతారు కాబట్టి… చాలా తియ్యగా ఉంటుంది. చిత్రమేంటంటే… దీన్ని బూడిద గుమ్మడి కాయతో తయారుచేస్తారని చాలా మందికి తెలియదు. అసలు నమ్మలేరు కూడా. లోపల తెల్లగా ఉండే గుమ్మడి కాయను ఎంచుకొని… దీన్ని తయారుచేస్తారు. ఈ స్వీట్ మాత్రం పిల్లలు, పెద్దలూ అందరికీ నచ్చేస్తుంది. ఈ స్వీట్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఫలితంగా ఇప్పుడు ఇందులో కూడా రకరకాలొచ్చేశాయి. కేసర్ పెథా, అంగూరీ పెథా… ఇలా ఎన్నో రకాలు. పెథా స్వీట్ చెయ్యడం కష్టమే అయినప్పటికీ… తేలిగ్గా ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పెథా స్వీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు :
తెల్ల బూడిద గుమ్మడి కాయ – 1 కేజీ
కెమికల్ లైమ్ – 2 టీ స్పూన్లు
పంచదార – 3 కప్పులు
నీరు – 3 కప్పులు

పాలు – 2 టీస్పూన్లు (ఇందులో రెండు టీస్పూన్ల నీరు కలపాలి)
నిమ్మ రసం – 1 టేబుల్ స్పూన్
యాలకులు – 3-4. (తొక్క తీసి… పొడుం చేసి పెట్టుకోవాలి)
రోజ్ వాటర్ – 1 టేబుల్ స్పూన్

పెథా స్వీట్ తయారీ విధానం :
– బూడిద గుమ్మడికాయ తొక్క తీసి… లోపలి గింజలు తొలగించాలి.
– తెల్లటి మెత్తటి లోపలి పదార్థాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చెయ్యాలి.
– నీటిలో 1 టీ స్పూన్ కెమికల్ లైమ్ వేసి… ముక్కలన్నీ ఆ నీటిలో మునిగేలా చెయ్యాలి. అందుకు సరిపడా నీరు పోసుకోవాలి.
– ఆ ముక్కల్ని నీటిలో ముంచి… బాగా శుభ్రం చేసి… బయటకు తీసి… ఇప్పుడు క్యూబ్స్‌లా చిన్న ముక్కలుగా చెయ్యాలి.
– మిగిలిన కెమికల్ లైమ్‌ను వేరే నీటిలో వేసి… బాగా కలిపి… అందులో చిన్నగా చేసిన ముక్కల్ని వెయ్యాలి.
– ఈ కొత్త కెమికల్ లైమ్ నీటిలో ముక్కల్ని రెండు గంటల పాటూ నానబెట్టాలి.
– ఇప్పుడు ముక్కల్ని నీటిలోంచీ తీసి… బాగా కడగాలి. తద్వారా కెమికల్ లైమ్ అన్నది ఆ ముక్కలపై ఎక్కడా లేకుండా చెయ్యాలి.
– ఇప్పుడు నీటిని బాణలిలో వేసి… ముక్కల్ని అందులో వెయ్యాలి. ముక్కలు మెత్తగా, ట్రాన్స్‌పారెంట్‌గా అయ్యేవరకూ ఉడికించాలి.
– ఈలోపు ఓ ప్యాన్ (బాణలి)లో మూడు కప్పుల నీరు, చక్కెర వేసి… సిమ్‌లో వేడి చేస్తూ… చక్కెర పూర్తిగా కరిగేలా తిప్పుతూ ఉండాలి. బుడగలు వచ్చేవరకూ ఉడికించాలి.
– ఇప్పుడు నిమ్మరసం వెయ్యాలి. యాలకుల పొడి వెయ్యాలి. తిప్పుతూ ఉండాలి. చిక్కబడే వరకూ తిప్పుతూ ఉడికించాలి.
– గుమ్మడికాయ ముక్కలు ఉడకగానే… వాటిని స్పూన్‌తో బయటకు తీసి… చక్కెర సిరప్‌లో వెయ్యాలి.
– అన్ని ముక్కలూ వేశాక… మరికొన్ని నిమిషాలపాటూ… సిమ్‌లో ఉడికించాలి. ఇప్పుడు స్టౌ నుంచీ కిందకు దింపి… రోజ్ వాటర్ పోసి బాగా కలపాలి.
– ఇప్పుడు చల్లబరచాలి. ఆ తర్వాత ముక్కల్ని ఓ గిన్నెలో వేసి… సెర్వ్ చేస్తే… వాటి టేస్ట్ ఉంటుందీ… వెంటనే అన్నీ ఇంట్లో అందరి నోట్లోకీ వెళ్లిపోతాయి.