DailyDose

కార్డుల వాడకంపై RBI నూతన నియమాలు-వాణిజ్యం

RBI Releases New Guidelines For Cards Usage

* గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా కార్డుల ద్వారా జ‌రిగే లావాదేవీలు సంఖ్య‌, విలువ రెండూ కూడా పెరుగుతూనే వ‌స్తున్నాయి. ఇక‌పై కూడా పెరుగుతూనే ఉంటాయిని నిపుణులు అంటున్నారు. అందువ‌ల్ల క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల‌ వినియోగ‌దారులకు మెరుగైన సేవ‌ల‌ను అందుబాటులో ఉంచేందుకు, అదేవిధంగా లావాదేవీల భ‌ద్ర‌త‌ను పెంచేందుకు రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కొన్ని కొత్త నిబంధ‌న‌లను బుధ‌వారం జారీ చేసింది. క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌కు ఆర్‌బీఐ జారీ చేసిన కొత్త నియ‌మాలు:
* కార్డు జారీ/ పున‌రుద్ధ‌ర‌ణ చేసేప్పుడు భార‌త‌దేశంలోని ఏటీఎమ్‌లు, పాయింట్ ఆఫ్ సేల్‌(పీఓఓస్‌) కేంద్రాల వ‌ద్ద మాత్ర‌మే దేశీయ కార్డు లావాదేవీల‌ను అనుమ‌తించాల‌ని ఆర్‌బీఐ బ్యాంకుల‌ను కోరింది.
* అంతర్జాతీయ లావాదేవీలు, ఆన్‌లైన్ లావాదేవీలు, కార్డ్-లేని లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ లావాదేవీల కోసం, వినియోగదారులు తమ కార్డుపై ప్ర‌త్యేక‌మైన‌ సేవలను ఏర్పాటు చేసుకోవాలి.
* ఈ నియ‌మాలు మార్చి16, 2020 నుంచి కొత్త కార్డులు తీసుకున్న వారికి వర్తిస్తాయి. పాత కార్డు హోల్డ‌ర్లు ఈ సేవ‌లు వ‌ద్ద‌నుకుంటే నిలిపివేయ‌వ‌చ్చు.
* ఇప్పటికే ఉన్న డెబిట్, క్రెడిట్ కార్డులు విష‌యంలో, కార్డుల‌ను జారీ చేసిన‌ సంస్థ‌లు, వారు తీసుకునే రిస్క్ ఆధారంగా అంత‌ర్జాతీయ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్స్, కార్డ్ నాట్ ప్రజెంట్ ట్రాన్సాక్షన్లకు అనుమతించాలా…రద్దు చేయాలా… అనే నిర్ణ‌యం తీసుకుంటాయి.
* వినియోగ‌దారులంద‌రికీ 24క్ష్7 కార్డు ఆన్, ఆఫ్ సేవల అందుబాటులో ఉంటాయి. దీంతో పాటు లావాదేవీల ప‌రిమితిని కూడా ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఈ సేవ‌ల‌ను మొబైల్ అప్లికేష‌న్‌/ ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్‌/ ఏటీఎమ్‌/ ఇంట‌రేక్టీవ్ వాయిస్ స‌ర్వీస్‌(ఐవీఆర్‌) వంటి అందుబాటులో ఉన్న అన్ని చాన‌ళ్ళ ద్వారా పొంద‌చ్చు.
* అయితే, ప్రీపెయిడ్ గిఫ్ట్ కార్డులు, మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్ యూజ‌ర్ల‌కు ఈ నిబంధనలు తప్పనిసరి కాదు.
* సైబ‌ర్ మోసాలు పెరుగుతున్న నేఫ‌థ్యంలో ఆర్‌బీఐ తాజా సూచ‌న‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

* ఏజీఆర్‌ తీర్పును పునఃసమీక్షించాలని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు వేసిన పిటిషన్లను గురువారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం రూ.92వేల కోట్ల బకాయిలను టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. రెండు టెలికం సంస్థలు వేసిన పిటిషన్లను జస్టిస్ట్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షా నేతృత్వంలోని ధర్మాసనం ప్రత్యేక ఛాంబర్‌లో సమావేశమై పరిశీలించింది. గత తీర్పును సమీక్షించాల్సిన అవసరమేమి లేదని ధర్మాసనం వెల్లడించింది.

* ప్రపంచంలో ధనవంతుడైన ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత్‌ అభివృద్ధికి ఎంతో అవకాశమున్న ప్రధానమైన మార్కెట్‌ అని, 21వ శతాబ్దం భారత్‌దేనని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాకుండా భారత్‌లో చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేసేందుకు 1 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7వేల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు జెఫ్ బెజోస్ ప్రకటించారు. వైఫల్యాల నుంచి నేర్చుకొనేందుకు విజయం దిశగా వెళ్లేందుకు తమ సంస్థ ఓ మంచి ప్రదేశమని చెప్పారు. బుధవారం జరిగిన చిన్న, మధ్యతరహా ఆన్‌లైన్‌ వ్యాపారులతో నిర్వహించిన ‘అమెజాన్‌ సంభవ్‌’ సదస్సులో ఆయన అమెజాన్‌ ఇండియా చీఫ్‌ అమిత్‌ అగర్వాల్‌తో జరిగిన ఇష్టాగోష్ఠిలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘ప్రయోగాల ద్వారా వచ్చే వైఫల్యాలు కొన్నిసార్లు సరికొత్త ఆవిష్కరణలకు కారణమవుతాయి. ప్రతిభాపరంగా ఉండే వైఫల్యాలను మాత్రం నివారించుకోవాలి. ఓటమిని, వైఫల్యాలను ఎవరూ ఇష్టపడరు. ఓటమి అనేది తెలిసినప్పుడు అది చాలా చిరాకుగా ఉంటుంది. బాగా అనిపించదు. ఒక విజయం వెనుక, ఒక విజేత వెనుక డజన్ల కొద్దీ వైఫల్యాలు ఉంటాయి’’ అని చెప్పారు.

* దేశవ్యాప్తంగా రెండు రోజులు బ్యాంకుల సమ్మె చేపట్టనున్నట్టు బ్యాంకు ఉద్యోగుల యూనియన్ల ప్రతినిధులు తెలిపారు. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ)తో తమ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు. జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీలలో తాము సమ్మె చేయనున్నామని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. నెల రోజుల వ్యవధిలో బ్యాంకులు సమ్మె నిర్వహించటం ఇది రెండోసారి. జనవరి 8న భారత్‌ బంద్‌ సందర్భంగా బ్యాంకులు సమ్మెలో పాల్గొన్న సంగతి తెలిసిందే. తొమ్మిది ప్రభుత్వ బ్యాంకు యూనియన్ల సమాఖ్య అయిన యూఎఫ్‌బీయూ.. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌తో వేతన సంబంధ అంశాలపై సోమవారం చర్చలు జరిపింది. వేతనాలలో 20 శాతం పెరుగుదల, మూలవేతనంతో ప్రత్యేక భత్యాన్ని ఏకం చేయటం, ఐదు రోజుల పనిదినాల విధానం వంటి అంశాలను యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. వివిధ ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై కూడా వారు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను అంగీకరించని పక్షంలో మార్చి 11 నుంచి 13 వరకు మరోసారి సమ్మెకు దిగాలని భావిస్తున్నారు. అప్పటికీ వేతనాలు పెంచకపోతే ఏప్రిల్‌ 1 నుంచి నిరవధిక సమ్మె చేయటానికి సిద్ధమౌతున్నారు.

* దాదాపు 18 నెలల వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా-చైనా ముందడుగు వేశాయి. దాదాపు ఏడాది పాటు ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల అనంతరం తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బుధవారం శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా ఉపప్రధాని లియూ హీ ఒప్పందంపై సంతకం చేశారు. అయితే చైనా ఎగుమతులపై సుంకాల తగ్గింపును మాత్రం ఒప్పందంలో చేర్చకపోవడం గమనార్హం. మేధో హక్కుల పరిరక్షణ, బలవంతపు సాంకేతిక బదిలీకి ముగింపు, వివాదాల పరిష్కారాలకు సమర్థమైన వ్యవస్థ ఏర్పాటు, కరెన్సీ మార్పులకు ముగింపు తదితర అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా చైనాకు అమెరికా వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు పెరుగనున్నాయి.