Sports

గ్రాండ్‌స్లాం విజేత గబ్బు కూతలు

Tennis Grandslam Winner Margaret Court Useless Comments On Homosexuality

టెన్నిస్‌ చరిత్రలో గొప్ప క్రీడాకారుల్లో ఒకరు మార్గరెట్‌ కోర్ట్‌. ఒకే సీజన్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన విజేత. ఆమె ఈ రికార్డు సృష్టించి ఇప్పటికే 50 ఏళ్లు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆమె ఘనతను వేడుక చేసుకోవడం సందిగ్ధంగా మారింది. ప్రస్తుతం టోర్నీ నిర్వాహకులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇందుకు ఆమె చేసిన వ్యాఖ్యలే కారణంగా మారాయి. మార్గరెట్‌ కోర్ట్‌ కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్‌లు అందుకొని చరిత్ర సృష్టించారు. 1970లో ఒకే సీజన్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు స్వీప్‌ చేసి రికార్డులను తిరగరాశారు. ఇలాంటి ఘనత మరో నలుగురికి మాత్రమే ఉంది. ప్రస్తుతం మార్గరెట్‌ వయసు 77. చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సంప్రదాయవాదిగా మారిపోయారు. కాలక్రమంలో వస్తున్న మార్పులను అంగీకరించలేకపోతున్నారు. నేరుగా విమర్శలు చేస్తున్నారు. ‘ఆస్ట్రేలియా ప్రభుత్వం, మీడియాను దెయ్యం నియంత్రిస్తోంది’, ‘టెన్నిస్‌ మొత్తం లెస్బియన్లతో నిండిపోయింది’ అని కోర్ట్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రాన్స్‌జెండర్‌ పిల్లలు నాజీ తరహా విధానం ఫలితమే అని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. 2017లో స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవచ్చని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి క్వాంటాస్‌ ఎయిర్‌లైన్‌ సీఈవో మద్దతు పలకడంతో కోర్ట్‌ ఆ విమానాలను ఎక్కకూడదని నిర్ణయించుకొన్నారు. మార్గరెట్‌ను మార్టినా నవత్రిలోవా వ్యతిరేకిస్తున్నారు. ‘ఒకరి గుర్తింపునకు సంబంధించి చరిత్రను మార్చాల్సిన, తిరగ రాయాల్సిన అవసరం లేదు. కానీ, వాటికి గుర్తుగా వేడుక చేసుకోవాల్సి అవసరం మాత్రం అస్సలు లేదు’ అని విమర్శించారు. ఆమె గే హక్కుల మద్దతుదారు. ‘గతంలో చాలామంది లాగే మార్గరెట్‌ కోర్ట్‌ బైబిల్‌ వెనక దాక్కుంటున్నారు. ఆమె తర్వాత కూడా అలాగే చేస్తారు’ అని ఆస్ట్రేలియా దిగ్గజం లాడ్‌ రావర్‌ విమర్శించారు. దీంతో వేడుక విషయంలో ఆస్ట్రేలియా ఓపెన్‌ నిర్వాహకులకు పెద్ద చిక్కొచ్చి పడింది.