Business

కేరళకు భారీగా పర్యాటకులు

Keral Tourism Spikes With Visitors

కేరళకు దేశీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత త్రైమాసికంలో 16 శాతం వృద్ధిరేటు నమోదైందని పర్యాటకశాఖ అధికారులు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కేరళ టూరిజం పార్ట్‌నర్‌షిప్‌ మీట్‌ 2020 కార్యక్రమంలో కేంద్ర పర్యాటకశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సతృపదత్‌, కేరళ పర్యాటకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మురళీధరన్‌ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశీయ పర్యాటకులతోపాటు విదేశీ పర్యాటకులు కూడా పెరిగారని అన్నారు. ప్రకృతి వైపరిత్యాలు ఎదుర్కొని కేరళ పర్యాటకం నిలబడిందన్నారు. తెలంగాణ ప్రాంతము నుండి కేరళ పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి ఎక్కువ మొత్తంలో వస్తున్నారని, పర్యాటకులను ఆకర్షించే ఎన్నో అందాలు కేరళ స్వంతమని అన్నారు. అందుకే కేరళను పర్యాటకుల స్వర్గధామని పిలుస్తారని అన్నారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే విషయంలో కేరళ రాష్ట్రం ముందు వరుసలో ఉందని అన్నారు. రెండవ విడత క్యాంపేయిన్‌లో భాగంగా పది భారతీయ నగరాల్లో భాగస్వామ్య సమావేశాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు.భారత దేశమంతటా ముఖ్యమైన నగరాల్లో వాణిజ్య ఉత్సవాలు జరుగబోతున్నట్లు చెప్పారు. మొదటగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.కేరళలో పండుగలు, సంప్రదాయబద్ధంగా అద్భుతమైన అంశాలుంటాయని అన్నారు. నిషగంధి పండుగను అద్భుతంగా నిర్వహిస్తామని అన్నారు. ఇందులో మాయా ప్రదర్శనలతో పాటు ఒడిస్సీ, కథక్‌, భరతనాట్యం, మణిపురి, మోహినిఅట్టం, చౌ, కూచి పూడి నృత్య రూపాలను పండుగలో ప్రదర్శిస్తారని అన్నారు. అదేవిధంగా క్రీస్తుపూర్వం మొదటి శతాబ్ధం నాటికి అరబ్బులు, రోమన్లు, ఈజిప్షియన్లు అభివృద్ధి చెందుతున్న ఓడ రేవు అవశేషాలు 25 మ్యూజియాలలో భద్రపరచబడ్డాయని అన్నారు.ఫిబ్రవరి త్రిసూర్‌లో 21 ఏనుగులతో పెద్ద ర్యాలీతోపాటు పంచవద్యం, పండిమొలం వంటి సాంప్రదాయ సంగీత బృందాలు అలరిస్తాయని అన్నారు. మే నెలలో జరిగే కేరళ యొక్క ఆధ్యాత్మిక , సాంస్కృతిక సారాన్ని విలీనం చేసే అద్భుతమైన దృశ్యం త్రిస్సూర్‌ పూరం,కాపరిసన్‌ ఏనుగులు మిరుమిట్లు గొలిపే పారాసోల్స్‌, పెర్కషన్‌ మ్యూజిక్‌ గొప్ప ప్రదర్శన ఉంటుందని అన్నారు. చెలా, కురుంకుజల్‌, కొంబు, ఎలాథాలం వంటి సాంప్రదాయ వాయిద్యాలతో 250 మంది కళాకారులు పాల్గొంటారని తెలిపారు.