Kids

నెపోలియన్ గుండె బలం-తెలుగు చిన్నారుల కథ

Telugu Kids Moral Story-Strong Will And Pre-Planning

నిరాశ, భయం అనేవి చాలా ప్రమాదకారులు. వాటికి మన మనసులో ఏమాత్రం చోటు దొరికినా లోతుగా పాతుకుపోయి మనల్ని కష్టాలకు గురిచేస్తాయి. ఆత్మశక్తి గలవారిని అవి ఏమీ చేయలేవు. ఆత్మశక్తి అసంభవాన్ని సంభవం చేయగలుగుతుంది.ఆత్మవిశ్వాసం గలవారికి వినయవిధేయతలూ ఎక్కువగానే ఉంటాయి. నిజమైన గుండెబలం గలవారికి అహంకారం ప్రదర్శించవలసిన అవసరం రాదు. ఆత్మవిశ్వాసం గల వ్యక్తి స్థిరమైన మనసుతో జీవిస్తుంటాడు. అత్యంత క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడానికి సంసిద్ధుడై ఉంటాడు.నెపోలియన్‌ గాఢంగా నిద్రపోతున్నప్పుడు సైన్యాధిపతి పరుగెత్తుకుంటూ ఆయన వద్దకు వచ్చి ‘శత్రుసైన్యం దక్షిణ దిక్కునుంచి చొచ్చుకు వస్తోంది’ అని తెలిపాడు. నిద్రలోనుంచి నెపోలియన్‌ చటుక్కున లేచి ‘అయితే ఆ గోడమీద రాసిన 64వ నంబరు పద్ధతిలో శత్రువుల్ని ఎదుర్కోండి’ అన్నాడు. శత్రువులు ఎటువైపునుంచి దాడిచేస్తే ఎలా ఎదుర్కోవాలో నెపోలియన్‌ ముందుగానే ఆ పద్ధతిని సిద్ధం చేసుకొని ఉన్నాడు! ఇలాంటి వ్యక్తి ఆత్మస్థైర్యం ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరదు. గడ్డిరొట్టెలు తింటూ యుద్ధం చేయవలసి వచ్చినా కించిత్తైనా వెనుదీయక దిల్లీ సుల్తాన్ను సైతం ఎదిరించి, జీవితమంతా పోరాటం సల్పిన రాణాప్రతాప్‌ గుండెధైర్యం- దేశభక్తులకు ఆదర్శ ప్రాయం, ప్రశంసనీయం.ఆత్మాభిమానం గలవారికి సహజంగానే గుండెధైర్యం ఉంటుంది. వాళ్లకు వినయవిధేయతలు తక్కువేమీ కావు. అవసరమైనప్పుడు ఎవరినైనా ఎదిరించగలరు. అక్బర్‌ ఆస్థానంలో శ్రీపతి అనే కవి ఉండేవాడు. ఆయనకు మనుషుల్ని పొగడటమంటే గిట్టదు. సదా శ్రీహరినే స్తుతిస్తూ కవితలు రాసేవాడు. ఇతర కవులు అక్బరును ప్రశంసిస్తూ కవితాగానం చేసి బహుమతులు పుచ్చుకొనేవారు. ఈర్ష్యాళువులైన కవులు శ్రీపతి ‘అహంకారి’ అని అక్బరుకు పితూరీలు చెప్పేవారు. ఒక పర్యాయం ‘అక్బర్‌ అసమానుడు’ అనే శీర్షికతో కవులు కవితాసభ ఏర్పరచి అక్బరును పొగడటం మొదలుపెట్టారు. శ్రీపతి మాత్రం మానవమాత్రుడిపై తాను కవిత్వం చెప్పజాలనని అక్బర్‌ సమక్షంలోనే ఒక కవిత చెప్పాడు. దీంతో శ్రీపతి పని ఆఖరు అని, అక్బరు అతణ్ని శిక్షించకుండా వదిలిపెట్టడని మిగతా కవులందరూ గుసగుసలు పోయారు. ‘ఎన్ని గుండెలు ఈ శ్రీపతి కవికి’ అనీ అనుకున్నారు. వాళ్లు అనుకున్నట్లుగా ఏమీ జరగలేదు. పైగా అక్బర్‌ శ్రీపతి నిబద్ధతను ప్రశంసిస్తూ అతణ్ని ఘనంగా సత్కరించాడు!ఆంగ్లేయుల పాలనలో స్వాతంత్య్ర కాంక్ష ప్రకటించిన భారతీయులకు భారీగా శిక్షలు పడేవి. ఆ రోజుల్లో కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రవేశం దుర్లభం. ఆ పరిస్థితుల్లోనూ ఒక పిల్లవాడు తన తెలివితేటలతో ప్రవేశం సంపాదించాడు. ఆ కళాశాలలో ఒక ఆంగ్లేయుడు ఆచార్యుడిగా ఉండేవాడు. అతడికి మన జాతిపై చిన్నచూపు. అందువల్ల భారతీయుల్ని ఏదో వంకపెట్టి అవమానిస్తూ మాట్లాడేవాడు. ఒకరోజు అతడు భారతదేశాన్ని కించపరుస్తూ అవహేళనగా తరగతి గదిలో మాట్లాడుతున్నాడు. ఆ తరగతి గదిలోనుంచి ఒక కుర్రవాడు లేచి ముందుకు వచ్చి ఆ ఆచార్యుడి చెంప చెళ్లుమనిపించాడు. ‘నా మాతృదేశాన్ని దూషించిన నీకిదే తగిన శాస్తి!’ అంటూ తరగతిలోంచి విసవిస నడుచుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. అతడి ధైర్యానికి అంతా విస్తుపోయారు. ఫలితంగా అతడు కళాశాలలోనుంచి శాశ్వతంగా వెళ్లిపోవలసి వచ్చింది. ఆ యువకుడు ఎవరో కాదు- దేశభక్తుల్లో అగ్రగణ్యుడు సుభాష్‌ చంద్రబోస్‌!