NRI-NRT

చైనా నుండి వచ్చేవారిపై అమెరికా నిషేధం

USA Bans Travellers Arriving From China

కరోనా వ్యాధి సోకిన అమెరికన్ల సంఖ్య 6కు చేరుకున్న నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు అమెరికా ప్రభుత్వం శుక్రవారం హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. గత రెండు వారాల్లో చైనాలో పర్యటించిన విదేశీయులను తమ దేశంలోకి అనుమతించబోమంటూ తాత్కాలిక బ్యాన్ విధించింది. అయితే అమెరికా పౌరులు, అక్కడ శాశ్వత నివాసం కలిగిన వారి కుటుంబ సభ్యులకు మాత్రం ఈ నిబంధన వర్తించదని తెలిపింది. ఇక వ్యాధి వ్యాప్తికి కేంద్రమైన చైనా ప్రావిన్స్‌ నుంచి తిరిగొస్తున్న అమెరికా పౌరులను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో(విడిగా) ఉంచబోతున్నట్టు తెలిపింది. ఇక చైనాలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించిన వారిని ఎయిర్‌పోర్టుల్లోనే రోగ లక్షణాల కోసం పరీక్షిస్తామని, వారు కొద్ది రోజుల పాటు స్వచ్ఛందంగా ఇంటికే పరిమతమవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్వేత సౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికాలోని మూడు ప్రధాన విమానయాన సంస్థలు ఇప్పటికే చైనాకు సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి.మరోవైపు కరోనా వైరస్‌ వ్యాధితో మృతి చెందిన వారి సంఖ్య 213కు చేరిన నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. చైనా నుంచి భారత్‌కు ప్రయాణమవుతున్న వారిలో ఆరుగురిని వూహాన్ ఎయిర్ పోర్టులోనే ఆపేసినట్టు తెలిసింది. వీరు జ్వరంతో ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. వారిని డాక్టర్ల పరీశీలనలో ఉంచినట్టు తెలుస్తోంది. చైనాలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాన్ని పంపించిన విషయం తెలిసిందే.