DailyDose

చైనీయులను రెస్టారెంట్లలోకి అనుమతించట్లేదు-తాజావార్తలు

Coronavirus brings huge wave of hatred on to Chinese

* అమరావతి రైతులు, ఐకాస నేతలు దిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఐకాస నేతలు మంత్రి దృష్టికి తెచ్చారు. కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… మూడు రాజధానులపై ఇప్పటి వరకు వైకాపా ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే అయినా… రాజధాని మార్పు మంచిది కాదన్నారు. భాజపా రాష్ట్ర పార్టీ మూడు రాజధానులు వద్దని చెప్పిందని కిషన్‌రెడ్డి తెలిపారు.

* కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను దిల్లీలోని సర్‌ గంగారాం ఆస్పత్రికి తరలించారు. జ్వరం, శ్వాస సంబంధ సమస్యతో ఆమె ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

* ఆదాయ పన్ను విషయమై ప్రవాస భారతీయుల్లో నెలకొన్న సందిగ్ధతను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం తొలగించారు. ప్రవాస భారతీయులు కేవలం భారత్‌లో ఆర్జించే సంపాదనకు మాత్రమే పన్ను చెల్లించాలని తెలిపారు. ఇతర దేశాల్లో సంపాదించే వాటికి పన్ను కట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ఈ కొత్త పన్ను విధానంపై అధికారులు అయోమయానికి గురికావొద్దని ఆమె కోరారు. ఎన్‌ఆర్‌ఐలు ఇతర దేశాల్లో ఆదాయం పొందవచ్చు.. కానీ వారికి ఇక్కడ ఉండే ఆస్తి నుంచి వచ్చే ఆదాయంపై పన్ను తీసుకునేందుకు మాత్రం తమకు హక్కు ఉందని నిర్మలా తెలిపారు.

* దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెదేపా నేత గణేష్ గుప్తాతో పాటు, శంషాబాద్‌కు చెందిన పలువురు కార్యకర్తలు కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ… తెరాసను ఎదుర్కొనే సత్తాలేక రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని విమర్శించారు. తెరాస ప్రభుత్వ పనితీరుకు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ తెరాస అని స్పష్టం చేశారు.

* నిర్భయ దోషుల మరణ శిక్ష విషయంలో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. హత్యాచారం కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై పటియాలా కోర్టు స్టే విధించడాన్ని సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదివారం విచారణ జరిగింది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్‌ సురేష్‌ ఖైత్‌ తెలిపారు.

* అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల పాటు రైళ్లు, బస్సుల్లో తనిఖీలు నిర్వహించిన డీఆర్‌ఐ అధికారులు.. మొత్తం నాలుగు కేసుల్లో 12 మంది ప్రయాణికులను అరెస్ట్‌ చేశారు. తనిఖీల్లో భాగంగా వారి నుంచి రూ.13.03 కోట్ల విలువైన 31.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అదనపు డైరెక్టర్‌ ప్రసాద్‌ తెలిపారు.

* చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో మూడు రాజధానులకు మద్దతుగా ఆదివారం సాయంత్రం వైకాపా సభ నిర్వహించింది. ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు రాష్ట్ర మంత్రులు కన్నబాబు, నారాయణస్వామి, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, సీఎం ముఖ్యసలహాదారు అజేయకల్లం, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ…‘‘ రాయలసీమ ప్రజలు తమకు నీళ్లిస్తే చాలు అంటున్నారు. అమరావతిలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేసే కంటే రాయలసీమకు నీళ్లివ్వడమే మా లక్ష్యం’’ అని స్పష్టం చేశారు.

* చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ఆదేశంపై అంతర్జాతీయంగా విద్వేషం పెరిగేలా చేస్తోంది. ఆ విష మహమ్మారి ఇతర దేశాలకూ వేగంగా వ్యాపిస్తుండటమే విద్వేషానికి కారణం. పలు దేశాల్లో చైనీయులకు వ్యతిరేకంగా వివక్ష జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఆ దేశస్థుల పర్యటనలు నిషేధించడం, వారిని రెస్టరెంట్లలోకి రానివ్వకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. చైనీయులు మాత్రమే కాకుండా పలు ఆసియా ప్రాంతాలకు చెందిన వారిపైనా ఈ ప్రభావం పడుతుండటం గమనార్హం.

* తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడిలో ఓఎన్జీసీ రిగ్‌ వద్ద పైప్‌లైన్‌ లీకైంది. భారీగా గ్యాస్‌ లీక్‌ అవుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యగా కిలోమీటరు పరిధిలోని ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. ఘటన జరిగిన ప్రదేశానికి 50 మీటర్ల దూరంలోనే కాట్రేనికోన మండల కేంద్రానికి వెళ్లే రహదారి ఉండటంతో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.