Editorials

నిర్భయ దోషులకు మరణదండన ఇప్పట్లో ఉండదేమో

No future tentative date for nirbhaya culprits hanging

నిర్భయ దోషుల మరణ శిక్ష విషయంలో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. హత్యాచారం కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై పటియాలా కోర్టు స్టే విధించడాన్ని సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై ఆదివారం విచారణ జరిగింది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్‌ సురేష్‌ ఖైత్‌ తెలిపారు. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ఉద్దేశపూర్వకంగానే దోషులు ఉరిశిక్ష అమలు ఆలస్యం చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. కావాలనే లెక్కలు వేసుకుని మరీ పిటిషన్లు వేస్తూ దేశం సహనాన్ని పరీక్షిస్తున్నారని పేర్కొన్నారు. నిర్భయపై ఆ నలుగురు అమానవీయంగా వ్యవహరించిన దారుణం యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని గుర్తు చేశారు. పవన్‌ గుప్తా అనే దోషి ఇప్పటివరకు క్యురేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్‌ పెట్టుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నాడని కోర్టుకు తెలిపారు. నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న అమలు కావాల్సిన ఈ ఉరిశిక్షపై పటియాలా న్యాయస్థానం స్టే విధించడాన్ని తీహాడ్‌ జైలు అధికారులు, కేంద్ర హోంశాఖ దిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఉరిశిక్ష అమలుపై విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు.