Agriculture

బొకేల రూపకల్పనలో మండపేట మహిళ సృజన

బొకేల రూపకల్పనలో మండపేట మహిళ సృజన-Mandapeta Lady VIjayalakshmi Makes Edible Bouquets

మండపేటకు చెందిన విజయలక్ష్మి భర్తతో కలిసి రోటరీ క్లబ్‌ సేవా కార్యక్రమాల్లో వికలాంగులకు వీల్‌ఛైర్లు, పేద విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు, దుస్తులు, బెల్టులు, షూలు పంపిణీ చేసేది. ఇలాంటి కార్యక్రమాల్లో నిర్వాహకులు పూలమాలలు, బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపేవారు. అవన్నీ వృథాగానే పోతున్నాయని గుర్తించిందామె. వీటికి బదులుగా కొత్తగా ఇంకేదైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో చాక్లెట్‌ బొకేల తయారీకి శ్రీకారం చుట్టింది. తన అభిరుచికి మెరుగులు దిద్దేందుకు యూట్యూబ్‌ని మాధ్యమంగా ఎంచుకుంది. ‘యూట్యూబ్‌లో చూస్తూ వివిధ రకాల చాక్లెట్‌ బొకేల తయారీపై పట్టు పెంచుకున్నా. ముడిసరకుగా నలుపు, తెలుపు చాక్లెట్లు, కేక్‌లు వాడుతున్నాం. వాటిలో చిరుధాన్యాలు, బాదం, పిస్తా, జీడిపప్పు, రాగులు, ఖర్జూరం, రైస్‌బాల్స్‌ వంటివి వేస్తూ ప్రయోగాలు చేశా. నా ఊహ మేరకు వాటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దా. మూడేళ్ల నుంచి ఏదైనా వేడుకకు వెళ్లినప్పుడు ఇవే ఇచ్చేదాన్ని. ఆకర్షణీయంగా ఉండటంతో తెలిసినవారు చేసివ్వమని అడిగేవారు. వీటికోసం సంప్రదించేవారు ఎక్కువ అవ్వడంతో పదిమంది మహిళలకు నేర్పించా. వారికి ఇప్పుడు ఇదో ఉపాధి మార్గంలా మారింది. కొన్నిసార్లు ఒకేరోజు 150 బొకేలు ఆర్డరు వచ్చేవి. బొకేలు రూ.100 నుంచి రూ.800 వరకు ఉంటాయి. చాక్లెట్లతో వచ్చిన ఆదాయంతో సొంతంగా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా’ అని వివరిస్తోంది విజయలక్ష్మి.