Sports

టొక్యో ఒలంపిక్స్ యథాతథం

Telugu Sports News-Tokyo Olympics To Go As Planned

ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కలవరపెడుతున్నప్పటికీ నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారమే ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ క్రీడలు జరుగుతాయని నిర్వాహకులు స్పష్టం చేశారు. టోక్యోలో ఇప్పటికే వైరస్‌ వ్యాపించకుండా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని, ముందనుకున్నట్లుగా మెగా ఈవెంట్‌ పోటీలు నిర్వహిస్తామని ఒలింపిక్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ తొషిరో ముటో తెలిపారు. పారాలింపిక్స్‌ సమీక్ష సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కరోనా వైరస్‌ వ్యాప్తి ఇక్కడ సాధారణ స్థితిలోనే ఉంది. నియంత్రణకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై అనవసరంగా ప్రజల్లో భయాందోళనలు పెంచొద్దు. ఈ భయాందోళనలు వైరస్‌ కంటే వేగంగా వ్యాపిస్తాయి. అయితే ఇక్కడ మాత్రం ఈ వైరస్‌తో ఒలింపిక్స్‌కు వచ్చిన ముప్పేమీ లేదు’ అని అన్నారు. జపాన్‌లో ఇప్పటివరకు కరోనాతో ఒక్కరు కూడా మృతి చెందలేదు. 45 మంది మాత్రం వైరస్‌ బారినపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 28 వేల మందికి ఈ వైరస్‌ సోకగా ఇప్పటివరకు 560 మంది మరణించారు. అయితే ఇందులో 90 శాతం మరణాలు, వైరస్‌ బారిన పడినవారంతా చైనాలోనే ఉన్నారు. ఇతర దేశాల్లో కేవలం 191 కేసులే నమోదయ్యాయి.