Agriculture

మేకపాల సబ్బులతో కళకళలాడుతున్న మహారాష్ట్ర మహిళలు

Telugu Agriculture News-Maharashtra Women Making History With Goat Milk Soaps

ఒకప్పుడు ఆ గ్రామాలు కరవు కోరల్లో… రైతుల ఆత్మహత్యలతో విలవిల్లాడేవి. ఇప్పుడు మేకల పెంపకంతో… సబ్బుల తయారీతో కళకళలాడుతున్నాయి. అందుకు కారణం వానలో పంటలో కాదు… మేకలు. వాటిపాలతో సబ్బులు తయారు చేస్తూ విదేశాలకు కూడా పంపుతూ పెద్దఎత్తున ఆదాయం పొందుతున్నారు అన్నదాతలు. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్‌వాడా ప్రాంతాలు కరవుకి పెట్టింది పేరు. వర్షాలు సరిగా పడకా, చెరువులు ఎండిపోయి… పంటపొలాలు బీళ్లుగా మారిపోయి కరవు రక్కసి కోరల్లో చిక్కుకున్న రైతులు ఆత్మహత్య బాట పడుతున్నారు. దాంతో పిల్లల్ని చదివించలేకా కుటుంబభారాన్ని మోయలేకా ఎందరో వితంతువులు అతికష్టమ్మీద బతుకుబండిని లాగుతున్నారు. కరవును అత్యధికంగా ఎదుర్కొంటున్న ఉస్మానాబాద్‌ జిల్లాలోని అలాంటి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాయి మేకలు. మేకలేంటీ… కష్టాలు తీర్చడం ఏంటీ… అనుకుంటున్నారు కదూ… ఉస్మానాబాద్‌ జాతి మేకలు మనదేశంలో చాలా ఫేమస్‌. కొవ్వు తక్కువ, ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఈ మేకలకు మహారాష్ట్రతోపాటు ఆంధ్రపదేశ్‌, తెలంగాణ, కర్ణాటకల్లో మంచి డిమాండ్‌ ఉంది. పైగా ఒక ఈతలో నాలుగైదు పిల్లలు పుడతాయి. రెండు నుంచి రెండున్నర లీటర్ల పాలిచ్చే సామర్థ్యం వీటి సొంతం. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ మేకల్ని ఉస్మానాబాద్‌లో రైతులు మాంసం కోసం పెంచుకుంటారు. కరవు నేపథ్యంలో వాటి పెంపకాన్ని కూడా పక్కన పెట్టారు రైతులు. ఈ విషయాలన్నీ తెలిసిన వినాయక్‌ హేగన వారి జీవితాల్లో మార్పు తేవాలనుకున్నాడు. అందుకు వారి సంప్రదాయ జాతి మేక పాలతోనే పరిష్కారం సూచించాలనుకున్నాడు. రైతు కుటుంబంలో పుట్టిన వినాయక్‌ హేగన కొల్హాపుర్‌లోని శివాజీ యూనివర్సిటీలో అగ్రికల్చర్‌ బీఎస్సీ చదువుకుని కొన్నాళ్ల పాటు ఉద్యోగం కూడా చేశాడు. కానీ రైతుల సమస్యల గురించి తెలిసి ఉద్యోగం వదిలేసి వాళ్ల జీవితాల్లో మార్పు తేవడానికి ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. విరాళాలు సేకరిస్తూ రైతుల సంక్షేమం కోసం అతను చేస్తున్న కృషి నచ్చి దాదాపు మూడు వేల మంది వలంటీర్లుగా చేరారు. వారంతా అన్నదాతల బాగుకు తమవంతుగా సహకారమందిస్తున్నారు. అందులో భాగంగా వినాయక్‌ ఉస్మానాబాద్‌ ప్రాంతం గురించి తెలిసి ఆ జిల్లాలో తీవ్రంగా కరవును ఎదుర్కొంటున్న, రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా నమోదైన ముప్ఫై గ్రామాల్ని గుర్తించి ఇంటికో మూడు మేకల్ని ఉచితంగా అందించాడు. దాంతోపాటు బ్యాంకులతో మాట్లాడి మేకల కొనుగోలుకు లోన్లు ఇప్పించి ఇంటికి ఓ ఐదారు మేకలు సమకూరాక రైతులకి సబ్బుల తయారీలో శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టాడు.

మేకపాలూ, వనమూలికలతో కలిపి చేసే సబ్బుల తయారీకి గ్రామానికో యూనిట్‌ ఏర్పాటు చేశాడు. అలా ఒక్కో గ్రామం నుంచి రోజుకి వెయ్యికిపైనే సబ్బులు తయారవుతున్నాయి. పాలను డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచి గడ్డ కట్టించి ఆ తరవాత పొడిగా మార్చి, కోల్డ్‌ ప్రెస్డ్‌ విధానంలో సబ్బులు తయారు చేస్తున్నారు. అందులో భాగంగా యాంటీబ్యాక్టీరియల్‌, మాయిశ్చరైజింగ్‌, యాంటీ రింకిల్‌, యాంటీ ఏజింగ్‌ సబ్బుల్ని ‘శివర్‌’ పేరుతో అందిస్తున్నారు రైతులు. వీటిని ‘శివర్‌ నేచురల్స్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా దేశవిదేశాల్లో అమ్ముతున్నాడు వినాయక్‌. అంతేనా, ఆదాయపు పన్నుల శాఖ కూడా ఈ సబ్బుల్ని ఎక్కువ మొత్తంలో కొంటే పన్ను మినహాయింపు ఇస్తోంది. అందుకే శివాజీ యూనివర్సిటీ సైన్సు విభాగంతోపాటు, పలు కార్పొరేట్‌ సంస్థలూ, ఫౌండేషన్లు కూడా రైతులకు సాయం అందిస్తూ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఊతమిస్తున్నాయి. ప్రముఖ ఇండియన్‌ క్రికెటర్‌, బ్యాట్స్‌మెన్‌ అజింక్యా రహనే కూడా ఈ మేక పాల సబ్బుల్ని ప్రోత్సహిస్తూ బ్రాండ్‌ అంబాసిడర్‌లా మారి వాటికి ప్రచారం చేస్తున్నాడు. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కూ మేకపాల సబ్బుల్ని పరిచయం చేశాడు. అప్పట్నుంచీ కొహ్లీ బృందం కూడా ఈ గ్రామస్తులకు సాయమందిస్తోంది. ఇప్పుడు ఆ గ్రామాల్లో వర్షాలు పడకపోయినా రైతులు వలస బాట పట్టకుండా సొంతూళ్లోనే ఉపాధి పొందుతున్నారు. వచ్చిన లాభంతో ఇంకొన్ని మేకలు కొంటూ సంపాదన పెంచుకుంటున్నారు. మేకలు మాంసానికే కాదు… మార్పుకీ నాంది పలుకుతాయని నిరూపించారు కదా ఉస్మానాబాదీ రైతులు!