NRI-NRT

స్వచ్ఛ భారత్‌కు రూపాయి కూడా ఇవ్వని ప్రవాసులు

Smart NRIs-Did not give a penny to svaccha bharat

ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌కు దేశంలో లభించిన క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దేశ ప్రధాని నుంచి సామాన్యుడి దాకా అంతా భాగస్వాములు కావడంతో ఈ పథకం దేశంలో మంచి ఫలితాలనిచ్చింది. ఈ పథకానికి కొనసాగింపుగా స్వచ్ఛభారత్‌ 2.0కు కూడా ఇటీవలి బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించింది. అయితే, భారత్‌లో ఎంతో క్రేజ్‌ సంపాదించిన ఈ పథకం ప్రవాస భారతీయులను మెప్పించడంలో.. వారి నుంచి నిధులు ఆకర్షించడంలో మాత్రం విఫలమైంది.విదేశీ నిధులపై కేంద్రం రాయితీలు ప్రకటించినప్పటికీ చాలా పరిమితంగా మాత్రమే నిధులు సమకూరడమే ఇందుకు నిదర్శనం. నిధుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్‌ నిధికి గత ఐదేళ్లలో రూ.777 కోట్లు సమకూరినప్పటికీ.. విదేశాల నుంచి మాత్రం కేవలం 13.79 లక్షలు మాత్రమే వచ్చినట్టు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ మీడియా సంస్థ ఆర్‌టీఐ కింద అడిగిన ప్రశ్నకు సంబంధిత శాఖ వివరాలను వెల్లడించింది. ప్రవాస భారతీయుల నుంచి స్వచ్ఛ భారత్‌ నిధికి వచ్చిన నిధుల వివరాలను పరిశీలిస్తే.. 2015 -2017, 2019-20లలో సున్నా నిధులు రాగా.. 2017-18లో రూ.3.79 లక్షలు, 2018-19లో రూ.10లక్షలు వచ్చాయని కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ పరిధిలోని విభాగం వెల్లడించింది. డిసెంబర్‌ 17, 2019 నాటికి స్వచ్ఛ భారత్‌ నిధిలో రూ.158.29 కోట్లు ఉన్నట్టు తెలిపింది. ప్రవాస భారతీయుల నుంచి స్వచ్ఛభారత్‌ ఫండ్‌కు నిధులు సమకూర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ప్రకటించినా అంతగా నిధులు రాకపోవడం గమనార్హం.