Devotional

మార్చి 9న తిరుపతమ్మ చిన్నతిరునాళ్లు

Penuganchiprolu Tirunallu 2020 - Telugu Devotional News

*పెనుగంచిప్రోలులో ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహణ
తిరుపతమ్మ అమ్మవారి వార్షిక జాతరలో ప్రధానమైన చిన్న తిరునాళ్లు వచ్చే నెల తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దఎత్తున తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలిరానున్నారు. ఐదు రోజుల్లో సుమారు ఏడు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోనున్నారని అధికారుల అంచనా. సుమారు రూ.20 లక్షల వ్యయంతో విస్తృత స్థాయిలో మౌలిక వసతులు కల్పించనున్నారు.
*ఇవీ ఏర్పాట్లు.. మునేరులో నాలుగు చోట్ల జల్లు స్నానాలు, పలు ప్రాంతాల్లో చేతిపంపులు, శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల వసతి కోసం పలు ప్రాంతాల్లో షామియానాలు ఏర్పాటు చేయనున్నారు.
***కార్యక్రమాలు ఇలా..
*9న అఖండజ్యోతి స్థాపన
ఉదయం 6 గంటలకు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం అఖండజ్యోతి స్థాపన చేయడం ద్వారా తిరునాళ్లు అధికారికంగా ప్రారంభమవుతాయి.
*10న సామూహిక కుంకుమార్చన
ఆలయంలో నిర్వహించనున్న సామూహిక కుంకుమార్చనలో పెద్దఎత్తున మహిళలు పాల్గొంటారు. దేవస్థానం ఉచితంగా పూజా సామగ్రి అందజేస్తుంది.
*11న రథోత్సవం
తిరుపతమ్మ, గోపయ్య స్వాముల ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపై ఉంచి గ్రామంలో ఊరేగిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు మొదలై అర్ధరాత్రి దాటే వరకు ప్రధాన వీదుల్లో గ్రామోత్సవం సాగుతుంది. భక్తులు ఎదురుగా వెళ్లి అమ్మవారికి పూజలు చేస్తారు.
*12న పుట్టింటి పసుపు కుంకుమ బండ్ల ఉత్సవం
అమ్మవారి తిరునాళ్లలోనే అత్యంత ప్రధానమైన ఘట్టం పుటింటి పసుపుకుంకుమ బండ్ల ఉత్సవం. అమ్మవారి పుట్టింటి వంశీయులు కొల్లా శ్రీనివాసరావు ఇంటి నుంచి ఏటా పసుపు కుంకుమను ఆలయానికి తీసుకురావడం ఆనవాయితీ. దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేకమైన విద్యుద్దీపాలతో తయారు చేసిన బండిపై పసుపు కుంకుమలను తీసుకువస్తుండగా గ్రామానికి చెందిన వారు వందల బండ్లతో పసుపు కుంకుమ బండిని ఆలయం వరకు అనుసరిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు అనిగండ్లపాడు, పెనుగంచిప్రోలు గ్రామాలకు లక్షల మంది భక్తులు తరలివస్తారు.
*13న దివ్య ప్రభోత్సవం
రాత్రి ఎనిమిది గంటలకు వేడుక జరుగుతుంది. ఆలయంలో ఉన్న 90 అడుగుల ఇనుపప్రభను విద్యుద్దీపాలతో అలంకరించి ప్రభపై తిరుపతమ్మ, గోపయ్య స్వాముల ఉత్సవ విగ్రహాలను ఉంచుతారు. గ్రామానికి చెందిన రైతులు ఎద్దులతో ప్రభను ఆలయం చుట్టూ ప్రదక్షిణగా ముందుకు లాగిస్తుంటారు. రైతులు తమ ఎద్దులతో ప్రభను ముందుకు లాగించేందుకు పోటీ పడతారు.