Editorials

ఏపీని షేక్ చేస్తున్న ఏసీబీ దాడులు

ACB Raids On Andhra Govt Institutions Is Causing Sensation

హడలెత్తిస్తున్న ఏసీబీ రైడ్స్ … రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో సోదాలు..రీజన్ ఇదే !!

ఏపీలో ఇప్పుడు ఏసీబీ అధికారుల వరుస దాడులు దడ పుట్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఎమ్మార్వో ఆఫీసులను ఆ తర్వాత మున్సిపల్ కార్యాలయాలను, టౌన్ ప్లానింగ్ ఆఫీసులను టార్గెట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు చేసిన ఏసీబీ అధికారులు ఇప్పుడు ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రులపై దాడులు నిర్వహిస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాలలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులపై దాడులు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులపై ఏసీబీ అధికారుల దాడులు

అవినీతి అధికారులకు ఏసీబీ చెమటలు పట్టిస్తుంది ఏపీలో ప్రతి శాఖలోనూ పారదర్శకంగా పనులు జరగాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆదేశించిన నేపధ్యంలోనే ఏసీబీ అధికారులు వరుస దాడులను కొనసాగిస్తున్నారు. మందుల కొనుగోలులో చేతివాటం కొనసాగినట్టు తెలుస్తుంది. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో జరిగిన మోసాల నేపధ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

మందులు , వైద్య పరికరాల కొనుగోళ్ళపై తనిఖీలు

మందుల కొనుగోళ్ళు, వైద్య పరికరాల కొనుగోళ్ళు , వైద్యాధికారుల హాజరు, గైర్హాజరుకు సంబంధించి సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రైవేట్ క్లినిక్ లను ఏర్పాటు చేసుకున్న వైద్యులు చాలా మంది ప్రభుత్వ ఆస్పత్రులకు గైర్హాజరు అవుతున్నట్టు గుర్తించినట్టు సమాచారం . ఇక అవుట్ పేషెంట్ , ఇన్ పేషంట్ రిజిస్టర్ లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం . ప్రధానంగా మందుల కొనుగోళ్ళు, నాశిరకం మందుల కొనుగోలు చేసి పెట్టిన బిల్లులపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

100 మంది ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు

దాదాపు 100 మంది ఏసీబీ అధికారులు ఏకకాలంలో అన్ని జిల్లాలలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక విశాఖపట్నం , గుంటూరు, విజయనగరం, నెల్లూరు, అనంతపురం, తూర్పు గోదావరి, కడపతో పాటు అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అధికారులు కీలకమైన అనేక అంశాలను గుర్తించారు.

ఈఎస్ఐ ఆస్పత్రుల్లో మందుల కొనుగోళ్లలో భారీ స్కామ్ నేపధ్యంలో సోదాలు

ఒక పక్క వైసీపీ సర్కార్ ఆరోగ్య శాఖను ప్రక్షాళన చెయ్యాలని భావిస్తున్న తరుణంలో జరుగుతున్న ఏసీబీ దాడులు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు నిర్వర్తించకుండా ప్రైవేట్ వైద్య శాలలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా వున్నట్టు తెలుస్తుంది. ఇక ఈఎస్ఐ ఆస్పత్రుల కుంభకోణం తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మందుల కొనుగోళ్లలో భారీ గోల్ మాల్ జరిగిందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.