Movies

కథ బలహీనమవుతుందని బాలయ్యని తీసుకోలేదు

Koratala Siva Speaks Of Balakrishna Role In Janatha Garage

‘జనతా గ్యారేజ్‌ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును’ అంటూ ఓ వైపు పాడైన వాహనాలను, మరోవైపు అన్యాయం చేసే వ్యక్తుల్ని దారిలో పెట్టాడు ఎన్టీఆర్‌. టైటిల్‌తోనే అందరిలో ఆసక్తి పెంచిన ‘జనతా గ్యారేజ్‌’ చిత్రం 2016లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రకృతి ప్రేమికుడుగా ఆనంద్‌ పాత్రలో ఒదిగిపోయాడు తారక్‌. తనలో దాగి ఉన్న స్టైలిష్‌ నటుడ్ని కొత్తగా ఆవిష్కరించాడు. ఇందులో తారక్‌ చెప్పిన డైలాగ్స్, వేసిన స్టెప్పులు అభిమానులను విశేషంగా అలరించాయి. ఈ చిత్రంలో ఇదే స్థాయిలో మెప్పించిన మరో నటుడు మోహన్‌లాల్‌. మెకానిక్‌ సత్యం పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇలాంటి పాత్రలో బాలకృష్ణ నటిస్తే ఎలా ఉంటుంది? పైగా తారక్‌ చిత్రంలో. అభిమానులకు అంతకన్నా కావాల్సింది ఏముంది? ఈ విషయమే అప్పట్లో బాగా చర్చ జరిగింది. ఎన్టీఆర్, కొరటాల చిత్రంలో బాలయ్య నటిస్తారంటూ వార్తలొచ్చాయి. మరి ‘జనతా గ్యారేజ్‌’లో మెకానిక్‌ సత్యం పాత్రకు బాలకృష్ణను ఎందుకు తీసుకోలేదని కొరటాల శివను అడిగితే ఆయన ఏం చెప్పారో తెలుసా? ‘‘తారక్, బాలయ్య కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ కాంబినేషన్‌లో చిత్రం అంటే వాళ్లిద్దరి మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయా? అని ఎదురు చూస్తారు తప్ప కథని పట్టించుకోరు. ఇది కథా బలం ఉన్న సినిమా. అయినా ఇది అభిమానుల కల. దానికి సమయం ఇది కాదు. అంతేకాదు ఆ పాత్రకు బాలయ్య అంతగా సెట్‌ అవ్వరు. భవిష్యత్తులో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రావచ్చేమో. చెప్పలేం’’అని చెప్పుకొచ్చారు. మరి బాలయ్య-తారక్‌లు కలిసి భవిష్యత్‌లోనటిస్తారేమో చూడాలి.