DailyDose

34 నుండి 45కు పెరిగిన భారత కొరోనా బాధితులు-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Total Corona Patiens Count Rises To 45 In India

* ప్రపంచాన్ని కలవరపెడుతున్న ప్రాణాంతక మహమ్మారి కరోనా (కొవిడ్‌ 19) కేసులు భారత్‌లో రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మరో రెండు కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఒకరు అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన బెంగళూరు వాసి కాగా.. మరొకరు ఇటలీ నుంచి తిరిగొచ్చిన పంజాబ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వీరిద్దరికీ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 45కు చేరింది. అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలినట్టు కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ వెల్లడించారు. వైరస్‌ సోకిన వ్యక్తిని ఆయన కుటుంబాన్ని బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఛాతి వైద్యశాలలో ఐసోలేషన్‌ వార్డులో ఉంచినట్లు చెప్పారు. బాధితుడు మొదట అమెరికాలోని ఆస్టిన్‌ నగరానికి ప్రయాణించి అక్కడి నుంచి న్యూయార్క్‌, దుబాయ్‌ మీదుగా భారత్‌ చేరుకున్నట్లు సమాచారం. ఇక రెండో కేసు పంజాబ్‌లో నమోదైంది. పంజాబ్‌ రాష్ట్రంలో తొలిసారి నమోదైన కరోనా కేసు ఇదే. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు పంజాబ్‌ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇటలీలో కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటివరకు 366 మంది మరణించగా.. 7వేల మందికి పైగా ఈ మహమ్మారి బారినపడి చికిత్సపొందుతున్నారు.

* స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజుల పాటు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ప్రకటించారు. ఈనెల 12 నుంచి 29 వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు తెలిపారు. ఆయా రోజుల్లో దుకాణాలకు మద్యం సరఫరాను నిలిపివేస్తున్నట్లు అనిల్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటర్లపై డబ్బు, మద్యం ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

* యెస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్‌తో పాటు మరో ఆరుగురు నిందితులపై సీబీఐ(కేంద్ర దర్యాప్తు సంస్థ) లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసింది. రూ.4,300కోట్ల లావాదేవీల విషయంలో రానాకపూర్‌ అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచారణ నిమిత్తం ఇప్పటికే ఆయనను అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ముంబయిలోని కోర్టులో హాజరుపర్చారు. కాగా.. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 11 వరకు రిమాండ్‌ విధించింది.

* ఇటీవల 10 మంది ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో వేడెక్కిన మధ్యప్రదేశ్‌ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు కనపడకుండా పోయారు. అనంతరం బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు. ఈ ఎమ్మెల్యేలంతా బెంగళూరు సమీపంలోని ఓ రిసార్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 17 మంది కాంగ్రెస్‌ ముఖ్య నేత, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులని సమాచారం. ప్రస్తుతం సింధియా ఫోన్‌ స్విచాఫ్‌ వస్తున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. అదృశ్యమైన వారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారనీ.. వీరంతా చార్టర్‌ విమానంలో బెంగళూరుకు చేరుకున్నట్టు సమాచారం.

* భారత్‌ చేతి చమురు వదులుతోంది.. చమురు రేట్లు పెరిగిన ప్రతిసారీ ఈ మాటలు మనకు వినపడుతుంటాయి. కానీ, చమురు ఉత్పత్తిదారుల మధ్య నెలకొన్న పోటీలో భారత్‌ లబ్ధిదారుగా నిలిచే అవకాశం లభించింది. వాణిజ్యలోటును తగ్గించుకొనే సువర్ణావకాశం దక్కింది. చమురు ధర పెరిగితే భారత్‌ నష్టపోతుంది.. ధర తగ్గితే లాభపడుతుంది.. అసలే మందగమనంలో ఉన్న సమయంలో దేశంలో వాణిజ్యలోటు పెరగకుండా జాగ్రత్త పడాలి.. ఈ నేపథ్యంలో భారత్‌కు అనుకోని వరంలా అంతర్జాతీయ పరిణమాలు చోటు చేసుకొన్నాయి. ఒపెక్‌+రష్యా మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఫలితంగా బ్రెంట్‌ చమురు ధర బ్యారెల్‌కు 33 డాలర్లకు తగ్గడం కలిసొచ్చే అంశంగా మారింది. ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌ (ఒపెక్‌) ఆధ్వర్యంలో పెట్రోల్‌ ఉత్పత్తి చేసే దేశాలు ఒక సంఘంగా ఏర్పడి చమురు ఉత్పత్తి పెంచాలా..? తగ్గించాలా..? అనే విషయాన్ని నిర్ణయిస్తాయి. చమురు డిమాండ్‌ తగ్గగానే ఉత్పత్తిని కూడా తగ్గించి ధరను కాపాడుకొంటాయి..! ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారుడైన భారత్‌కు డిమాండ్‌ సూత్రం ప్రకారం ప్రయోజనం లభించాలి. కానీ, ఒపెక్‌ కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ధర నిలకడగా ఉండి.. అదే స్థాయిలో ధర చెల్లించాల్సి వస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే మన మార్కెట్లలో వ్యాపారులంతా సిండికేటై ధరను ఎలా నియంత్రిస్తారో.. ఒపెక్‌ కూడా అలానే చేస్తుంది.

* ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను చట్టబద్ధంగా అమలు చేయించుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు సూచించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సీఎం జగన్‌ కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీతో పాటు సీఎం జగన్‌కు కేవీపీ లేఖలు రాశారు. పారిశ్రామిక పన్ను రాయితీలు, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ, కేంద్రప్రభుత్వ పథకాలకు 90 శాతం నిధులు ఇవ్వాలని మోదీకి రాసిన లేఖలో కోరారు. విభజన చట్టం అమలుపై రాజ్యసభలో మరోసారి ప్రైవేటు మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టానని.. కానీ దురదృష్టవశాత్తు అది చర్చకు రాలేదన్నారు.

* రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఓటర్లను ప్రభావితం చేసే అన్నింటినీ తొలగించడం ఆనవాయితీ అని.. ఇప్పటి వరకు ఎక్కడా ఆ ప్రక్రియ చేపట్టలేదని ఆయన విమర్శించారు. ఇష్టారీతిన రిజర్వేషన్లు, సరిహద్దులు మారుస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు అడిగినంత మాత్రాన రిజర్వేషన్లు మార్చేస్తారా? అని ప్రశ్నించారు.