Food

మామిడి ఫలూదా తయారీ ఇలా

How To Make Mango Faluda-Telugu Summer Recipes

కావల్సినవి: సబ్జా గింజలు – రెండు చెంచాలు, మొక్కజొన్న పిండి – పావుకప్పు, చల్లటి పాలు – కప్పు, మామిడిపండు గుజ్జు – కప్పు, ఐస్‌క్రీమ్‌ – కప్పు, టూటీఫ్రూటీ – కొన్ని, బాదం, కాజు, కిస్‌మిస్‌ – అలంకరణకు సరిపడా.

తయారీ: మొదట గిన్నెలో సబ్జా గింజలను నానబెట్టుకోవాలి. మరొక గిన్నెలో కాసిని నీళ్లు తీసుకుని మొక్కజొన్నపిండి వేస్తూ బాగా పల్చగా తయారు చేసుకోవాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి ఒకటిన్నర కప్పు నీళ్లు పోయాలి. అవి మరుగుతున్నప్పుడు తయారుచేసిపెట్టుకున్న మొక్కజొన్నపిండి మిశ్రమాన్ని అందులో పోస్తూ చిన్న మంటపై ఉడికించాలి. ఇది చిక్కగా అయ్యే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని చల్లార్చి మురుకుల పీటలోకి తీసుకోవాలి. ఒక గిన్నెలో ఐస్‌ ముక్కలు తీసుకుని వాటిపై మురుకుల్లా ఒత్తుకోవాలి. సన్నగా, నూడుల్స్‌లా వస్తాయి. ఇప్పుడు ఒక గ్లాసు తీసుకుని కాసిని సబ్జా గింజలు వేయాలి. ఆ తరువాత మొక్కజొన్న నూడుల్స్‌ కొద్దిగా వేసుకోవాలి. వీటిపై రెండు చెంచాల మామిడిపండు గుజ్జు వేయాలి. ఇందులో చల్లటిపాలు పోసి కొద్దిగా ఐస్‌క్రీమ్‌ వేయాలి. చివర్లో సబ్జాగింజలు, మామిడిపండు ముక్కలు, బాదం, కిస్‌మిస్‌, టూటీ ఫ్రూటీలతో అలంకరించి పైన మిగిలిన ఐస్‌క్రీమ్‌ వేయాలి. మండే ఎండల్లో పోషకాలు అందించే చల్లని, తియ్యని మ్యాంగో ఫాలుదాను మీరూ ప్రయత్నించండి.