NRI-NRT

కొరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న జర్మన్ సంస్థకు ట్రంప్ ఎర

Trump Tried To Lure German Company CureVac To Sell Corona Vaccine To USA

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనలోని వ్యాపారవేత్తను మరోసారి బయటకి తీశారు. జర్మనీకి చెందిన క్యూర్‌వ్యాక్(Curevac) సంస్థ ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేసే పరిశోధనల్లో ఉంది. ఈ సంస్థ సీఈఓ డేనియెల్ మెనిన్‌కెల్లా గతవారం డీసీలో జరిగిన ఫార్మా సంస్థ సమావేశంలో ట్రంప్‌ను, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌లను కలుసుకున్నారు. ఈ సమావేశంలో డేనియెల్ తమ సంస్థ కొరోనా వ్యాక్సిన్‌ను ఈ ఏడాది వేసవి తొలిభాగంలో మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆ దిశగా విజయాన్ని సాధించామని వివరించారు. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ ఆ వ్యాక్సిన్‌ను కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం చేయాలని, దానికి బదులుగా అధిక మొత్తాన్ని ఎరగా వేసినట్లు జర్మన్ పత్రికలు పేర్కొన్నారు. కాగా ఈ విషయం బయటకి రాగానే సీఈఓ డేనియల్‌ను విధుల నుండి బహిష్కరించారు. జర్మన్ ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్ మాట్లాడుతూ జర్మనీ ట్రంప్ లాంటి సంకుచితమైనది కాదని, తమ దేశానికి చెందిన సంస్థ రూపొందించే వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంచుతామని కేవలం ఒక దేశానికి మాత్రమే దాన్ని పరిమితం చేయబోమని స్పష్టం చేశారు. క్యూర్‌వ్యాక్ సంస్థలో SAP వ్యవస్థాపకుడు డైట్మర్ హోప్, బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్లతో పాటు జర్మన్ ప్రభుత్వం కూడా నిధులను పెట్టుబడిగా పెట్టింది.