Food

హైదరాబాద్ నీరు సురక్షితమేనా?

హైదరాబాద్ నీరు సురక్షితమేనా?

కరోనా వైరస్ నేపథ్యంలో జలమండలి జాగ్రత్త చర్యలు ముమ్మరం చేసింది. లాక్‌డౌన్ కారణంగా సేవల్లో ఎక్కడ అవాంతరాలు ఎదురవకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అయితే అత్యవసర సేవల్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సమృద్దిగా తాగునీరందించడంతో పాటు మురుగునీటి సమస్య లేకుండా చేయడంపై సిబ్బంది, అధికారులు దృష్టి సారించారు. ఖైరతాబాద్‌లోని మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన కార్యాలయంతోపాటు డివిజన్ కార్యాలయాల చుట్టూ ద్రావణం పిచికారీ చేస్తున్నారు.
జలమండలి ప్రతి డివిజన్ పరిధిలో రెండు బృందాలు ఈ కెమికల్ స్ప్రే చేస్తారు. అలాగే పారిశుద్ధ్య పనులు చేపట్టిన చోట తప్పనిసరిగా ఈ కెమికల్ జల్లుతారు. ప్రతి ఎయిర్ టెక్ యంత్రంతో పాటు ఒకరు కెమికల్ పిచికారీ చేయడానికి అందుబాటులో ఉంటారు. ఈ సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేసే సిబ్బందికి ఆరోగ్యం దృష్ట్యా రక్షణ కవచాలు అందుబాటులో ఉంచారు. రిజర్వాయర్ గోడలతో పాటు కార్యాలయల గదులు, రెయిలింగ్, మూత్రశాలలు, వాహనాలు, క్యాష్ కౌంటర్లపైన కెమికల్ జల్లడం ద్వారా క్రిమికీటకాలను నిర్మూలించనున్నారు. నెలకు గాను 7వేల లీటర్ల హైపోక్లోరైడ్‌ని సిద్దం చేశారు. ఇందులో 5వేల లీటర్లు సివర్ క్లీనింగ్ మిషిన్లకు, 2వేల లీటర్లు కార్యాలయాలకు కేటాయించనున్నారు. వీటితో పాటు కార్యాలయాల ప్రాంగణంలో శానిటైజర్లు అందుబాటులోకి ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇక క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, లైన్మెన్లు, సివరేజ్ సిబ్బంది, ఎయిర్టెక్ మిషన్ సిబ్బంది, ట్యాంకర్ సిబ్బంది అందరికి తాత్కాలిక పాసులు, వ్యక్తిగత పాసులు, వెహికల్ పాసులు అందజేసి సేవల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కార్మికులు, అధికారులకు మాస్కులు, గ్లౌజులు వంటి భద్రత పరికరాలను అందజేయనున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మూడొంతుల నీటిలో ఒక వంతు సోడియం హైపోక్లోరైడ్ కలిపి జల్లుతున్నారు. ఇది క్రిమిసంహారక గుణం కలిగి ఉంటుందని, ఉపరితలంపై 12 నుంచి 14 గంటల వరకు ప్రభావం చూపుతుందని, ఎటువంటి బ్యాక్టీరియానైనా నిర్మూలిస్తుందని అధికారులు తెలిపారు. ఇది ఎంతో సురక్షితమైనదని, క్రిమిసంహారణ కోసం క్లోరిన్ వాయువులా ప్రభావంతంగా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే నగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ వైరస్ ప్రబలకుండా ప్రత్యేకమైన కెమికల్ స్ప్రే చేసేందుకు జలమండలి పరిధిలోని 20 ఎయిర్ టెక్ యంత్రాలను జీహెచ్ఎంసీ డిజార్డర్ రీలీఫ్ మేనేజ్ మెంట్ విభాగానికి అందించనుంది.