Agriculture

మామిడిలో పిందె రాలుడు అరికట్టడం ఎలా?

Telugu Agricultural News - April 2020 - Safeguarding Young Mango During Summer

వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. పగలు-రాత్రి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. మామిడి దిగుబడిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా పిందెలు రాలిపోయి కాపు పలుచనవుతోంది. మామిడిలో పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలు..

* ప్రస్తుతం మామిడి పిందెలు గోళీ పరిమాణం నుంచి నిమ్మకాయ పరిమాణంలో ఉన్నాయి. ఇంకా ఏవైనా మామిడి రకాల్లో పూత వస్తున్నట్లయితే.. ఇప్పుడున్న ఎండలకు ఆ పూత పిందెగా మారదు. ఈ సంవత్సరం తోతాపురి, నీలం, అల్ఫాన్సో (ఖాదర్‌), లాల్‌బాహార్‌, రుమాని, చెరకు రసాలు, ఇతర రకాల్లో పూత వచ్చి పిందెలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా బేనిషాన్‌ రకం చెట్లలో ఈసారి కూడా పూర్తి స్థాయిలో పూత రాలేదు. ఈ తోటల్లో వచ్చిన పిందెలను రాలిపోకుండా కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై రైతులు దృష్టి సారించాలి. పెరుగుతున్న ఎండల వల్ల చెట్లు బెట్టకు గురికాకుండా ఉండేందుకు వెంటనే నీరు పారించాలి. సమృద్ధిగా నీరున్న చోట.. వారం, పది రోజుల వ్యవధిలో నీటి తడులివ్వాలి. బిందుసేద్యం పద్ధతిలో నీరందించే రైతులు.. ప్రతి రోజు చెట్టుకు 60 లీటర్ల నీరు పారించాలి.

* నీరు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. పచ్చి ఆకులు, ఎండుకొమ్మలు లేదా పచ్చిరొట్ట పైర్లను పాదంతా 4-5 అంగుళాల మందంగా పరచాలి. ఇలా చేయడం వల్ల పాదులకు నీరు పారించినప్పుడు, ఆవిరి రూపంలో నష్టం జరగదు. ఎక్కువ రోజులు నేలలో తేమ నిలుస్తుంది. క్రమేణా పచ్చి ఆకులు కుళ్లిపోయి ఎరువుగా మారి పాదుల్లో సేంద్రియ పదార్థం పెరుగుతుంది. ఫలితంగా పోషకాలు మొక్కలకు బాగా అందుబాటులోకి వస్తాయి.

* పిందె దశలో పిందెలపై ప్రధానంగా తామర పురుగులు ఆశించి గోకి రసం పీల్చడంతో ‘గార’ ఏర్పడుతుంది. ఎక్కువైనప్పుడు ఇదే ‘రాతి మంగు’గా వృద్ధి చెంది కాయలుగా వృద్ధి చెందక ముందే రాలిపోతాయి. పెరిగిన కాయల్లో నాణ్యత తగ్గుతుంది. ఈ కాయలకు మార్కెట్లో ధర లభించదు.

* ప్రస్తుతం ఎండలు పెరిగినందువల్ల తేనెమంచు పురుగుల ప్రభావం తగ్గుతుంది. ఈ సమయంలో తామర పురుగుల బెడద పెరిగే అవకాశం ఉంది. పక్షి కన్ను తెగులు కూడా ఆశించి కాయలపై నల్లని మచ్చలు ఏర్పడుతాయి. ప్రస్తుత దశలో పిందెలు రాలకుండా, తామర పురుగులు, పక్షి కన్ను తెగులు నివారణకు.. లీటరు నీటికి 2 మి.లీ. పిఫ్రోనిల్‌ + 2 మి.లీ. వేపనూనె (1000-1700 పీపీఎం) లేదా 1.25 గ్రా. ఎసిఫేట్‌ + 0.5 మి.లీ. డైక్లోరోవాస్‌ లేదా 10 లీటర్ల నీటికి.. థయోమిథాక్సాం 3 గ్రా. + డైక్లోరోవాస్‌ 5 మి.లీ. మందుతోపాటు 2.5 మి.లీ. ప్లానోఫిక్స్‌ కలిపి పిచికారి చేయాలి.

* పిందెలు రాలకుండా ఉండేందుకు, కాయలు బాగా పెరిగేందుకు.. కాయలు నిమ్మకాయల సైజులో ఉన్నప్పుడు పదేళ్ల వయసున్న ఒక్కో చెట్టుకు కిలో యూరియా, ముప్పావు కిలో మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌లను కాండం నుంచి నాలుగు అడుగుల దూరంలో 5-10 సెం.మీ. లోతు గాడి తీసి అందులో వేసి మట్టితో కప్పాలి. అనంతరం నీరు పారించాలి.

* బిందుసేద్య విధానం అందుబాటులో ఉంటే.. ఎరువులు వేసి మట్టి కప్పిన గాడిపై డ్రిప్పర్లు ఉండేలా లేటరల్‌ పైపులు అమర్చాలి.

* ఎండ తీవ్రత పెరిగేకొద్దీ చెట్లపై పడమర దిశలో ఉన్న కాయలపై తెల్లని లేదా గోధుమ రంగులో ‘ఎండ బొబ్బలు’ ఏర్పడుతాయి. దీంతో కాయలు ఆకారం, నాణ్యత కోల్పోతాయి. మార్కెట్లో ఈ కాయలు ధర పలకవు. ఈ సమస్య నివారణకు లీటరు నీటికి 20 గ్రాములు చొప్పున పొడి సున్నం కలిపిన ద్రావణాన్ని మామిడి పిందెలు నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు పిచికారి చేయాలి. 20 రోజుల తర్వాత మరోసారి పిచికారి చేయాలి.