WorldWonders

సైకిల్ తొక్కి భార్య క్యాన్సర్‌ను ఓడించాడు

Old Man Cycles 130 KMs To Save His Wife From Cancer

తమిళనాడులోని తంజావూర్‌ జిల్లా కుంభకోణానికి చెందిన అరివళగన్‌ భార్య మంజుల క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించే స్థోమత లేకపోవడం, కుంభకోణం పరిసరాల్లో క్యాన్సర్‌కు వైద్యం అందించే స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులు లేకపోవడంతో పుదుచ్చేరిలోని జిప్మర్‌ ఆస్పత్రికి వెళ్లాలని అరివళగన్‌ నిర్ణయించారు. లాక్‌డౌన్‌ కారణంగా రవాణా సౌకర్యం లేకపోవడంతో తన పాత సైకిల్‌పై ఆమెను కూర్చోబెట్టుకుని సాయంత్రం 5 గంటల సమయంలో బయలుదేరాడు. మాయవరం, సీర్గాళి, చిదంబరం, కడలూర్‌ మీదుగా 130 కిలోమీటర్లు ప్రయాణించిన ఆయన మరుసటి రోజు ఉదయం పుదుచ్చేరిలోని ఆస్పత్రికి చేరుకున్నారు. అత్యవసర కేసులు మాత్రమే చూస్తుండటంతో మొదట వైద్యం చేయడానికి జిప్మర్‌ వైద్యులు నిరాకరించారు. ఆమెను సైకిల్‌పై ఇంతదూరం తీసుకువచ్చిన విషయం చెప్పడంతో వైద్యులు మనసు మార్చుకొని రెండు రోజులపాటు వైద్యం అందించారు. ఆ దంపతులకు అవసరమైన సహాయాన్ని వైద్య సిబ్బంది సొంత ఖర్చుతో సమకూర్చారు. అనంతరం ఆమెను అంబులెన్స్‌లో స్వస్థలానికి పంపారు.