DailyDose

భారతంలో భయంకరంగా బయటపడుతున్న కరోనా కేసులు-తాజావార్తలు

Indian COVID19 Positive Cases On High Rise-Telugu Breaking News

* బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ తెలుగు సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు. 12 వేల కరోనా రిలీఫ్‌ కూపన్లను ఏర్పాటు చేశారు. వీటిని అవసరాల్లో ఉన్న సినీ కార్మికులకు పంపిణీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ అధ్యక్షుడు, కథానాయకుడు చిరంజీవి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. అమితాబ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

* కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ పాటిస్తుండడంతో లక్షలాది మంది అభాగ్యులు ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటివారి ఆకలితీరుస్తూ మానవత్వం చాటుకుంటోంది అమెరికాకు చెందిన ‘యునైటెడ్‌ సిక్కుల’ స్వచ్ఛంద సంస్థ. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 10లక్షల మందికి పైగా భోజనాలు అందజేసినట్లు గురువారం ఆ సంస్థ వెల్లడించింది. అమెరికా, భారత్‌, యూకే, మలేసియా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో ఎంతో మందికి ఆకలి తీరుస్తున్నామని చెప్పింది. అలాగే అమెరికాలో.. కాలిఫోర్నియా, వాషింగ్టన్‌, ఉటాహ్‌, మేరీల్యాండ్‌, న్యూయార్క్‌ రాష్ట్రాల్లోనూ తమ సంస్థ ఆహారం అందజేస్తోందని పేర్కొంది.

* కరోనా వైరస్‌ బారినపడ్డ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ త్వరగా కోలుకోవాలని అమెరికా ప్రథమ పౌరురాలు, డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ ఆకాంక్షించారు. బోరిన్‌ జాన్సన్‌ భార్య గర్భవతి కావడంతో ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన మెలానియా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. ప్రధాని దంపతులు సాధ్యమైనంత తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

* తెలుగు సినీ కార్మికుల సహాయార్థం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా సీసీసీ అధ్యక్షుడు చిరంజీవి ట్విటర్‌ వేదికగా రామోజీరావుకు ధన్యవాదాలు తెలిపారు. ‘దినసరి కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఛారిటీకి సహృదయంతో మీ వంతు సాయం చేసినందుకు ధన్యవాదాలు సర్‌. చిత్ర పరిశ్రమకు మీరు చేస్తున్న సేవ అసాధారణమైంది. మీరు లెజెండ్‌’ అని చిరు ట్వీట్‌ చేశారు.

* దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1076 కేసులు (ఏప్రిల్‌ 17 సాయంత్రం 5 గంటల వరకు) నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 32 మరణాలు సంభవించినట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 13,835కు చేరింది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా 452 మంది మరణించగా, 1766 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకున్నారని వెల్లడించింది. ప్రస్తుతం 11,616 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది.

* భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలు భక్తులకు అందించేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించింది. ట్ ఆప్ప్ Fఒలిఒ యాప్‌ ద్వారా తలంబ్రాలు బుక్‌ చేసుకోవచ్చని దేవాదాయశాఖ వెల్లడించింది. ఒక కుటుంబానికి రెండు ప్యాకెట్ల చొప్పున బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ఒక్కో ప్యాకెట్‌ ధరను రూ. 20గా నిర్ణయించినట్లు దేవాదాయశాఖ అధికారులు వివరించారు. ఇప్పటికే 10 వేల మంది ఆన్‌లైన్‌లో తలంబ్రాల కోసం బుక్‌ చేసుకున్నారని.. బుక్‌ చేసుకున్నవారికి మూడు రోజుల్లోగా ఇంటికి పంపిస్తామన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అశేషమైన భక్తుల జయజయధ్వానాల నడుమ జరగాల్సిన భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ఈ ఏడాది కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే.

* వలస కార్మికులు ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంచార ఆహార వాహనాలను ప్రారంభించామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ పేదలు, వలస కార్మికులకు ఆహారాన్ని అందిస్తాయన్నారు. వాహనాల ఏర్పాటుకు కృషి చేసిన పర్యాటక శాఖ సిబ్బందిని మంత్రి అభినందించారు.

* కరోనా వైరస్‌పై ప్రజలకు వాస్తవాలు తెలిసేలా శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రజల్లో అనుమానాలు పెంచేలా ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలపై సమగ్ర వివరాలను శ్వేతపత్రం ద్వారా వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఎన్ని టెస్టింగ్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయో తెలపడంతో పాటు క్వారంటైన్‌, ఐసోలేషన్‌ కేంద్రాల సమాచారం తెలపాలన్నారు. అనుమానితులు, రోగుల సంఖ్య పెరిగితే అందుకు తగ్గట్లుగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలో మార్గసూచి ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. మర్కజ్‌ వెళ్లి వచ్చిన వారిని గుర్తించటంపై పూర్తి వివరాలు వెల్లడించాలని కన్నా డిమాండ్‌ చేశారు. వాస్తవాలు చెప్పకపోతే ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోతుందని లేఖలో ఆయన పేర్కొన్నారు.

* వైకాపా నేతల నిర్వాకం వల్లే ఏపీలో కరోనా విస్తరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పేదల ప్రాణాలతో ఆడుకునే హక్కు వైకాపాకు లేదన్నారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం వ్యవరిస్తున్న తీరును తప్పుబట్టారు. పాజిటివ్‌ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్‌బులెటిన్లలో బోగస్‌ అంకెలున్నాయని ఆరోపించారు. కరోనా కేసులు దాచిపెడితే అత్యంత ప్రమాదమని హెచ్చరించారు. రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలపై కేంద్రానికి తప్పుడు సమాచారం అందిస్తున్నారని.. జిల్లా యంత్రాంగం లెక్కలు, రాష్ట్ర ప్రభుత్వ లెక్కల్లో తేడాలున్నాయన్నారు. కరోనా పరీక్షలను బూటకంగా మార్చారని చంద్రబాబు ఆరోపించారు.

* లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరిస్తేనే కరోనాను నియంత్రించడం సాధ్యమవుతుందని ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని రెడ్‌జోన్లలో నివసించే ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు అమరావతి సూపర్‌ మార్కెట్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్‌ సూపర్‌ మార్కెట్‌ను ఆమె ప్రారంభించారు. వారికి ఆర్టీసీ బస్సులు సమకూర్చింది. ఈ సందర్భంగా హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రెడ్‌ జోన్లలో ప్రజలు బయటకు వచ్చేందుకు వీలులేనందున వారి కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రజలు భౌతిక దూరం పాటించి కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరంలోని అన్ని రెడ్‌ జోన్లలో ఇవి అందుబాటులో ఉంటాయని సుచరిత చెప్పారు.

* సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్‌.. తన దృష్టికి వచ్చే చాలా సమస్యలను పరిష్కరిస్తుంటారు. లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఆయనకు విన్నవించుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. చాలా వరకు కేటీఆర్‌ తన కార్యాలయం ద్వారా ఆయా సమస్యలను పరిష్కరిస్తున్నారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఎర్రగడ్డలో ఐదు నెలల పసికందు తాగేందుకు పాలు లేవంటూ పక్క ఇంటి వాళ్లు చేసిన విజ్ఞప్తికి అర్ధరాత్రి సమయమైనా తక్షణమే స్పందించి సహాయం అందించే ఏర్పాటు చేశారు.