Agriculture

పొలానికి వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తాం

AP Gov tTo Buy Paddy From Farmers Directly From The Field-Telugu Agricultural News

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్య సేవలతోపాటు రైతులను ఆదుకోవాలని సీఎం జగన్ మొదట్నుంచీ చెబుతున్నారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కరోనాపై ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్నామన్నారు. కాకినాడ నుంచి పలువురు రైతులతో ఆయన ఫోన్‌ఇన్‌లో మాట్లాడారు. ‘‘ పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి మార్కె్ట్లకు పంపే ఏర్పాట్లు చేస్తోంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే మా ప్రధాన లక్ష్యం. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు నష్టపోకూడదని సీఎం స్పష్టంగా చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా నిలుపుదల చేశాం. వచ్చే ఖరీఫ్‌పైనా ఆలోచనలు చేస్తున్నాం. కూలీల సమస్యతో పని ఆగిపోకుండా వరి కోత యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రైతు పొలాల్లోనే ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశాం’’ అని మంత్రి తెలిపారు. రోజుకు 2 వేల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పటికీ వినియోగం తక్కువగా ఉందని, మరోవైపు గోనె సంచుల కొరత ఉన్న మాట కూడా వాస్తవమేనని కన్నబాబు తెలిపారు. ‘‘ ఇతర రాష్ట్రాల నుంచి గోనె సంచులు రావాల్సి ఉంది. రైతుల వద్ద సంచులు తిరిగి ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కూరగాయల ధరలు రైతులు, వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉన్నాయి. మరోవైపు అరటి రైతులు కూడా ఒత్తిడిలో ఉన్నారు’’ అని అన్నారు. సమస్యల పరిష్కారానికి టోల్‌ ఫ్రీ నెంబర్లు 1902,1907 ఫోన్‌ చేయవచ్చని చెప్పారు.