Devotional

చేబ్రోలు చతుర్ముఖబ్రహ్మ దేవాలయం

చేబ్రోలు చతుర్ముఖబ్రహ్మ దేవాలయం

ఈ ఆలయం గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామంలో వెలసిన క్షేత్రం.

ఈ ఆలయం జిల్లాలోనే కాక రాష్ట్రంలోనే పురాతన ఆలయంగా చరిత్రకెక్కింది.

ఇక్కడ కోనేటిలో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం కలదు.

పూర్వం అమరావతి ప్రాంతాన్ని రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పాలించే కాలంలో దోపిడీ దొంగల తాకిడితో ప్రజలు అల్లాడిపోసాగారు.

ఆ దొంగలు చెడు మార్గాన్ని వీడి తనకి లొంగితే వారికి ఎలాంటి కీడు తలపెట్టను అని అయన అన్నం మీద ఒట్టేసి ప్రమాణం చేస్తాడు.

ఆయన మాటలు నమ్మిన దొంగలు లొంగిపోయారు కానీ, రాజు తన మాట నిలబెట్టుకోలేక వారిని వధిస్తాడు

ఆ తరువాత నుండి అయన భోజనం చేసేప్పుడు అన్నం అంతా రక్తం ఓడుతూ కనిపించడం మొదలైంది.

దీంతో రాజావారు భయపడి పండితులను సంప్రదించగా వారు అన్నం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి అన్నం మీద ఒట్టేసి అపరాధం చేసారు.

దోష పరిహారార్థం బ్రహ్మదేవాలయం కట్టించాలని పండితులు సూచిస్తారు.

అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, శాప కారణంగా బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండటానికి వీలు లేదు.

అపుడు వారు బ్రహ్మతో కలిపి శివుడిని ఒకేమూర్తిగా ప్రతిష్ఠిస్తే ఎలాంటి దోషం ఉండదని చెప్పగా, అలా నిర్మితమైనదే ఈ ఆలయం.

బ్రహ్మదేవుడు కమలగర్భుడు కనుక ఒక కమలంలో ఓ సృష్టికర్త నాలుగు ముఖాలు ఉండి పైన శివలింగాకృతి వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఆ మూర్తిని కోనేరులో ప్రతిష్టించారు.

అయితే దీనికి కూడా ఒక కథ చెబుతారు. ఆగమాల ప్రకారం శివాలయానికి ఎదురుగా, విష్ణుమూర్తి గుడికి వెనుక భాగంలోను, అమ్మవారి ఆలయానికి పక్కభాగంలోను ఏ నిర్మాణము ఉండకూడదు.

బ్రహ్మ ఆలయం గురించి ఏ ఆగమంలోను లేదు కనుక దాంతో ఏ దోషం అంటకుండా ఇలా కోనేటి నడి మధ్యలో నిర్మించారు.

పురాణాల ప్రకారం బ్రహ్మకు పూజ అర్హతలేదు కనుక పరోక్షంగా ఈశ్వరునికి అభిషేకం చేసి అది బ్రహ్మకు చెందేలా రూపొందించబడటం ఈ ఆలయం ప్రత్యేకత.

ఈ ఆలయం కోనేరు మధ్యలో నిర్మించబడి, నాలుగువైపులా శివ, విష్ణు,శక్తి దేవాలయాలతో అలరారుతుంది.

అప్పట్లో చతుర్ముఖ బ్రహ్మ దేవాలయాన్ని ఏనుగుల మీద ఎర్రటి ఇసుకను తీసుకొనివచ్చి కట్టారన్నది చారిత్రక కథనం.

ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళుతుంటారు.

కోనేరులో స్వామి వారి దేవాలయం ఉన్నా నేటికీ చెక్కుచెదరని శిల్ప సౌందర్యం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది.

తొట్ట తొలుత ఈ క్షేత్రం పేరు తాంబ్రావ, తాంబ్రాప. క్రమంగా అది చేబ్రోలు అయింది. లోహ యుగపు మొదలులో ఇక్కడ తామ్ర లోహం చాలా విరివిగా దొరికేదట.

ఇక్కడ రాగి, తామ్రం తో కూడిన తయారీ పనివారు ఉండేవారు.అలా తామ్రమును సంస్కృతంలో ‘చెం’ అని అంటారని.(చిన్న చిన్న రాగి, ఇత్తడి లోటాలను/డొక్కులను చెంబులు అంటారు) ఈ చెంబులు తయారీ అయే పేరు కాస్తా చేబ్రోలు అయిందని వినికిడి.

ఇక్కడే పన్నెండు అడుగుల నటరాజ విగ్రహం ఉండేదట కానీ ప్రస్తుతం ఆ ఆలయమూ లేదు దాని ఆనవాళ్ళు కూడా లేవు అక్కడ. కానీ ఆలయముందు భాగంలో ఉండవలసిన ఒక పెద్ద నంది విగ్రహం మాత్రం ఉంది…

కాలగర్భంలో ఎన్నో ఆలయాలు భూమిలో కలిసిపొయినా ఆంధ్రుల శిల్పకళా ప్రాభవాన్ని చాటిచెప్పే దేవాలయాలింకా ఇక్కడ ఉన్నాయి. పల్లవ, చాళుక్యుల, చోళుల శిల్ప కళా వైభవానికి ఇక్కడి ఆలయాలు వేదికగా ఉన్నాయి.

సుమారు 50 గజాల పొడవు, వెడల్పులతో ఉన్న కోనేరు మధ్యలో స్వామి ఆలయం నిర్మాణమై ఉంది. మధ్యలో సుమారు ఏడు అడుగులు చదరంగా గర్భగుడి, దాని చుట్టూ నాలుగువైపులా ఆరు అడుగుల వెడల్పున వరండా, ముందు వైపు ధ్వజస్తంభం, గర్భగుడిపైన గోపురంతో దేవాలయం నిర్మాణ మైంది. కోనేరు గట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు 10 అడుగుల వెడల్పు న వంతెన నిర్మించారు.

ఇక ఆలయ గర్భగుడి విషయానికి వస్తే, నాలుగు అడుగుల ఎత్తున, నాలుగు అడుగుల కైవారం ఉండే శిలపై పద్మం ఆకారాన్ని తయారు చేసి దాని మధ్యలో మూడు అడుగుల ఎత్తున నలుచదరంగా ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూర్చుని వున్న భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. లింగాకారంగా ఉండటంతో స్వామివారిని బ్రహ్మేశ్వరునిగా పిలుస్తుంటారు.

బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయసముదాయంలో రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం, భీమేరాశ్వరాలయం, వేణుగోపాల స్వామి, నరసింహస్వామి, ఆంజనేయస్వామి, వీరభద్రుడు, రంగనాధ స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, సహస్ర లింగేశ్వర స్వామి, నవగ్రహమూర్తులు, నాగేశ్వరాలయాలు, ఒక నంది విగ్రహం పక్కపక్కనే ఉన్నాయి.

ఇలాంటి అరుదైన పురాతనమైన ఆలయాన్ని దర్శించి మనం కూడా ఆ బ్రహ్మ దేవుని ఆశీస్సులు పొందుదాం.