Editorials

సాయపడే హృదయమే గొప్పది

Helping Heart Is The Best Heart || TNILIVE Editorials

సాయపడే హృదయం

మనిషి తనను తాను చూసుకున్నప్పుడు తన శరీరం కనిపిస్తుంది. తనకో వ్యక్తిత్వం ఉన్నట్లు అనిపిస్తుంది. తన ఉనికి తనకు స్పష్టంగా తెలుస్తుంది.

నేను అనే భావం మనిషికి చాలా ఆనందం కలిగిస్తుంది. పుట్టుకలో లేని నేను ఎదుగుతున్న కొద్దీ ఎరుకలోకి వచ్చి మొక్క మానైనట్లుగా మహావృక్షంగా పెరుగుతుంది.

నేేను అనేది శిఖరంలా, నాది అనేది ఆధార పీఠంలా మనిషి బతుకుతుంటాడు. ఒక్కోసారి ఒక్కడే అంతా తానే అయి చేస్తున్న భావనకు లోనవుతుంటాడు. అది అతడి మనసు చేసే మాయాజాలం.

ఎక్కడా ఏ సహాయం తీసుకోకుండా గాలికి పుట్టి గండాన పెరిగినట్లు, తనకు ఎవరి అవసరం లేనట్లు ఊహల్లో ఒక్కోసారి మనిషికి అనిపిస్తుంది. అది అందమైన భ్రమ.

నిజానికి మనిషి ఎందరిమీదో ఆధారపడి బతుకుతాడు. ఏ సహాయమూ లేకుండా జీవితం సాగదు.

తల్లిగర్భంలోనే శిశువుకు రూపం ఏర్పడుతుంది. తల్లి బతుకుతో బిడ్డ బతుకు ముడివడి ఉంటుంది. ఇంతకు మించిన సహాయం లోకంలో లేనే లేదు. అందుకే తల్లి రుణం తీర్చడం ఏ బిడ్డకూ సాధ్యం కాదు అంటారు.

పుట్టి భూమ్మీద పడిన శిశువు గాలితో, నీటితో, పాలతో, తల్లి ప్రేమతో బతుకుతాడు. పెరుగుతున్నకొద్దీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో సహాయాల మూలాన మనిషి శరీరాన్ని నిలబెట్టుకుని ఒక వ్యక్తిత్వం సంపాదించుకుంటాడు.

అన్ని వనరులున్నా, అందరూ ఉన్నా- మనిషి మీద మనిషి ఆధారపడి బతకాలి. ఒకరికొకరు సహాయం చేసుకోకుండా మానవ జీవనం ముందుకు సాగదు.

గొప్ప మనుషులు, మహానుభావులు- లోకం తమకు చేసిన సహాయం వల్లనే ఇంతటి స్థాయికి వచ్చామని చెబుతూ ఉంటారు.

శ్రీకృష్ణుడి సహాయం లేకుండా పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చెయ్యగలిగేవారా? శ్రీరాముణ్ని కలిసిన హనుమ చేసిన సహాయం సీతమ్మను చూపించడానికే కదా. దివ్య సహాయాలు దైవ కార్యాల్లో ఎన్నో ఉన్నాయి.

యోగికి యోగంలో సహాయం కావాలి. జ్ఞానికి జ్ఞానంలో సహాయం అవసరం. భక్తుడికి నిరంతరం భగవంతుడి సహాయం తప్పనిసరి.

సహాయం ఒక దివ్యమైన, శక్తిమంతమైన ఆపన్న హస్తం. ఆ చెయ్యి వెనక ఉండి నడిపించకపోతే మహాకార్యాలెన్నో ఆగిపోతాయి.

అవసరమైనప్పుడు సహాయాన్ని కోరాలి. సహాయం కోసం పోరాడాలి. సహాయం కోసం ప్రార్థించాలి. సహాయం కోసం శరణాగతి చెందాలి.

మనుషులు మనుషులకే కాదు, పశుపక్ష్యాదులకూ ప్రేమతో సహాయం చెయ్యాలి.

మనకు మనం అవసరాలకు, ఆపదలకు ఆదుకుంటున్నతీరు చూసినప్పుడు ఈశ్వరుడి మనసు కరుగుతుంది. తనవంతుగా కొండంత బలాన్ని, ధైర్యాన్ని, ఆశీర్వచనాన్ని అందించి దయగల దేవుడు అని నిరూపించుకుంటాడు.

మన కోసం మనం బతుకుతూ ఇతరుల కోసం బతకాలి. సహాయం చెయ్యడానికి ముందుండే మనిషే మనిషి. సహాయం చెయ్యడానికి అవకాశం కోసం ఎదురుచూసే మనిషిదే గొప్ప హృదయం.

యోగక్షేమాలు చూసేవాడు భగవంతుడు. మనుషుల ద్వారా ఎవరెవరికి ఏ సమయానికి ఏ సహాయం చెయ్యాలో క్షుణ్నంగా తెలిసినవాడు ఆయన. అది ఆయన ప్రణాళిక. తనకు కావలసిన పూజ చేయించుకుని, దానికి తగిన ఫలాన్ని ఇచ్చి, అతడి పాపాన్ని తొలగించడానికి చేసే సహాయమే దైవానుగ్రహం.

సహాయం కావాలంటే, సహాయం చెయ్యాలి. ఎప్పుడో ఎవరికో చేసిన సహాయమే ఇప్పుడు మనల్ని సుఖంగా ఉంచుతోంది!