Kids

కేరళలో విద్యాబోధన చిన్నారులను అలరిస్తుంది

Kerala Teaching Methodology Is Liked By Kids

ప్రజా ప్రభుత్వాలు ఏం చేస్తాయి?నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తాయి. కష్టకాలాన కొత్త దారులను కనుక్కొంటాయి. ప్రజాప్రయోజనకర పనులు చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటాయి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం అందుకు ఒక బలమైన ఉదాహరణ. మొన్న కోవిడ్‌ కేసుల అదుపులో … నేడు విద్యార్థుల చెంతకు చదువును చేర్చటంలో ఆ రాష్ట్రం దేశానికే తలమానికం. కేరళలోని మలప్పురమ్‌ జిల్లాలోని మూర్కనాడ్‌ ప్రాంతంలో ‘ఎఇఎంఎయుపి’ స్కూలు ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తోంది. ఆ స్కూలులోని ఎల్‌.కె.జి పిల్లలకు సీరియస్‌గా ఆన్‌లైన్‌ క్లాసు జరుగుతోంది. ఆ రోజు టీచర్‌ అడవిలో ఉండే కొన్ని సాధు జంతువుల గురించి క్లాసు చెబుతున్నారు. ఏనుగు కూడా ఆ జంతువుల్లో ఉంది. ఇంతలో హఠాత్తుగా ఆ క్లాసులోకి ఒక ఏనుగు ప్రవేశించింది. చక్కగా డ్యాన్స్‌ చేసి, పిల్లలను అలరించింది. ఆ దృశ్యాన్ని పిల్లలు నోరెళ్లబెట్టి చూస్తూ టీచర్‌ చెబుతున్న విషయాలను శ్రద్ధగా వింటున్నారు. పాఠాలపై శ్రద్ధ పెంచేందుకు వాస్తవికత జోడించారన్నమాట! ఆరో తరగతి పిల్లలకు హిందీ క్లాస్‌ మొదలైంది. ఆ రోజు ఆవు పాఠం చెబుతున్నారు హిందీ టీచర్‌. షరా మామూలుగా ఆ క్లాసులోకి ఆవు వచ్చేసింది. ఇంకేముంది… పిల్లలందరూ ఆవు వంక తదేకంగా చూస్తూ టీచర్‌ చెబుతున్న నోట్స్‌ రాసుకుంటున్నారు.

ఐదో తరగతి పిల్లలకు క్లాస్‌ చెప్పటానికి సోషల్‌ టీచర్‌ ఆన్‌లైన్‌లోకి వచ్చారు. ఆమె వస్తూనే ఆ రోజు విశ్వం గురించి తెలుసుకుందామని చెప్పారు. క్లాసు రూములోనైతే బోర్డు మీద బొమ్మలు వేసి చూపిస్తూ వివరించొచ్చు. మరి ఆన్‌లైన్‌లో సోలార్‌ క్లాస్‌ ఎలా చెబుతారు? అనుకుంటూ తల్లిదండ్రులు కూడా ఆన్‌లైన్‌లో కూర్చున్నారు. టీచర్‌ క్లాస్‌ ప్రారంభించారు. ఆమె విశ్వం గురించి చెబుతున్నప్పుడు … ఆన్‌లైన్‌ క్లాసులో విశ్వం ప్రత్యక్షమైంది. దాంట్లో గ్రహాలను, నక్షత్రాలను, సూర్యుడు, భూమి, చంద్రుడు వంటి వాటి పరిభ్రమణలను ఆమె విశ్లేషిస్తున్నారు. కేరళలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ క్లాసులు పిల్లలనే కాదు; వారి తల్లిదండ్రులనూ అలరిస్తున్నాయి. రోబోల గురించి చెప్పినా, వర్షం గురించి వివరించినా టీచరు మాటలకు పరిమితం కారు. నేరుగా ఆ అనుభూతిని కళ్లకు కట్టిస్తారు. నిజమైన రోబోలు తెరమీద ప్రత్యక్షం అవుతాయి. నిజమైన వాన శబ్ద సహితంగా వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఇవన్నీ కృత్రిమం అయినప్పటికీ పిల్లల్లో ఆసక్తి పెరిగేందుకు ఎంతో దోహదపడతాయనడంలో సందేహం లేదు. విద్యాబోధనలో కేరళ సృష్టించిన కొత్త ఒరవడి ఇది. దేశంలో అక్షరాస్యతా శాతంలో కేరళ అగ్రస్థానంలో ఉంది. కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో స్కూళ్లు మూతబడ్డాయి. ఈ సమయంలో మొట్టమొదటిగా ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణలో కొత్త ఒరఒడికి శ్రీకారం చుట్టింది కేరళ ప్రభుత్వం. ప్రపంచ నివేదికల విశ్లేషణల ప్రకారం ఆన్‌లైన్‌క్లాసుల వల్ల డ్రాపౌట్లు పెరుగుతాయని, క్రమేణా ఇది విద్యాసంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నాయి. కానీ, పిల్లల్లో ఆసక్తిని రగిలిస్తూ వినూత్నంగా నిర్వహించే ఆన్‌లైన్‌ క్లాసులు వారిలో విద్యపై మక్కువ చూపుతాయని కేరళ ప్రభుత్వం నిరూపించింది. ఈ క్లాసులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను, సాంకేతిక బృందాన్ని కేరళ స్పీకర్‌ పి.శ్రీరామకృష్ణన్‌, ప్రముఖ దర్శకుడు లాల్‌జోస్‌ అభినందించారు. మనం కూడా ప్రశంసించకుండా ఉండలేం కదా? కళ్లెదుట టీచర్లు, తోటి విద్యార్థులూ సందడి చేసే నిజమైన స్కూలు వాతావరణానికి ఆన్‌లైన్‌ క్లాసులు ప్రత్యామ్నాయం కావు. కానీ, కరోనా కష్టకాలం వేళ… విద్యార్థులకు కంప్యూటర్లు, డిజిటల్‌ క్లాసురూములూ సమకూర్చి, సృజనాత్మకంగా విద్యాబోధన చేయడం అభినందనీయం కదా?.