Business

లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్‌లో వీటికే గిరాకీ-వాణిజ్యం

Business News Roundup - Indians Craved For These Items Online During LockDown

* లాక్ డౌన్ రోజుల్లో భారతీయులు ఆన్ లైన్ లో ఎక్కువగా కొనుగోళ్లు జరిపింది ఇవే!భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు గత మార్చి చివరి నుంచి లాక్ డౌన్ కొనసాగిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ రోజుల్లో చాలావరకు దుకాణాలు మూసివేయడం, ప్రజలు బయట తిరిగేందుకు వీలుకాకపోవడంతో అత్యధికులు ఆన్ లైన్ షాపింగ్ కు మొగ్గు చూపారు. తాజాగా ఓ అధ్యయనంలో భారతీయులు లాక్ డౌన్ రోజుల్లో ఎక్కువగా ఏమేమి కొన్నారో వెల్లడింది. అత్యధికంగా 55 శాతం మంది కిరాణా వస్తువులు కొన్నారట. సాధారణంగా దుకాణాల్లో కొనుగోలు చేసే నిత్యావసరాలను కూడా ఆన్ లైన్ లోనే ఆర్డర్ ఇచ్చారట.ఇక ఆ తర్వాత స్థానంలో 53 శాతం మంది దుస్తుల కొనుగోళ్లకు మొగ్గు చూపినట్టు తేలింది. ఆన్ లైన్ దుస్తులు కాబట్టి ఎక్కువగా యువతే ఆర్డర్లు బుక్ చేసినట్టు భావించవచ్చు. ఇక ఎలక్ట్రానిక్ వస్తువులపై 50 శాతం మంది ఖర్చు చేయగా, ఆన్ లైన్ ద్వారా ఔషధాలను 44 శాతం మంది తెప్పించుకున్నట్టు వెల్లడైంది.అంతేకాదు, ఈ లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఎక్కవగా ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన రంగాలు కూడా ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. వాహనాల గురించి అత్యధికంగా 60 శాతం మంది ఆన్ లైన్ లో సెర్చ్ చేయగా, 40 శాతం మంది ప్రయాణాలు, టికెట్ బుకింగ్ ల గురించి వెదికారట!

* ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశీయంగా బంగారానికి గిరాకీ 70 శాతం క్షీణించి 63.7 టన్నులకు పరిమితమైందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. ఏడాది క్రితం ఇదే సమయంలో 213.2 టన్నుల పసిడికి గిరాకీ లభించిందని పేర్కొంది. విలువ రీత్యా చూసినా రూ.62,420 కోట్ల నుంచి 57 శాతం తగ్గి రూ.26,600 కోట్లకు పరిమితమైందని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ సోమసుందరం వెల్లడించారు. కొవిడ్‌ సంక్షోభం వల్ల దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు తోడు, ధరలు బాగా పెరగడం కూడా ఈసారి బంగారం గిరాకీ తగ్గేందుకు కారణాలయ్యాయని వివరించారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఆర్థిక పునరుత్తేజానికి అనుగుణంగా పసిడికీ గిరాకీ ఏర్పడవచ్చని, ముఖ్యంగా దీపావళి పండుగ -ధన త్రయోదశికి కొవిడ్‌ పరిస్థితులు కుదుట పడతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2019 జనవరి నుంచి చూస్తే 60 శాతం, ఈ ఏడాది జనవరి నుంచి 20 శాతం మేర పసిడి ధరలు పెరిగాయని, ఈ స్థాయిలో ఆదాయాలు పెరగడం లేదని గుర్తు చేశారు. అందువల్ల పూర్తి ఏడాదికి పరిస్థితిని అంచనా వేయలేమని పేరొన్నారు.

* బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లను సుప్రీం కోర్టు నిలిపివేసింది. లాక్‌డౌన్‌ సమయంలో అసాధారణ రీతిలో జరిగిన ఆ వాహన విక్రయాల అంశం తేలే వరకు రిజిస్ట్రేషన్లు చేయొద్దని అధికారులను ఆదేశించింది. లాక్‌డౌన్‌ సమయంలో మార్చి చివర్లో, ఆ తర్వాత పెద్దఎత్తున ఈ తరహా వాహన విక్రయాలు చేపట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది.

* దేశీయ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ వంటి షేర్లు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో సూచీలు నేలచూపులు చూశాయి. అయితే, ఫార్మా రంగ షేర్లు రాణించడంతో స్వల్ప నష్టాలతో మార్కెట్లు గట్టెక్కాయి.

* కాలపరిమితి రుణ వాయిదాలపై మారటోరియాన్ని ఆగస్టు తర్వాత పొడగించాల్సిన అవసరం లేదని భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ అన్నారు. ఆరు నెలల మారటోరియం సరిపోతుందని పేర్కొన్నారు. మరింత కాలం పొడగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.