Kids

నేడు పింగళి వెంకయ్య జయంతి

నేడు పింగళి వెంకయ్య జయంతి

మువ్వన్నెల జెండా భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక, జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామములో హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి దివి తాలూకా యార్లగడ్డ గ్రామ కరణంగా ఉండేవాడు. అతని తాత గారు అడివి వెంకటాచలం గారు చల్లపల్లి సంస్థానం ఠాణేదారు. అతనికి పెదకళ్ళేపల్లి వదిలీ కావటం వల్ల వెంకయ్యగారి ప్రాథమిక విద్య అక్కడే పూర్తి అయింది. అతను చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్థి. ప్రాథమిక విద్య చల్లపల్లి లోను, మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలోనూ అభ్యసించాడు. ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయుటకు కొలంబో వెళ్లాడు. చొరవ, సాహసం మూర్తీభవించిన అతను బొంబాయి వెళ్ళి, 19వ యేట సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాలోని బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. స్వదేశం వస్తూ అరేబియా, ఆప్ఘనిస్థాన్ లు చూచి వచ్చాడు.
1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయ పతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను సమకూర్చాడు వెంకయ్య. అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు, సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు. గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణపతాకం పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోనే. కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం. 1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం.
వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు ఆయనను చుట్టుముట్టాయి. మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో ఆయన గుడిసె వేసుకొని దారిద్ర్య జీవితాన్ని గడపవలసి వచ్చింది. ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. కాని ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. మన జాతికొక కేతనాన్ని నిర్మించాడాయన. ఇతర దేశాలలో జాతీయ పతాక నిర్మాతలను ఆ ప్రభుత్వాలు ఎంతగానో గౌరవిస్తాయి. వారికి కావలసిన వసతులను ప్రభుత్వాలే ఉచితంగా సమకూరుస్తాయి. మన ప్రభుత్వం వెంకయ్యని గుర్తించకపోవటం శోచనీయం, జాతీయపతాకాన్ని గురించి ప్రభుత్వం ప్రచురించిన పుస్తకంలో, మన పతాక నిర్మాత ఒక తెలుగువాడు అని వ్రాశారే కాని, వెంకయ్య పేరుని సూచించకపోవడం విచారకరం. తెలుగువారు తమ వారిని గౌరవించటంలో ఏనాడూ ముందంజవేయలేదు. జీవితాంతం దేశం కొరకు, స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు ‘ త్రివేణి ‘ సంపాదకులు డా. భావరాజు నరసింహారావు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా.టి.వి.ఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 1963 జనవరి 15న వెంకయ్యను సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తరువాత ఆరు నెలలకే 1963, జూలై 4 న వెంకయ్య దివంగతుడయ్యాడు. కన్నుమూసేముందు ఆయన చివరి కోరికను వెల్లడిస్తూ ” నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక ” అన్నాడు. జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య. ఆయనను ప్రజలు మరచిపోతున్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాదులో ట్యాంక్ బండ్ పై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ఆయన దర్శన భాగ్యం ప్రజలకు లభింపజేసింది. పింగళి జయంతి, వర్థంతులను ప్రభుత్వం అధికారికంగా జరపాలి. అప్పుడే పింగళికి నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది.